బిల్కీస్ బానొ.
గోద్రా దుర్ఘటన అనంతరం గుజరాత్లో జరిగిన మతకల్లోలాల నరమేధంలో మోడీ మార్క్ హిందుత్వానికి బలైపోయిన మన తోటి బెహన్.
బిల్కీస్ బానో జీవితం రాత్రికి రాత్రి ఎలా చిధ్రమైపోయిందో చెప్పటానికి యే బాష సరిపోదు. నిఘంటువు లోని యే పదాలు పనికిరావు. ఎందుకంటే స్త్రీల శరీరలపై జరిగే హింస వ్యక్తీకరణకు అక్షరాల్లేవు. పదాల్లేవు. వాక్యాల్లేవు. బిల్కీస్ బానో ఇవాళ కేవలం ఓ గుజరాతీ ముస్లిం మహిళ మాత్రమే కాదు. అది నేనో, మీరో, మన పక్కింటి అమ్మాయో కావచ్చు. 2002 మార్చి 3 న ఆమెపై సామూహిక అత్యాచరం జరిగేవరకు ఆమెకున్నది ఒకే ఒక్క ఐడెంటిటి. అది రంధికపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిగ మాత్రమే.ఆ గ్రామానికి చెందిన హిందువులు, ముస్లింలు ఇద్దరికీ కూడ ఆ అమ్మయి ఆ వూరిపిల్ల. అంతే. అప్పుడామెకు గోద్రా ముస్లింలు కూద ఔట్ సైడర్స్ మాత్రమే. హిందు, ముస్లింల సంబంధ బాందవ్యాలు, సాంఘిక-రాజకీయ అంశాలు ఇవేమి తెలియని, తెలుసుకోవల్సిన అవసరం లేని అతి సాధారణ గ్రుహిణి.
ఆరునెలల గర్భవతి అయిన బిల్కీస్ పై జరిగింది సామూహిక అత్యాచారం ఒక్కటే కాదు. ఆమె మూడేళ్ళ కూతురిని అమానుషంగా రాయితో తలపై బాది చంపేశారు. ఆమె తన తల్లిని, ఇద్దరు అప్పచెల్లెళ్ళను , అత్తను, ఓ రకంగా మొత్తం తన కుటుంబానికి చెందిన 14 మందిని కోల్పోయింది. ఆ హత్యలన్నీ అమె కళ్ళెదుట జరిగాయి.
అర్ధరాత్రి కలలో భయంకరమైన పీడకల వస్తే మనం గట్టిగ అరుస్తాం.కాని ఒక్క శబ్దం కూడా బయటకు రాకుండా లోపల్లోపలే ఆ కేక అణిగిపోతుంది చెప్పుకోలేని బాధలాగ. పగలు, రాత్రి కూడా నిరంతరం అలాంటి పీడకలల మధ్య బిల్కీస్ ఇప్పటికీ జీవచ్ఛవం లాగానే బతుకుతోంది. ఈ సంఘటన జరిగాక మొదట ఏడాది వరకు ఆమె మాట కూడా రాక మౌనంగా మిగిలిపోయింది. తనపై అత్యాచారం చేసి తన వాళ్ళందరిని చంపేసిన వూరివాళ్ళపై, పోలీసులపై కేసు పెట్టి గత ఆరేళ్ళుగా న్యాయం కోసం ఆమె పోరాటం చేస్తుంటే ఇటీవల కోర్టు తీర్పు వెలువడింది.
నిందితుల్లో 12 మందికి జైలు శిక్ష పడింది. ఇది బిల్కీస్ కి, ఈ పోరాటంలో , ఈ విషాదంలో అచ్చంగా ఆమెకు తోడు-నీడగా నిలిచిన అమె భర్త యాకూబ్ కి కాసింత వూరట. ఈ న్యాయపోరాటం వెనుక ఎంతోమంది క్రుషి,పట్టుదల, ప్రోత్సాహం వున్నయి. కాని గత ఆరేళ్ళుగా ఆమె కుటుంబం సొంత వూరిని వదిలేసి అజ్ఞాతంలో బతుకుతూ అనేక చోట్లకు మకాం మార్చల్సి వచ్చింది. ఇప్పటికి ఆమె తన వూరు ఇక ఎప్పటికీ తిరిగి వెళ్ళలేనంటోంది. గొడ్డు, గోదా, కుటుంబం అన్ని పోయాయి. మా భూమి అక్కడే పడి వుంది. ఆ బీడుపడ్డ భూమి ఎక్కడకు వెళ్ళగలదు? అందుకని అక్కడే పడి వుంటుంది అంటుందామె నిర్వేదంగా.
ఇప్పటికీ బిల్కీస్ ఎంత ఆలోచించినా, వొక విషయం అర్ధం చేసుకోలేక పోతోంది. ఎవరో అపరిచితులు, ముక్కూ మొహం తెలియని వారు తనపై అత్యాచారం చేయడం, తన వారినందరినీ చంపేయడం చేస్తే సరే. కాని, ఇవన్నీ చేసింది తన వూరి వాళ్ళు. చిన్నప్పటి నించీ యే మనుషుల మధ్య అయితే పెరిగి పెద్దది అయ్యిందో, యే వూరి వారినయితే తన సొంత అన్న దమ్ముల్లాంటి వారని భ్రమ పడిందో వాళ్ళు తనెవరో తెలియనట్టు, తాను యేమీ కానట్టు తనని రోడ్డు మీద తరిమి తరిమి కొట్టి, నడి రోడ్డు పై వివస్త్రను చేసి, తనపై యెలా అత్యాచారం చేయగలిగారు, పసి పిల్లతో సహా తన కుటుంబాన్ని యెలా పొట్టన పెట్టుకో గలిగారు…ఆమెకి యెంత ఆలోచించినా అర్ధం కావడం లేదు. అందుకే ఇంకెప్పటికీ ఆ వూళ్ళోకి అడుగు పెట్ట లేనంటోంది.
ఆరేళ్ళ క్రితం అయినా, ఇప్పుడయినా ఆమెకున్న వొకే వొక జీవితాశయం తన పిల్లల్ని బాగా చదివించి, పెద్ద వాళ్ళని చేయాలని, మంచి వాళ్ళుగా తీర్చి దిద్దలని. యే తల్లి అయినా కోరుకునేది అదే కదా!
భారత న్యాయ స్థానంలొ బిల్కీస్ లాంటి మహిళకు ఈ మాత్రం అయినా న్యాయం జరగడం శుభ పరిణామమే. కాని, ఈ ప్రయాణం సుదీర్ఘమయింది. బిల్కిస్ కుటుంబం ఇంకా ఈ రోడ్డు పై చాలా దూరం ప్రయాణించాలి. ఈ కేసులో తప్పించుకున్న డాక్టర్లు, ఇతరులు కొందరికి శిక్ష పడెంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తోంది బిల్కీస్ బాను. ఈ కేసు పూర్తిగా విచారణ జరిగి, చట్ట పరంగా నిందితులందరికీ శిక్ష పడటానికి ఇంకా చాలా సమయం పట్ట వచ్చు.
ఇప్పటి వరకైనా, ఇక ముందయినా బిల్కిస్ కుటుంబానికి భద్రత లేదని మనందరికీ తెలిసిన విషయమే. నిందితులందరికీ శిక్ష పడినంత మాత్రాన బిల్కిస్ కి న్యాయం జరిగినట్టుగా నేనయితే భావించలేను. వేటినయితే ఆమె పొగొట్టుకుందో, అవెప్పటికీ ఆమెకి తిరిగి దక్కవు. పీడ కలల్లెకుండా ఆమె యెప్పటికయినా సుఖంగా నిద్ర పోగలుగుతుందా? ఆమెకు జరిగిన అన్యాయానికి మనం సిగ్గుతో తల వంచుకోవడం తప్ప యేమయినా చేయగలమా?
గుజరాత్లో ఆమెకు గాని, ఆమె లాంటి బాధితులకు గాని న్యాయం జరగదని జగమెరిగిన సత్యం. అందుకని, తన కేసును గుజరాత్ రాష్ట్రం నించి తప్పించమని పిటిషను పెట్టుకోవడం వల్ల ఈ మాత్రం అయినా ఆమెకు న్యాయం జరిగింది. కాని, గుజరాత్లో మళ్ళీ మోడి బ్యాలెట్ తీర్పులో విజయం సాధించి గద్దెనెక్కారు. మోడి విజయం హిందువుల విజయంగా దేస విదేసాల్లోని హిందువులు సంబరాలు చేసుకున్నారు. మోడి, ఆయన అనుచర గణం నమ్ముతున్నదే హిందూత్వమయితే నాకు ఆ హిందూత్వం వద్దు. గోధ్రా రైల్వే స్టేషనులో తగలబెట్ట బడిన 57 మంది హిందువులెవరో బిల్కిస్ బానూకి తెలియదు. ఆ పనికి పాల్పడింది కొందరు ముస్లింలు కాబట్టి, మత పిచ్చిలో కొట్టు మిట్టాడే కొందరు హిందువులు బానొ లాంటి వారి జీవితాలను కాలరాసారు. ముస్లిం ఆడ పడుచుల పై అత్యాచారాలు చేసి, గర్భస్త శిశువులతో సహా కత్తులతో బయటికి లాగ గలిగిన కొందరు హిందువులు పుట్టిన మతంలో నేను కూడా పుట్టినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను.
క్షమించు, బిల్కీస్……
జనవరి 25, 2008
yami rayalo teliyatam ledu.
Thanks for the honesty Kalpana garu
బిల్కిస్ పై జరిగిన హింస అత్యంత హేయం. ప్రతీకారేచ్చ మనుషులను పిశాచులుగా మారుస్తుంది. అలాగే విశృంఖల అధికారం కూడా. నిజాం పిశాచి రజాకార్ల పాలనలో ఎంతో మంది హైందవ స్త్రీలకు జరిగిన అన్యాయం హింస మానవజాతికే తలవంపులు.
బిల్కిస్ బానో పట్ల జరిగిన ఈ అకృత్యం అత్యంత హేయం. నిస్సందేహంగా జాతికి, దేశానికి తలవంపులు తెచ్చే సంఘటన.
కానీ ఈ సంఘటనకి-ఒక హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడటానికి సంబంధం ఏమిటి ?
మతం అనేది ఒక ధార్మిక భావన. ఏ మతమయినా ఇలాంటివి చేయమని చెప్పదు.
మతమౌఢ్యాన్ని ఖండించే ప్రయత్నంలో మీరు మతాన్ని కూడా ఖండిస్తున్నారేమో ఆలోచించండి.
ఒకవేళ మీరు ‘మతం’ అనే భావనకే అతీతులు అయితే “నేను హిందూమతంలో పుట్టినందుకు” అనే వ్యాఖ్య రాసి ఉండరనుకుంటా.
“మోడి విజయం హిందువుల విజయంగా దేస విదేసాల్లోని హిందువులు సంబరాలు చేసుకున్నారు.”
ఈ వ్యాఖ్య మరీ stereo Type లాగా లేదూ ?
మీరు చూసిన రెండు మూడు వార్తలని ఆధారంగా చేసుకుని ఇంత blanket statement వదిలారేమో అనిపిస్తోంది నాకు.
“ముస్లిములు అంతా దేశద్రోహులు” అంటే, అదొక stereo Type వ్యాఖ్యగా వెంటనే ఖండిస్తున్నాం మనం.మరి అదే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు రాసేటప్పుడు మనం కూడా జాగ్రత్త వహించాలేమో అనిపిస్తుంది.
Meeru raasinadi mummatiky satyam. Ituvanti Duramthalu marekkada ee deshamulo jargakudadhani Andaram aasiddamu.