గాయాలు కనిపించవు
గాయాలు మాట్లాడవు
గాయాలు సాక్ష్యమివ్వవు
ఈ చరిత్రకు దేహమే మొదలూ దేహమే చివరా!!
వాళ్ల బతుకులు ఎప్పుడెలా ఆరంభమయ్యాయో
ఎక్కడ ఎప్పుడెలా అంతమయ్యాయో
ఒక్క సాక్ష్యమూ దొరకదు
ఒక్క మాటా వినిపించదు
ఒక్క కాలిజాడా మిగలదు
అంతటా మౌనం
ఏదో ఒక చివర నాలుగు గుసగుసలు
ఎక్కడో ఓ చోట మృత్యువు చిరునామా
ఆద్యంతాల నడుమ నలిగే నిశ్శబ్ద చారికలు
వాళ్ల పుస్తకాల్లోకి తొంగి చూద్దామనుకుంటాను
ఒక్క పుటనయినా చింపి మీకు చదివి వినిపిద్దామనుకుంటాను
కన్నీళ్లతో అలుక్కుపోయిన అక్షరాల్ని
మీకు కన్పించేలా తిరగరాద్దామనుకుంటాను
మనశ్శరీరాల్ని మండించే కార్చిచ్చుని
స్మృతుల్లో నిలపాలనుకుంటాను
అయినా
అంతటా ఓ మౌనం
ఎక్కడో ఓ చోట
ఏదో ఒక కొండ
చివర్న భూమ్యాకాశాల్ని నిలదీస్తూ కొన్ని ప్రశ్నలు
కొండల్ని తవ్వి
అడవుల్ని చీల్చిన
కాలిబాటల్ని ఛిద్రం చేసిన తెల్లమృగాలు
అందమయిన వారి ముఖబింబాల మీద
చెక్కిన గాయాలు
ఇప్పుడు… అడవులన్నీ శిథిలస్మృతులు
అవును కానీ…
ఎక్కడైనా రక్తపుటేరులు మాట్లాడతాయా?
ఎక్కడైనా జ్ఞాపకాలు గొంతెత్తి నిలదీస్తాయా?
ఎక్కడైనా విరిగిపడ్డ చెట్లు సాక్ష్యాలు చెపుతాయా?
ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా అయినా
ఈ హింసాచరిత్రకు దేహమే మొదలూ, దేహమే చివరా!!
ఓ అర్థరాత్రి గీసిన లక్ష్మణ రేఖ
వాళ్ల స్థలకాలాల్ని విభజించింది
విషాదరేఖకి అటూ ఇటూ కూడా
మతాల ముసుగు వేసుకున్న మానవమృగాలే!
నిప్పులగుండాల్లోంచి పైకి రాలేని సీతలే!!
చారెడు మట్టిని
గుప్పెడు వేర్లని
వాళ్ల శవాలపై చల్లి
చేతులు దులిపేసుకున్నాం కదా!
అంతా మన పిచ్చి గానీ
ప్రవహించే నదులు సాక్ష్యాలు చెపుతాయా?
శవాల్ని మోసిన బావులు మాట్లాడతాయా?
మట్టివాసనలు మనుష్యుల మూలాల్ని పట్టిస్తాయా?
అంతటా ఓ మౌనం
ఏదో ఒక చివర నాలుగు గుసగుసలు
ఎక్కడో ఓ చోట మృత్యువు చిరునామా
ఆద్యంతాల నడుమ నలిగే నిశ్శబ్దచారికలు
కొండల్ని దాటి కోనల్ని దాటి
మైదానాల మీదకు పరుగులు తీశామా
మాయాబజార్ల వాకిళ్లు తెరిచి
కొత్తయుగాల్ని స్వాగతించామా?
వెయ్యికాళ్ల పురుగులతో
సాలెపురుగుల వెబ్లతో చెలిమి చేశామా?
ఉన్మాద ప్రేమ ముసుగేసుకున్న
మాయదారి మృగమొకటి
ఇప్పుడిక్కడ మంత్రనగరుల్లో సంచరిస్తోంది
అమ్మాయిలూ! పారాహుషార్!
అంతా మన భ్రమ కానీ
ఎక్కడైనా గొడ్డళ్లు, యాసిడ్లు సాక్ష్యాలు చెపుతాయా?
ఎక్కడైనా కాల్సెంటర్ల టాక్సీలు మాట్లాడతాయా?
మాట్లాడేందుకు గొంతుల్లేక
రాసేందుకు చేతుల్లేక
చూపించేందుకు మొహాల్లేక
నిశ్శబ్దంగా, నిర్వేదంగా
అక్కడొక చెక్కేసిన బోధివృక్షం నిల్చొని వుంది
ఎన్నాళ్లీ జ్ఞాపకాల కుండల్ని మోసుకుతిరగను?
ఎన్నాళ్లీ కన్నీళ్ల తర్పణాల్ని వదలను?
కాలుతున్న శవాలతో ఎన్నాళ్లు సహజీవనం చేయను?
ఈ హింసకు వాక్యాల్లేవు
ఈ హింసకు సాక్ష్యాల్లేవు
ఎప్పుడు చెప్పినా ఒక్కటే కథ
ఒక్కటే కథనం
ఈ హింసాచరిత్రకు దేహమే మొదలూ, దేహమే చివరా!!
(praanahita Jan 08)
I enjoyed the entire site and the poetry there in. The author has the knack of choosing the right words to convey the UDWEGAMS.
It is relaxing to read them.
kalpana rentala gariki na joharulu
namaste