విస్మృతి
జనవరి 17, 2008 ద్వారా kalpanarentala
నిద్ర నాకు గాయాన్ని కానుక చేసింది
గాయం నాకు రాత్రిని కానుక చేసింది
ఈ రాత్రినేం చేసుకొను?
ఈ చీకటిని ఎలా మూటకట్టుకోను?
నిద్ర పెట్టె తీసి
చంద్రకాంత శిలానేత్రాలని తెరిచాను
కన్నీటిని దాచుకుంది దుఖ్ఖం
నిద్ర రాదు
కలలూ రావు
నిజాల్ని అబద్దాలుగా చూడటం ఎలా?
నిద్రంటే
నిజాల్ని దాచుకోవటమేగా
కలలంటే
స్ర్ముతుల్ని ఎగరేయటమేగా
ఏ నిజ సూర్య కిరణంలోంచో
నిద్ర వస్తూ వుంటుంది
నా పార్ధివ కాంక్షల్ని
భుజాన మోసుకెళ్ళేందుకు-
వెళుతూ వెళుతూ
ఓ అబద్దాన్ని జారవిడిచింది
అది పగలై నన్ను నిద్రపుచ్చింది
పసిపాపై జోలపాడింది
(ప్రజాతంత్ర సాహిత్య సంచిక, 2001)