ఒంటిమీద ఏదో పాకినట్టనిపించి గబుక్కున మెలకువ వచ్చింది తులశమ్మకు. పరిచితమైన స్పర్శే కానీ… గొంగళిపురుగును తలపిస్తోంది. చటుక్కున ఆ చేతిని విసురుగా తోసేసి, ”ఏమిటిది, ఎన్నిసార్లు చెప్పాను… ఇవన్నీ వద్దని. నాకు నిద్రొస్తోంది” అంది ఒకింత విసుగ్గా.
”ఏం నేనేమైనా కానిపని చేశానా? రాకూడని వాళ్ల పక్కలోకి వచ్చానా? రోజూ జరిగేదానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తావు? పక్కలోకి వెుగుడు కాకపోతే ఎవడొస్తాడు?” అన్నాడు కోపం, అసహనం కలగలిసిన గొంతుతో పరంధామయ్య.
”ముందు మీరు గొంతు తగ్గించి మాట్లాడండి. కొడుకూ కోడలే కాదు, ఈ పసిపిల్లలు కూడా నిద్రలేస్తే వాళ్లముందు నేను తలెత్తుకోలేను. మీకేం మగమహారాజులు. ఏం చేసినా చెల్లుతుంది. అందరూ నన్ను నవ్విపోతారు” అంది దుప్పటి నిండా కప్పుకొని పిల్లలకు మరింత దగ్గరగా జరుగుతూ.
”నువ్వు ముందు లేచి ఈ పక్కకురా” చెప్పాడు, ఇక మాట్లాడాల్సిందేమీ లేదన్నట్లు. ఆ స్వరంలో అది తన ఆస్తి అన్నంత అధికారం, పొగరు, గర్వం.
అంత అర్ధరాత్రి భర్తతో వాదన పెట్టుకుంటే తనకే నష్టం అన్న సంగతి ఆమెకు తెలుసు. ఆ అధికారం ముందు, ఆ పెత్తనం ముందు అన్నేళ్లలో తానెప్పుడూ గెలవలేదన్న సంగతి కూడా ఆమె శరీరానికీ మనస్సుకీ బాగా తెలుసు.
వడలిపోయిన శరీరాన్నీ అలిసిపోయిన మనస్సునీ అవేమీ తనవి కావన్నట్టు మౌనంగా ఆయనకి అప్పగించేసి కళ్లు మూసుకుంది ఆమె. లోపల ఏదో పుండుకెలికిన బాధ. శరీరం తెలియకుండానే భర్తకు సహకరించడం మానేసింది. తనను రానివ్వడంలేదని ఆయన బాధ. ఆ అసహనంతో మరింత గట్టిగా ప్రయత్నించి సఫలమయ్యాడు పరంధామయ్య.
ఆయన వెుహంలో సంతృప్తి. 70 ఏళ్ల వయసులో కూడా తన మగతనం మీద గట్టినమ్మకంతో హాయిగా నిద్రపోయాడు.
ఆమెకు మాత్రం కలత నిద్రే.
చి చి చి
”తులసీ” అమ్మకేక దూరం నుండి.
లంకంత పెరట్లో మామిడిచెట్టుకి వేసిన ఉయ్యాలపై స్నేహితురాలిని ఊపుతూ మధ్యమధ్యలో రాత్రి పెట్టుకున్న గోరింటాకు ఎంత బాగా పండిందో చూసుకుంటూ మురిసిపోతోంది తులసి.
”ఎర్రగానే పండిందిలేవే. ఆ అరచేతుల్నీ పాదాల్నీ ఎన్నిసార్లు అదేపనిగా చూసుకుంటావు. వచ్చేశాడుగా మంచి వెుగుడు. ఇంక నాకే ఎప్పుడొస్తాడో, ఎలాంటివాడొస్తాడో” అంటోంది పద్మ.
వెుగుడి మాట రాగానే తులసి వెుహం వివర్ణమవడం పద్మ గమనించింది. ”నాకక్కడకి వెళ్లాలని లేదే” అంటూ తులసి ఏడుపు వెుహం పెట్టేసింది.
ఊగుతున్న ఊహల ఉయ్యాల దిగి వచ్చింది పద్మ. తులసి స్నేహితురాలితో ఏదో మాట్లాడబోయే లోపల అక్కడకు వచ్చేసింది అమ్మ.
”ఎన్నిసార్లు పిలవాలమ్మా తులసీ. ఇక ఆటలు చాలించు. అత్తయ్య వచ్చేసింది పద, పూలజడ వేయించుకుందువుగాని. రావే పద్మా… తులసికి వేశాక పూలు మిగిలితే వాళ్ల అత్త నీకు కూడా పూలజడ వేస్తుంది” అంటూ ఆమె పద్మను కూడా పిలిచింది.
”లేదులే పిన్నీ, అమ్మ తొందరగా రమ్మంది. పూలు మిగిలితే మన వెంకన్నతో పంపించు” అనేసి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది పద్మ.
”చూడు, ఓణీ ఎలా పాడుచేసుకున్నావో. నీకెప్పటికి తెలిసివస్తుందో. స్నానంచేసి ఆ మట్టిలో ఆటలేమిటే. నువ్వింకా చిన్నపిల్లవు కావు. పెళ్లయింది కదా, కాస్త కుదురుగా ఉండు” నెమ్మదిగా సుద్దులు చెపుతూ కూతుర్ని తులసికోట దగ్గరకు తీసుకెళ్లింది అమ్మ.
అప్పటికే అక్కడ అత్తయ్య కూర్చొని అట్టమీద బొండుమల్లెల్ని కుడుతోంది.
”ఏమే, ఏమంటున్నాడు మీ ఆయన” అడుగుతోంది అత్తయ్య.
”అమ్మా, రాత్రిపూట నేనెళ్లనే ఆయన దగ్గరకు. కావాలంటే పొద్దుటిపూట ఆ గదిలోకి వెళ్లి ఉప్మా అదీ ఇచ్చేసి పరుగెత్తుకొని వచ్చేస్తాను” అమ్మను చుట్టుకొని ఏడవడం వెుదలెట్టేసింది తులసి.
”ఏమిటీ, రాత్రిపూట వెళ్లవా… పొద్దుటైతే వెళ్తావా… అప్పుడైతే మాత్రం మీ ఆయన నిన్ను పట్టుకోకుండా వదులుతాడంటావా. నిన్ను గట్టిగా వాటేసుకుంటాడు తెలుసా, నువ్వు గదిలోకి వెళ్లగానే” తులసిని ఆటపట్టిస్తూ మాట్లాడేస్తోంది అత్తయ్య.
అమ్మేవో అత్తయ్య మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుతోంది.
”తప్పమ్మా, అలా అనకూడదు. మీ ఆయన వింటే ఆయనకు కోపవెుస్తుంది. ఆయన చెప్పినట్టు వినాలి గదిలో. అల్లరి చేయకూడదు, ఏడవకూడదు. సరేనా” అంటూ మరోసారి బుజ్జగించింది తులసిని.
”నేనెళ్లనే. కడుపంతా నొప్పిగా ఉంటోంది” అంటూ గబుక్కున అమ్మ ఒళ్లో పడుకుని ఏడ్చేసింది తులసి.
”ఛ, ఛ… ఏడవకూడదమ్మా, శుక్రవారం సాయంత్రం అసురసంధ్య వేళ ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి నష్టం. లేచి కళ్లు తుడుచుకో. బావి దగ్గరకు పోయి చన్నీళ్ళతో వెుహం కడుక్కొని రా” అమ్మ, అత్తయ్య సర్దిచెపుతున్నారు.
తిరిగివచ్చేసరికి అమ్మ, అత్తయ్య కూడా చిరచెంగుతో కళ్లు ఒత్తుకుంటూ కనిపించారు. అప్పటివరకూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వాళ్లిద్దరూ ఎందుకు ఏడ్చారో తులసికి అర్థంకాలేదు. ‘పాపం, నేను ఏడ్చానని వాళ్లకు కూడా ఏడుపొచ్చేసినట్టుంది’ అనుకుంది తులసి. మాట్లాడకుండా వెళ్లి అత్తయ్య ముందు కూర్చుంది- పూలజడ వేయించుకునేందుకు.
అప్పుడప్పుడే విచ్చుకుంటున్న మల్లెపూల వాసన కమ్ముకుంది. ఒక వెుగ్గ చేతిలోకి తీసుకుని వాసన చూసింది. వెుగ్గ పూర్తిగా విచ్చుకోలేదు కానీ వాసన వేస్తోంది. విచ్చుకోని వెుగ్గను చేత్తో పట్టుకొని రేకలు బలవంతంగా విప్పి వాసన చూస్తూ పూలజడ వేయించుకుంటిోంది.
”చూడమ్మా, ఈ వెుగ్గ విచ్చుకోకముందే ఇంత వాసనేస్తోంది. పూర్తిగా విచ్చుకుంటే ఇంకెంత మంచి వాసనొస్తుందో” అబ్బురపడుతూ అంది తులసి.
అమ్మ, అత్తయ్యా ఇద్దరూ కలిసి పూలజడ వేస్తూ మాట్లాడటం వెుదలెట్టారు.
”మీ అత్తగారి దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండవే. మీ ఆయన గురించి కానీ, మీ అత్తింటి విషయాలు కానీ ఎప్పుడూ ఎవరి దగ్గరా మాట్లాడకు, కనీసం ఇక్కడ మాతో కూడా. అక్కను చూశావుగా… పెళ్త్లెనాక వాళ్లాయన్ని వదిలిపెట్టి ఒక్కపూట కూడా పుట్టింటికి రాదు. వాళ్లాయన గురించి పెదవి విప్పి ఒక్కమాట చెప్పదు. అదీ మంచి ఆడపిల్లల లక్షణం. అందుకే అదంటే మీ నాన్నగారికి అంతిష్టం. పుట్టింటి పేరు నిలబెట్టటం అంటే అదే. నువ్వు కూడా మాకు అలా మంచిపేరు తేవాలి, సరేనా?”
ఎందుకు మాట్లాడకూడదో తెలియకపోయినా వాళ్లు చెప్పే వాటన్నింటికీ తలూపుతూ ‘సరే’నంది తులసి.
”మీ ఆయన మంచివాడు. బాగా చదువుకుంటున్నాడు. నువ్వంటే చాలా ఇష్టం. చూడు, పెళ్లయిన దగ్గర నుంచి కాలేజీకి కూడా వెళ్లకుండా నీ చుట్టూ తిరగడంలేదూ. అది నీ అదృష్టం. ఎప్పుడూ కూడా మీ ఆయనకు ఎదురుచెప్పొద్దు. ఆయనకు నచ్చనిదేదీ చేయెుద్దు. కనీసం ఆయనకు నచ్చని రంగు చిర కూడా కట్టొద్దు. అలాచేస్తే మీ ఆయనకు నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. ఏమిటీ, వింటున్నావా? నువ్వు అక్కడ మంచిపేరు తెచ్చుకోకపోతే అందరూ ‘మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదూ’ అని నన్నంటారు. అమ్మని ఎవరైనా అంటే నీకు బావుంటుందా చెప్పు”.
మధ్యమధ్యలో అత్తయ్య కూడా అందుకొని ఆడపిల్లకు ఒద్దికెంత అవసరవో విడమర్చిచెపుతోంది.
”నన్ను చూడవే. వెుగుడు చచ్చి మీ పంచన పడి ఉంటున్నాను. ఇలాంటి బతుకెవరికీ వద్దే. వెుగుడనేవాడు లేకపోయినాక ఇక మనం బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అలాంటి బతుకూ ఓ బతుకేనా? ఏదో మీ అమ్మ మంచిది కాబట్టి నాకేం పెద్దగా ఆరళ్లు లేవు” అంటూ అత్తయ్య మరోసారి కళ్ళొత్తుకుంది.
అమ్మ కళ్లల్లో కూడా నీళ్లు. వాళ్లిద్దరూ అలా ఏడ్చేస్తుంటే ఎందుకో తెలియకుండానే పద్నాలుగేళ్ల తులసి కూడా ఏడ్చేసింది.
తులసి ఏడవటంతో వాళ్లు గబుక్కున కళ్లు తుడిచేసుకొని ”మా బాధల్లా నువ్వెళ్లిపోతావనేనే. మళ్లీ ఇలా కూర్చుని ఎప్పుడు మాట్లాడుకుంటావో” అంటూ సర్దిచెప్పేశారు.చి చి చి
హఠాత్తుగా ఒక మెలకువలోంచి మరో మెలకువలోకి వచ్చేసింది తులశమ్మ.
టైం చూసింది. నాలుగైంది. ఇంకా తెల్లారటానికి రెండుగంటలు అనుకుంటూ లేచి, ఒక గ్లాసు మంచినీళ్లు తాగి మళ్లీ పిల్లల పక్కకు చేరింది. పిల్లల ఒంటిమీద దుప్పటిని సరిగ్గా సర్ది వాళ్ల నుదుటిమీద చిన్న ముద్దుపెట్టింది. నానమ్మ స్పర్శ కూడా తెలియనంత గాఢనిద్రలో ఉన్నారు వాళ్లిద్దరూ.
చికూచింతా లేని ఆ బాల్యం మళ్లీ కావాలనిపించింది తులశమ్మకు. కల గుర్తొచ్చింది. మళ్లీ వచ్చే ఆ కల అంటే ఆమెకు చాలా ఇష్టం. అసలది కల అని ఒప్పుకోదు మనసు.
అమ్మ కనిపిస్తుంది. అత్తయ్య కనిపిస్తుంది. అమ్మ ఒళ్లో పడుకున్న ఆ స్పర్శను అనుభూతిస్తోంది మనసు. అమ్మ ఒడి ఎంత ఉపశమనమనిపిస్తుంది! బాధలన్నీ ఒక్కసారి చేత్తో తీసేసినట్టుంటుంది.
అమ్మ గుర్తురాగానే తనకెప్పుడూ వచ్చే మరో కలను కూడా ఆమె గుర్తుచేసుకుంది.
ఈ చిన్ననాటి సంగతులు రెండూ కలగా మళ్లీమళ్లీ ఎందుకు కనిపిస్తుంటాయో అర్ధమయ్యీ కానట్టు ఉంటుంది తనకు.
ఓసారి అర్ధరాత్రి ఏదో గొడవకు మెలకువ వచ్చి చూస్తే అమ్మ ఏడుస్తోంది. నాన్న లేచి అవతలకు వెళ్తున్నాడు. అమ్మ ఏడవడం చూసి ఏం జరిగిందో తెలియకపోయినా తను కూడా ఏడ్చేస్తూ- ”ఏమైందమ్మా, ఎందుకేడుస్తున్నావు?” అంది.
”ఏం లేదమ్మా తులసీ, నువ్వు పడుకో. నిద్రలో పీడకల వస్తే భయమేసి ఏడుస్తున్నాను” చెప్పింది అమ్మ.
”పీడకలంటే ఏంటమ్మా?”
”నీకు తెలియదులే. నువ్వు పడుకో”.
”అదెలా ఉంటుందమ్మా. నాకు కూడా ఎప్పుడైనా వస్తాయా?” ఆ ప్రశ్నలో భయం, కుతూహలం.
”పిల్లలకు పీడకలలు రావమ్మా. రాకూడదు కూడా. ఇక మాట్లాడకూడదు. పడుకో, కళ్లు మూసుకో”.
”అమ్మా, రామస్కందం శ్లోకం చదువుకో. ఆంజనేయస్వామి వచ్చి రాక్షసుణ్ణి చంపేస్తాడు”.
ఆ మాటలకు అమ్మ నవ్వేస్తూ ”అలాగేలే, నేను మంచినీళ్ళు తాగివచ్చి పడుకుంటాను. నువ్వు దుప్పటి తలమీద కప్పుకొని పడుకో” అంటూ వెళ్లిపోయింది.
అమ్మ పీడకల, తనకి తరచూ వచ్చే మరో కల. ఇవి ఒట్టి కలలేనా? కాదు కాదు. నిజంగా అమ్మని తాకినట్టే ఉంటుంది. అమ్మతో మాట్లాడినట్టే ఉంటుంది. అమ్మ రూపాన్ని అలా మళ్లీమళ్లీ చూడటం తనకెంతో ఇష్టం.
అమ్మ, అత్తయ్య ఆ రోజు నవ్వుతూ మాట్లాడినట్టే కనిపించినా వాళ్ల కళ్ళల్లో సన్నటి కన్నీటితెర. ఉబికివస్తున్న ఆ కన్నీళ్లు వాళ్ల ‘సుఖ’సంసారాలకు నిదర్శనాలు. అమ్మ గుర్తురాగానే అమ్మలు కూడా గుర్తొచ్చింది. ఇవాళ పదిహేను కదా. వాళ్లు రావటానికి ఇంకా వారముంది. కూతుర్ని చూస్తాననుకోగానే ఆమెకు సంతోషం ముంచుకొచ్చింది. అది అమెరికా వెళ్లి, చూస్తుండగానే మూడేళ్లు నిండాయి.
కూతురికి చెప్పాల్సిన విషయాలూ కూతుర్ని అడగాల్సిన విషయాలూ గుర్తుచేసుకుంది.
అమ్మకీ తనకూ లాగానే అమ్మలుకి కూడా ఇలాంటి కలలు వస్తుంటాయేవో ఈసారి తప్పకుండా అడగాలనుకుంది.
మంచం మీద హాయిగా గాఢనిద్రలో ఉన్న భర్తవంక చూసింది. ఏ నిద్రమాత్రా అవసరం లేకుండానే ఆయన అంత సుఖంగా ఎలా నిద్రపోగలుగుతున్నాడో తనకు తెలుసు.
వాలియం వేసుకున్నా తనకు రాదెందుకో అంత వెుద్దునిద్ర. తన పిచ్చిగానీ, భార్య ఉండగా ఆయనకు వేరే నిద్రమాత్రలెందుకు?
‘భర్త సుఖనిద్రార్థం ఇదం భార్యా శరీరం కదూ’ అనుకుంది నిర్వేదంగా.
ఆయనకు ఎదురుచెప్పొద్దంది అమ్మ. ఎదురుచెప్పటం కాదు, నెమ్మదిగా చెప్పిచూసినా ఆయన వినిపించుకుంటే కదా. అలిసిపోయి ఉన్న సంగతి గమనించడు. తన మనసు తెలుసుకొని మసలే భర్త అయితే తనకీ బాధలెందుకు? వయసు మీదపడుతుంటేనైనా భర్త మారతాడనుకుంది. ఇప్పుడీ యావ మరీ ఎక్కువైంది. ఎందుకు కాదు? వెతికి మరీ ఆయుర్వేద లేహ్యాలు తెప్పించుకొని తినడం, ఆపైన అర్ధరాత్రిదాకా పిచ్చిపిచ్చి టీవీ ప్రోగ్రాములు చూస్తూ కొత్త పెళ్లికొడుకులాగా రాత్రికాగానే పక్కలోకి రమ్మనడం. ఏమైనా అంటే, పడకసుఖం లేకపోతే తనకు నిద్రపట్టదని బుకాయింపు.
ఉదయం నుండి చాకిరీ, మనవళ్ల ఆలనా పాలనాతో సాయంత్రానికి శరీరం పచ్చిపుండులా సలుపుతూంటుంది. కాస్త మనశ్శాంతి కోసం పడుకునేముందు భగవద్గీతో, భాగవతవో చదవాలనుకుంటుంది. కానీ వీలుపడదే!
పుస్తకం చదువుతుంటే కళ్లు కాస్తా మూతలుపడుతుంటాయి. వాలియం కొంచెం పనిచేస్తోందేవో అనిపిస్తుంటుంది. అప్పుడు పడుకోలేకపోతే ఇక రాత్రంతా నిద్రపట్టదు.
ఆ నిద్రకళ్ల మీదుండగానే ఈయన గారి శృంగార దండయాత్ర. ఏమన్నా అంటే ‘శయనేషు రంభ’ అంటాడు. రంభ పాత్ర ఎన్నేళ్లో ఏ మనువో, బనువో చెప్పి తగలడితే బావుండేది. మనకిష్టంలేనప్పుడు మన శరీరాన్ని ఎవరైనా తాకితేనే భరించలేమే… అలాంటిది దాన్ని అనుభవిస్తున్నప్పుడు శరీరమెంత గిజగిజలాడిపోతుంది? గోతాంలో వేసి కట్టేస్తే ఊపిరాడక ప్రాణం పోయినట్టనిపించే ఆ బాధను వాలియం పోగొడుతుందా తన పిచ్చిగానీ!
పాములో, తేళ్లో ఒళ్లంతా పాకినట్టనిపించే ఆ హింస తలుచుకోగానే ఆమెకు కంపరం కలిగింది. కోపంతో వెుహం జేవురించింది.
ఏమీ చేయలేని అసహాయత్వం ఆమెను మరోమారు వెక్కిరించింది.
బాధ అలవాటైతే అదసలు బాధే కాదట. కానీ తనకన్నేళ్లలో ఆ బాధ వయసుతోపాటు పెరుగుతూ వస్తోంది కానీ తగ్గటం లేదు. నోరు తెరిచి వద్దండీ అని చెపితే తన బాధా, ఇబ్బందీ అర్థంచేసుకోకపోగా ఈ వయసులో కూడా ‘బైట’కు వెళ్లకుండా భార్య దగ్గరకే వస్తున్న తన మంచితనం గురించి చెప్పుకుంటాడు. డెబ్భై ఏళ్ళొచ్చినా పాతికేళ్ళవాడిలా పూర్తి మగటిమితో ఉన్నందుకు సంతోషించమంటాడు. అలాంటి భర్త దొరకటం తన అదృష్టమని గుర్తించమంటాడు.
‘అక్కడంతా పుండుగా మారింది, దురదగా ఉంది, కనీసం ఈపూటకు వద్దండీ’ అంటే ‘డాక్టరుకు చూపించుకోవే. నీకేమైనా పాడు రోగాలొచ్చిచచ్చాయేవో’ అని తిరిగి తనమీదే విసుక్కుంటాడు.
నలభై అయిదేళ్లుగా ఈ బాధను శరీరం, మనసు భరిస్తూనే ఉన్నాయి. ఇవాళ కొత్తకాదు. అయినా రోజూ మనసు వెురాయిస్తుంది. శరీరం ఎదురుతిరగమని చెపుతుంది. చచ్చినా ఫరవాలేదు కానీ ఈ బాధ భరించలేననిపిస్తుంది ప్రతి రాత్రీ. కానీ తెల్లారి పిల్లల వెుహాలు చూసి తన బాధల్ని మరిచిపోతుంది.ప్రవాహంలా సాగిపోతున్నాయి ఆమె ఆలోచనలు. నీ ఆలోచనలతో నాకేం పని, నా పని నేను చేసుకుపోతాను అంటున్నట్టు ఒక మగవాడు వెళ్లిపోతుండగా మరో మగవాడు… సూర్యుడు వచ్చేశాడు.
మరో రకమైన చాకిరీకి సిద్ధమయ్యేందుకు పక్కమీద నుంచి లేచింది తులశమ్మ.
(ఫిబ్రవరి 17,ఈనాడు ఆదివారం అనుబంధం )
స్లీపింగ్ పిల్
ఫిబ్రవరి 16, 2008 kalpanarentala చే
చాలా బాగా రాశారండీ కథ… అసలు ఇంత మంచి కథల్ని ప్రచురిస్తున్నందుకు ఈనాడు ఆదివారం అనుబంధాన్ని అభినందించాలి. ఆడవాళ్ళు పడే ఈ నరకం గురించి కొందరికయినా ఒక అవగాహన వస్తే ఎందరికో మేలు జరుగుతుంది.
ఇంటరెస్టింగ్ ..
నేను చదివిన బహు ఆసక్తి కరమైన శృఉంగార ఘటన బార్బరా కింగ్సాల్వర్ నవల (పేరు ఇప్పుడు గుర్తులేదు) ఒక యాభై ఐదేళ్ళ మగాడీకీ, అరవై దాటిన స్త్రీకీ మధ్య నడుస్తుంది. ఒక వయసు దాటాక, లేదా ఒక జీవిత మజిలీ దాటాక సెక్సు కూడదు, లేదా అది అషజం అనే భావన ఎందుకు? పోనీ భర్త ప్రేమ తెలీనివాడో, ఇంకో విధంగా జులుంచేసేవాడో అసహ్యించుకోదగిన వాడో అయితే ఆ విముఖతకి అర్ధం చెప్పుకోవచ్చు.
మీరు కథ బాగా చెప్పారు, కానీ కథకి మూలమైన ఆలో్చనలోనే .. ఏదో తేడా ఉంది.
గృహకృత్యాలతో సతమౌతు సంసారం సాగిస్తున్న వయసుమీరిన భార్యలు కామాతురులై భార్యల మనస్సులు గ్రహించలేని మూర్ఖపు భర్తలకు కనువిప్పు కలిగిస్తుందీకధ.
జాబాలిముని
కల్పన , ఇంతకుముందే ఈనాడులో ఈ కథ చదివాను. బావుంది. అలాంటి మగాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్ళాం ఉన్నది తన శారీరక అవసరం తీర్చడానికే అని అనుకునేవాళ్ళు ఎంతో మంది. ఆమె మానసిక, శారీరక పరిస్థితి గురించి ఆలోచించరు..
సమ్ థింగ్ డిఫరెంట్ స్టోరీ..
నిజంగా చాలా బాగుంది ఒక మనసే అయినా వేల వేల ఆడ మనసులు కలిసి గొంతు
“ఎలుగెత్తి”
చెప్పినట్టుంది ఈ కధ.
శరీరమే కాదు మనసు కి కూడా కనీసపు విలువ లేని ఆ రోజులు మనుషుల గురించే అయినా ఈరోజుల్లొ కూడా ఇలాంటి జంటలు చాలా ఉన్నయి అని అనిపిస్తుంది
అది ముదిమి తోనే రాదు వయసులొ ఉన్నా వాల్లకి కూడా నచ్చటమ్ నచ్చకపొవటము ఉంటాయి అని ఎంతమంది అర్ధమ్ చేసుకోగలరు?
I am happy to read your views.
But, i feel they are bit of extreams on either sides.
Here the question is …neither …its proper to have sex after some age or not, nor, rule of men over women.
It would be good, if one understands the deeper meaning and sence behind.
There are two understandings
1. sex as a desire & need.
2. as a result of peak of the unification of love and heart and mind.
the thing is…… every one should strive understand the origins.
I personlly think, point 2 is the concept behind the creation of concept itself.
flower is the best example
kadha chaala bagumdi. chinna vayasulo marriage ayyina aadavallamdari feelings nenu chusinamtavaraku ilage unnayi. balavamtamga vichhukobadina puvvu numdi sahaja parimalam yeppatiki raadu.
కొత్తపాళీ గారూ.. వయసు అనేది ప్రిజుడైస్ కాదు అనుకుంటాను. మగవాళ్ళు ఆడవాళ్ళ మధ్య వున్న రక రకాల అంతరాలున్నప్పుడు, మానసికంగా, శారీరకంగా (స్త్రీ లలో నెల నెలా.. మార్పుకు గురయ్యే హార్మోన్లూ, మెనొపజ్ తరవాత మారే తగ్గే ఈస్ట్రొజెన్ స్థాయీ.. వగైరాల వల్ల) తమ భార్యల్ని సెక్స్ కోసం ఇబ్బంది పెట్టే మగ వాళ్ళ గురించి మాత్రమే ఈ కథ. వయసు ఎంతైనా ఫోర్స్ చేసే భర్తల మీద భార్య కు కలిగేది ప్రేమ కాదు. కేవలం తనను పెళ్ళి చేసుకున్నందుకు తన మీద సర్వ హక్కులూ ఉన్నట్టు ప్రవర్తిస్తుంటే ఎవరికైనా విసుగు పుడుతుంది. రచయిత్రి ఈ కథ ద్వారా మగ వాళ్ళ లో ఉన్న ఈ ఇమ్మెచ్యూరిటీ ని, తద్వార బాధ పడే ఆడవాళ్ళ మానసిక స్థితి నీ సింపుల్ గా చెప్పారు.
tulasi 14yrs apudu, tirigi 60yrs apudu experience chepparu.kaani migilina phase lo maree intagaa feel ayyedi kademo. and andaru magavallu inte annattu valla amma,atta kuda badha padatam dwara chepparu which is not correct. kadhalo topic bagundi kani, incomplete ga undi. nenaite webpage lo chadiva…inka undemo ani scroll chesaa…but aipoindi ani telisi identi ilaa suddengaa muginchesaru anipinchindi.
ఇంత వయసు వరకే సెక్సు కోర్కెలుండాలి అని నిర్థారించడం, వయసు మీరిన వాళ్ళ కోరికను హేయమైన చర్యగా చూడ్డం సబబా? పార్ట్నర్ ఇష్టానికి వ్యతిరేకంగా (ఆడైనా మగైనా) ప్రవర్తించడం వరకూ తప్పే!
భార్యా భర్తల సంబంధం గురించీ, వాళ్ళ మధ్య అనురాగం, ఆప్యాయతల గురించి కాదు ఈ కథ. అలా అనుకోవడానికి దోహదంచేసే హింట్స్ ఈ కథలో నాకు కనిపించలేదు.
తులసమ్మకు సెక్సు పట్ల విముఖత ఎందుకు? వడలిపోయిన శరీరం, అలసి పోయిన మనస్సా?! కొంత వరకు సరేననుకోవచ్చు! కానీ, పరంధామయ్య పరిస్థితీ ఆలోచించాలికదా?! ఇప్పటి తరం గురించి ప్రక్కనపెడితే, పరంధామయ్య తరంలో – పెళ్ళనేది ఒక్కటే సెక్సుకు సమాజం చూపించిన సరైన దారి! మరి తులసమ్మ వేదనను చూపించినట్లే పరంధామయ్య బాధ గురించి కూడా చెప్పాలి కదా?! నాకైతే అతడూ పాఠకుల సానుభూతికి అర్హుడేననిపిస్తోంది.
ఇకపోతే తులసి కి పెళ్ళయిన కొత్తలోకూడా భర్త దగ్గరకు రాత్రి వేళ వెళ్ళాలంటే భయమన్నారు కదా? భయమెందుకు? పరంధామయ్య పర్వెర్టెడా? అలా అని కథలో ఎక్కడా సూచనలు లేవు! పోనీ తులసికి పెళ్ళి వయస్సు, పరిణతి రాలేదు కాబట్టి అలా భయపడుతుందనుకుంటే, ఆ పెళ్ళి చేసిన పెద్దల గురించీ ఓ ముక్క చెప్పాలిగా కథలో!
ఏతావతా, పరంధామయ్యను విలన్ గా చూపించడానికి, ఒక పక్షాన వకాల్తా తీసుకుని కథ చెప్పినట్లనిపించింది! ఫెమినిస్ట్ కథల మూసలో ఇమడడానికి ఈ కథ ఇలా ఉండాల్సి వచ్చిందేమోనని సందేహం
గమనిక: పై వ్యాఖ్యలో నేను చెప్పింది పూర్తిగా కథ గురించిన నా అభిప్రాయమే (తప్పయితే అవొచ్చు). అన్నింటినీ అందరూ ఒకేలా చూడాలని, అర్థం చేసుకోవాలనీ లేదు కదా!
సిరి
సవ్యమైన వివాహానంతరం “సుఖ” నిద్ర కోరుకోని భార్య భర్తలుంటారా?
తులసమ్మ వ్యక్తిత్వం, అమే ఇష్టాఇష్టాలని వివరంగా చెప్పాల్సింది.
అలాగే పరంధామయ్య గురించి కూడా.
అవి రెండు ఉంటే ఈ కధని ఇంకోచెం బాగా ఆనందించేవారేమో!
తలసికీ ఇష్టం లేని “పని” కాబట్టి, పరంధామయ్య – “మగమహారాజు” కాబట్టి అతను ఒక “కౄరుడు” గా చిత్రీకరించడం బావోలేదు.
కొత్తపాళి గారన్నట్టు – “కథకి మూలమైన ఆలో్చనలోనే .. ఏదో తేడా ఉంది.”
” ఉండనే ఉంది.
సిరి అన్నట్టు – “…ఫెమినిస్ట్ కథల మూసలో ఇమడడానికి ఈ కథ ఇలా ఉండాల్సి వచ్చిందేమోనని సందేహం
స్లీపింగ్ పిల్ మీద అభిప్రాయాలు చదివాక వ్రాయబుధ్ధి అయింది.శృంగారానికి వయోపరిమితులు లేకపోవచ్చు.మగవాళ్ళంతా కౄరులూ కాకపోవచ్చు.కానీ ఏ భార్యాభర్తల మధ్య అయినా శృగారజీవితానికీ మానసికమైన స్నేహానుబంధాలకీ సంబంధం వుంటుంది.ప్రేమరాహిత్యమైన శృంగారం
కామవాంఛా పరిపూర్తి తప్ప ఇంకేమీ కాదు.కేవలం తన కోర్కె తీర్చుకోడం తప్ప ఆమె/అతని మనశ్శరీరాలు అందుకు సుముఖంగా వున్నాయో లేవో తెలుకోడం రెండోవారి ధర్మం కదా! ఇంటి చాకిరి,వయస్సు తెచ్చిన అలసత్వం,అన్నింటికీ మించి సమాజాన్ని ఎప్పుడూ అంటి వుండే ’ఎవరేమనుకుంటారో”
అనే భయం,వీటన్నిటినీ మించి ఆయా వ్యక్తుల చైతన్య స్తాయి,ఇన్ని కారణాలుంటాయి.భారతీయ పురుషుడికి భార్యతోనే శృంగారం ఇతరత్రా నిషేధం కనక
ఆమె అన్ని వేళలా,అన్ని వయసుల్లోను అతనికి సహకరించాలనడం హాస్యాస్పదం.ఈకధని కల్పన ఫెమినిష్టు చట్రంలోనించీ రాసిందనడం బాగాలేదు.