“అసలు బిడ్డలకు వలెనే కథలకు కూడా మాతృత్వం మాది ” అంటుంది కనుపర్తి వరలక్షమ్మగారి కథలోని రాజేశ్వరి (కథ ఎట్లా వుండాలె?) దాదాపు ’75,’80 ఏళ్ళ క్రితమే స్త్రీవాదం అన్న పేరు కూడా వినిపించని కాలంలోకథ చెప్పటం మా జన్మహక్కు అని ఆమె సగర్వంగా ప్రకటించింది.
అనగనగా అంటూ అమ్మమ్మ చెప్పిన కథతో స్తీలకథ మొదలైందని చెప్పవచ్చు. రాక్షసుడ్ని చంపేసిన రాజకుమారుడి చుట్టూ అల్లుకున్న రాకుమారి అందమైన ఊహల కథ. ఏ రాకుమారుడో వచ్చి యౌవన రెక్కల మీద ఎగరేసుకుపోతాడన్న ఊహల నుంచి రాకుమారుడ్ని పెళ్ళి చేసుకోకుండానే వారసుల్ని కనగలిగే స్థాయికి ఎదిగింది నేటి కథల్లోని కథానాయిక. సైద్ధాంతికపరంగా ఈ మార్పుని స్త్రీవాద కథాపరిణామక్రమంగా చెప్పుకోవచ్చు.
సామాజిక చరిత్రకు సాహిత్యం దర్పణం లాంటిది. మానవ జీవనానికి కథ ప్రతిబింబంలాంటిది. సమాజ పరిణామాలను విమర్శనాత్మకంగా చూసినప్పుడు దాని తాలూకు ప్రతిబింబం మనకు సాహిత్య రూపాల్లో కనిపిస్తుంది. సాహిత్యానికి, సమాజానికి మధ్య వున్న ప్రతిఫలనం అవగాహన చేసుకున్నప్పుడు స్త్రీవాద సాహిత్యం కూడా సరిగ్గా అర్ధమవుతుంది.
తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యం తీవ్ర సంచలనాన్ని రేకేత్తించి అనేక వాద వివాదాలకు కారణమైన సంగతి అందరికీ తెలిసిందే. 1980 ల్లో స్త్రీవాద రచయిత్రులు తమదైన స్వరంతో, భావ వ్యక్తీకరణలతో, కొత్త ఇతివృత్తాలతో, సరికొత్త భాషతో, పదచిత్రాలతో తిరుగుబాటు ప్రకటించారు. పితృస్వామ్యం, స్త్రీ, పురుష లైంగిక వివక్ష, స్త్రీల అణచివేత, ఇంటి చాకిరీ మొదలైన విషయాల్ని స్తీవాదం చర్చల్లోకి తీసుకువచ్చింది. స్త్రీగా పుట్టడం వేరు, స్త్రీగా తయారుచేయబడటం వేరు అన్న సంగతిని స్త్రీలు గుర్తించగలిగారు. తరతరాల సమాజం కోటానుకోట్ల మంది స్త్రీలను తయారు చేసి వారిని ఆ విధంగా అదుపుచేయటాన్ని స్త్రీవాదులు నిలదీశారు. స్త్రీ, పురుష వివక్ష గురించి స్త్రీవాద రచయిత్రులు చైతన్య్వంతులై ప్రశ్నించారు. ఆ విధమైన ఆత్మచైతన్యాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతిబింబింపచేసే కథ, కవిత, నవలాసాహిత్యాన్ని స్త్రీవాదులు సృజించారు.
మొదటి దశలో రచయిత్రులకు , అతి కొద్దిమంది రచయితలకు పరిమితమైన స్తీవాదం క్రమంగా మొత్తం సమాజవాదంగా మారింది. ఇవాళ స్త్రీవాదం కేవలం స్త్రీలవాదమే కాదు, సమాజంలోని అన్నివర్గాల వారిది. స్త్రీ చైతన్యాన్ని, వ్యక్తిత్వాన్ని గౌరవించే స్త్రీ, పురుష పాత్రల్ని జండర్ భేదం లేకుండా అందరూ తమ రచనల్లో చిత్రిస్తున్నారు. దీన్ని స్త్రీవాదం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మార్పు సమాజంలో ఆశించిన రీతిలో లేకపోయినప్పటికీ సాహిత్యంలో మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ వ్యాసంలో ప్రధానంగా స్త్రీవాద రచయిత్రుల కథల్ని మాత్రమే చర్చకు తీసుకోవడం జరిగింది.
స్త్రీల జీవితాల గురించి, సమాజంలో స్తీల భాగస్వామ్యాన్ని గురించి రచయిత్రులు మొదటి నుంచీ కథలు రాస్తూనే ఉన్నారు. తమలోని స్త్రీత్వాన్ని నిర్వచించుకుంటూ రచయిత్రులు రాసిన కథలూ వున్నాయి. అయితే స్త్రీవాద కథ అన్నది మాత్రం ‘ 80 ల తర్వాత మాత్రమే కనిపించే భావన. ఇది ప్రధానంగా సైద్ధాంతికపరమైన వృత్యాసాన్ని తీసుకువచ్చింది. 1902లో వెలువడ్డ భండారు అచ్చమాంబ ‘ స్త్రీవిద్య ‘ కథనుండి మొదలుపెడితే… మొదట స్త్రీ విద్యతోనే రచయిత్రుల కథ మొదలైంది. భర్త కోసం చదువుకుంది అచ్చమాంబ కథానాయిక. ఆ కథ ఇతివృత్తం అప్పటి సమాజ పరిస్థితులకు తగినట్టు వుంది. చదువుకోవడంతో మొదలైన స్త్రీ చైతన్యం నెమ్మదిగా ఆర్ధిక స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, స్వాభిమానం, కుటుంబంలో, సమాజంలో సమానస్థానం, సమానహక్కుల గురించి మాట్లాడడం వరకూ వచ్చింది. సామాజికంగా స్త్రీలలో క్రమక్రమంగా వచ్చిన ఈ చైతన్యానికి రచయిత్రుల సాహిత్యం దర్పణం పట్టింది.
మొదటి దశలో రచయిత్రుల కథల్లో కుటుంబంలో, సమాజంలో స్తీ,పురుష మధ్య అంతరాల్ని, వివక్షను అతి సహజ విషయంగా భావించగా స్త్రీవాదకథ ఆ వివక్షను “పురుషాధిపత్యరాజకీయంగా“ గుర్తించి ఎదిరించగలిగింది. అంటే ప్రధానంగా స్త్రీలు రాసిన కథలకు, స్త్రీత్వపు గుర్తింపుతో రాసిన కథలకు, స్త్రీవాద కథలకు వున్న అంతరం సైద్ధాంతికపరమైంది. ఆ సైద్ధాంతికత సమాజంలో అణచివేతకు గురైన అన్నివర్గాల స్త్రీలకు ప్రాతినిధ్యం వహించింది.
స్త్రీల సమస్యలు, స్త్రీ, పురుష సంబంధాలు, వివాహ వ్యవస్థలోని లొసుగులు వీటన్నింటి గురించి విస్తృతంగా చర్చించిన స్త్రీవాదులు ఇప్పుడు సమాజంతో పాటు కొత్త రూపు తీసుకుంటున్న సమస్యల గురించి మాట్లాడుతున్నారు. గ్లోబలైజేషన్ ప్రభావంతో స్త్రీల జీవితాల్లో వస్తున్న మార్పుల్ని సునిశిత పరిశీలనతో చర్చకు పెడుతున్నారు. మారుతున్న పల్లెలు, పట్టణ స్వరూపాలు, కరవురక్కసి కాటుకు గురై చిద్రమవుతున్న మానవ సమబంధాలు, అంతరిస్తున్న కులవృత్తులు, జూదంగామారిన వ్యవసాయం, రాజకీయరంగాల్లో స్త్రీలపై కొనసాగే అణచివేత, స్త్రీలు ఎంచుకుంటున్న అకొత్త కెరియర్స్లోని మానసిక, శారీరక ఒత్తిడులు, మత విద్వేషాలు,, ప్రవాసం జీవితంలోని సంఘర్షణ - ఇలా సమాజం విశ్వరూపాన్ని తమ కథల ద్వారా చర్చకు పెడుతున్నారు స్త్రీవాదులు.
ఓల్గా, కుప్పిలిపద్మ, గీతాంజలి, నల్లూరి రుక్మిణి, పి.సత్యవతి, వి.ప్రతిమ, కొండవీటి సత్యవతి, ముదిగంటి సుజాతారెడ్డి, సుభద్ర, ఎస్.జయ, సుబహాషిణీ, చంద్రలత, కె.వరలక్ష్మి, షాజహానా, , పుట్ల హేమలత, సి.సుజాత, నిర్మలారాణి, ఇంద్రగంటి జానకీబాల లాంటివాళ్ళు ఇటీవల రాస్తున్న కథల్ని చదివినప్పుడు, వారి కథల్లోని ఇతివృత్త వైవిధ్యాన్ని, శిల్ప పరిణితినీ్, పరిశీలిస్తే మనకు ఈ విషయం స్పష్టమవుతుంది.
మొదట్లో శరీర రాజకీయాల గురించి మాట్లాడిన స్త్రీవాదులు ఇవాళ రాజకీయ, రాజ్యవ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. రాచపుండు, గంగజాతర (ప్రతిమ), ముందడుగు (కొండవీటి సత్యవతి) లాంటి కథలు రాజకీయరంగంలో స్త్రీలు పావులవుతున్న వైనాన్ని ప్రశ్నిస్తుండగా, కుబుసం (కుప్పిలి పద్మ), మంత్రనగరి (సత్యవతి), సాలెగూడు (ప్రతిమ), కొత్తకోర్సులొస్తున్నాయి జాగ్రత్త (సుభాషిణి) లాంటి కథలు గ్లొబలైజేషన్ వికృతస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కొత్త కొత్త కెరియర్స్ లో స్త్రీలపై మానసిక, శారీరక ఒత్తిడి ఎక్కువవటమే కాకుండా వారి వ్యక్తిత్వాలు ప్రశ్నార్ధకమవుతున్న తీరును సునిశితంగా ఎత్తి చూపిస్తాయి.
అవర్జా (చంద్రలత), సాలభంజిక (కుప్పిలిపద్మ) కథలు, వైవాహికేతర సంబంధాల్లో స్త్రీలు పడే మానసిక సంఘర్షణను, పల్లె జీవితంలోని వైరుధ్యాలను నల్లూరి రుక్మిణి కథలు చిత్రిస్తే, కరవు, ఫ్యాక్షనిజం భూతాల నోట్లో చిక్కుకున్న స్త్రీల బతుకుల్లోని వేదనను చిత్రిస్తాయి. నిర్మలారాణి, రంగనాయకిల కథలు. స్త్రీలు మతపరమైన అణచివేతల్లొ కూరుకుపోతున్న విధానాన్ని షాజహానా, గీతాంజలి కథలు ఆగ్రహంతో ప్రశ్నిస్తుండగా, ఓల్గా రాసిన సమాగమం లాంటి కథలు పురాణ స్త్రీల మనోభావాలకు సరికొత్త వ్యాఖ్యానం చేస్తాయి. ప్రవాస జీవితంలో స్త్రీలు పడే సంఘర్షణను చిత్రించే కథల్ని స్త్రీవాద కథల్లో ఓ భాగంగా చూడవచ్చు.
ప్రవాసాంధ్ర రచయిత్రుల్లో చాలామంది తమని తాము స్త్రీవాదులుగా ప్రకటించుకోకపోయినా వారి కథల్లోని స్త్రీ పాత్రల సంఘర్షణ, ప్రవాస జీవితంలోని వైరుధ్యాలను వారు చిత్రిస్తున్న తీరు స్త్రీవాదానికి ఓ మంచి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. నిడదవోలు మాలతి (చివురుకొమ్మ, చేవ, నిజానికీ ఫెమినిజానికీ మధ్య, డాలక్ర్కో గుప్పెడు రూకలు) శేషుశర్మ (అన్వేషన్ణ, అగాధం), చినుటాకమల (అమెరికా ఇల్లాలు), ఉపాధ్యాయుల సూర్యకుమారి (అమ్మపెళ్ళి), చెరుకూరి రమాదేవి (యాధృచికం మొదలైన వాళ్ళ కథలు ప్రత్యేకంగా స్త్రీవాద ముద్రతో లేకపోయినప్పటికీ 21 వ శతాబ్దంలో స్త్రీల జీవన విధానాన్ని అవి ప్రతిబింబిస్తున్న కారణంగా వాటిని స్త్రీవాద కథలుగా గుర్తించడం సముచితమే. ఈ విధంగా స్త్రీవాద రచయిత్రుల కలం ఉండి వస్తున్న అనేకానేక కథలు సమాజంలొ స్థూలంగానె కాకుండా సూక్ష్మంగా జరుగుతున్న మార్పుల్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. సామాజిక బాధ్యతతో వీరు రాస్తున్న కొత్త కథలు పాథకులకు దిశా నిర్దేశం చెస్తున్నాయి.
అయితే స్త్రీవాదం చల్లబడిపోయిందని, స్త్రీవాద కథలు ఇతివృత్త లోపంతో మూస ధోరణిలోకి వెళ్తున్నాయని, స్త్రీవాద కథల చిత్రణ అంతా నగర, పట్టణ వాసాలకు సంబంధించినది మాత్రమే వుంటోందన్న విమర్శలను మాటలతోనో, వ్యాసాలతోనో కాకుండా పదునైన తమ సాహిత్యం ద్వారా స్త్రీవాదులు తిప్పికొడుతుననరనటానికి పైన పేఋకొన్న కథలే మంచి ఉదాహరణ. అయితే ఇక్కడ మనం అంగీకరించాల్సిన సత్యం మరొకటి ఉంది. ఏ వాదానికైనా కొన్ని పరిమితులుంటాయి..అలాంటి పరిమితులు అస్తిత్వవాదాలన్నింటికి వున్నట్టుగానే స్త్రీవాదానికి కూడా ఉండి. స్త్రీవాద కథలు మూసధోరణిలోకి వెళ్ళడం లేదన్నది వాస్తవమైనప్పటికీ ఒక వాదంగా స్త్రీవాద సాహిత్యం కొన్ని పరిమితులకు లోబడి మాట్లాదుతోందన్నాదిమాత్రం నిరాకరించలేని సత్యం. “స్త్రీల శరీర ధర్మాలను హీనపరిచే పితృస్వామ్య సంస్కృతిని ఎదిరించె క్రమంలో కొన్నిసార్లు స్త్రీవాద సాహిత్యం స్త్రీల చుట్టూ కొని కొత్త ‘ మిత్ ‘ లను కల్పించింది. స్త్రీల ప్రత్యేకతలను ఆధిక్యాలుగా ప్రకటించింది. స్త్రీల శరీర ధర్మాలను, పునరుత్పత్తి శక్తిని “సంపూర్ణ స్త్రీత్వం“గా నిర్వచించిన సాహిత్యం వచ్చింది. ఆమేరకు అవి , శారీరక లోపాలున్న స్త్రీలను గొడ్రాళ్ళుగా, మాచకమ్మలుగా వెక్కిరించిన పురుషాధిపత్యానికి జవాబు చెప్పే శక్తిని కోల్పోయాయి“ అన్న కాత్యాయిని మాటల్లోని వాస్తవాన్ని గుర్తించి స్త్రీవాద రచయిత్రులు ఆత్మపరిశీలన చేసుకోవడం కూడా ఈ సంధర్భంలో అవసరమే.
మూస చరిత్ర - పాక్షిక విమర్శ
స్త్రీల సాహిత్యాన్ని , వారి సాహిత్య కృషిని మొదటి నుండి పురుష నిర్మిత విమర్శానా పనిముట్లతోనే పరామర్శిస్తూ స్త్రీలు ఇతర స్త్రీల కోసం రాసుకుంటున్న వాటిగానే చూస్తున్నారు తప్ప వారి సాహిత్యానికి ప్రధాన స్రవంతి చరిత్రలో సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదన్నది నిష్టూరసత్యం. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో ఓ మొల్ల, మరో తిమ్మక్క అంటూ వేళ్ళ మీద లెక్కించడమే తప్ప స్త్రీల సాహిత్య కృషిని సరిగ్గా అంచనా వేసే ప్రయత్నమేదీ జరగలేదు. ప్రధాన స్రవంతి సాహిత్య చరిత్రలో స్త్రీల సాహిత్యాన్ని ఓ పాయగా మాత్రమే ఇన్నేళ్ళు చూపించారు సాహిత్య చరిత్ర రచనావిధానంలొనూ, సాహిత్య విమర్శలోనూ ఇన్నాళ్ళు పురుషస్వామ్యమే రాజ్యమేలింది. మూసపోసిన పురుష స్వామ్య చరిత్ర రచానవిధానాన్ని ప్రశ్నించి దాని తిరగరాసే ప్రయత్నాన్ని స్త్రీవాదులు మొదలెట్టారు. ఆ క్రమంలో వచ్చిన ‘మనకు తెలియని మన చరిత్ర ‘, ‘ మహిళావరణం ‘,’ నల్ల పొద్దు ‘ లాంటి పుస్తకాలు సాహిత్య, సామాజిక రంగాల్లో స్త్రీశక్తిని సరిగ్గా అంచనా కంటే ప్రయత్నాలు. సాహిత్య విమర్శ విషయానికి వస్తే మొదటినుంచి కూడా స్త్రీల సాహిత్యానికి తగినట్టు విమర్శ రాలేదు.
ముఖ్యంగా స్త్రీవాద సాహిత్య విమర్శ ఆశించిన స్థాయిలో రాకపోవటానికి ప్రధాన కారణం అందుకు అనువైన భాషను, విమర్శనాసూత్రాల్ని సంపూర్ణంగా నిర్మించుకోకపోవడం, ఓల్గా, జయప్రభ, కాత్యాయని, కాత్యాయని విద్మహే, మృణాళిని, అబ్బూరి చాయాదేవి, ఎస్.జయ లాంటివాళ్ళు కొంతమేరకు దీనిపై కృషి చేద్సిన అ ఇంకా చేయాల్సింది చాలానే ఉందని చెప్పుకోవాలి. ‘ స్త్రీ విద్య ‘ మొదలుకొని స్త్రీల సమగ్ర సహిత్య చరిత్ర, విమర్శ వచ్చినప్పుడే సమాజాన్ని వారి సాహిత్యం ప్రభావితం చేసిన తీరు స్పష్టమవుతుంది.
స్త్రీల సాహిత్యంపై మొదటి నుండీ మనకు పాక్షిక విమర్శలు మాత్రమే వున్నాయన్నది ఇప్పటి స్త్రీవాదుల ఆరోపణ మాత్రమే కాదు. కనుపర్తి వరలక్ష్మమ్మ కాలం నాటికే ఇది వుంది. రచయితల సాహిత్యంపై విమర్శ ఎలా సాగుతుందో ఆమె తన కథ ” కథ ఎట్లా వుండాలే?” లో చెప్పే సాహసం చేశారు. రచయితల కథల్ని వాళ్ళలో వాళ్ళే ప్రశన్సించుకొని దాన్నే సద్విమర్శగా చెలామణి చేసుకునే విధానాన్ని వ్యంగంగా ఆమె ఎత్తి పొడుస్తారు. ఇప్పటికీ ఆ కథ నిత్యనూతనమే.
గురజాడ ” దిద్దుబాటు” తొలి తెలుగు కథగా మొదలైన కథాచరిత్రలో తొలితరం రచయిత్రులకున్న ప్రాధాన్యత అతి స్వల్పం. కథాసాహిత్య చరిత్రలో రచయితలకు ఇచ్చిన స్థానం రచయిత్రులకు ఇవ్వలేదు. స్త్రీవాద సాహిత్యం ‘80 ల్లో మొదలైనా, భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ మొదలుకొని అనేక మంది రచయిత్రులు స్త్రీ చైతన్యం, స్త్రీ వ్యక్తిత్వం లాంటి అంశాల్ని 1900 నాటికే అప్పటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టు తమ రచనల్లో ప్రస్తావించారు. చర్చించారు. అచ్చామాంబ, వరలక్ష్మమ్మ, ఇలిందల సరస్వతిదేవి, పి.శ్రీదేవి, శివరాజు సుబ్బలక్ష్మి మొదలైన రచయిత్రుల కథల గురించి ఎవరూ ఎక్కడా చర్చించిన దాఖలాలు మనకు కథాసాహిత్య చరిత్రలో కనిపించవు. కథకు సంబంధించిన చర్చలన్నింటిలోనూ ‘50 ల నాటి రచయిత్రుల ప్రస్తావనలు నామమాత్రంగానే కనిపించడం విషాదకరం. తెలుగు కథ మీద ఇప్పటివరకూ వచ్చిన పుస్తకాలు , వ్యాసాలు అనేకం పరిశీలించినపుడు ఓ ముగ్గురు,నలుగురు రచయిత్రుల పేర్లతో.. ఫలానావారు రాసేవారు అంటూ ఏకవాక్యానికే పరిమితం కావడం కంపిస్తుంటుంది. రచయిత్రుల కథల గురించి, వారి శైలి, కథనం గురించి సీరియస్‌గా ఎవరూ చర్చించినట్టు కనిపించదు. గురజాడా దిద్దుబాటు ‘ ని, అచ్చహమాబ ‘ స్త్రీ విద్య ‘, ‘ ఖనా ‘ లాంటి కథల్ని పక్కనపెట్టి చూసినప్పుడు దిద్దుబాటు కంటే స్త్రీ విద్య, ఖనా కథలు ఏ విధంగానూ తీసిపోవన్న సత్యం బోధపడుతుంది.
విక్రమాదిత్యుని ఆస్థానంలోని జ్యోతిశ్శాస్త్రవేత్త మిహిరుని భార్య ఖనా కు ఎలాంటి దుర్గతి పట్టిందో చెపుతూ అచ్చమాంబ రాసిన కథ స్త్రీలు అప్పటికే సమాజంలో తమ స్థితిగతుల్ని గుర్తించడం మొదలుపెట్టారనటానికి నిదర్సనం.అలాగే ఐరోపా మహాసంగ్రామానంతర దుస్థితిని, మాంచెస్టర్ నూలు మిల్లులు వచ్చి దేశీయ పరిశ్రమలను దెబ్బతీసిన వైనాన్ని కనుపర్తి వరలక్ష్మమ్మ “కుటీరలక్ష్మి” (1924) కథలో చిత్రించారు. ప్రపంచీకరణ తొలిరూపాలు సృష్టించబోయే విధ్వంసానికి మూలాల్ని మనం ఈ కథలో చూడవచ్చు.ఇలాంటి మంచి కథల్ని, రచయిత్రుల్ని పట్టించుకున్నవారు తక్కువే.
స్త్రీల సాహిత్యాన్ని చర్చించకుండా అసలు గుర్తించనట్టు మౌనంగా పక్కన పెట్టడం ఒకరకమైన వివక్ష అయితే, దాన్ని కేవలం సిద్ధాంతపరిధిలోమాత్రమే విమర్శించడం మరో రకమైన వివక్షగా పేర్కొనవచ్చు. ఇప్పటికీ మనకు పత్రికల్లో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం - స్త్రీల రచనల్ని, వారి పుస్తకాల్ని సాధారణంగా స్త్రీలే సమీక్షించుకోవడం.
స్త్రీవాద రచయిత్రులు రాసిన కథల్ని విమర్శించే విధానానికి, స్త్రీవాద రచయితలు రాసే కథల్ని విమర్శించే విధానానికి వున్న తేడా విమర్శకులకున్న పక్షపాత ధోరణిని తేటతెల్లం చేస్తుంది. రచయిత్రుల కథల్ని స్త్రీవాద సిద్ధాంతపరిధిలో వున్నాయని విమర్శించే విమర్సకులు రచయితల కథల్ని స్త్రీవాద దృక్పథంతో వున్నాయని గొప్ప చేసి చూపించడం అలాంటిదే.
ఉదాహరణకు అత్యాచారం ఇతివృత్తంగా ఓ రచయిత్రి రాసిన కథ, ఓ రచయిత రాసిన కథ తీసుకుంటే వాటిని విమర్సకులు ఎలా విమర్శించారో చూస్తే…
వివినమూర్తి కథ ‘ నేరం ‘, నిర్మలారాణి కథ ‘ మలుపు ‘ తీసుకుంటె నిర్మలారాణి కథలో మోతుబరి చేతిలో అత్యాచారానికి గురైన సునీత అతనితో పెళ్ళికి ఒప్పుకోదు. కానీ అత్యాచారం వల్ల కలగబోయే బిడ్డకు మాత్రం అతని అసథిలో వారసత్వం అడుగుతుంది. ఇందులో గందరగోళమేమీ లేదు. బలవంతంగా అత్యాచారం చేశాడు కాబట్టి దాని పెళ్ళి అనే సాంఘిక లైసెన్స్ తో సమాజ అంగీకారానికి తీసుకురావల్సిన పనిలేదు. ఇక అత్యాచారం వల్ల కలగబోయే బిడ్డ ఆ చర్యకు ఫలితం కాబట్టి బిడ్డను పెంచడానికి అందుకు బాధ్యుడైన వాడి వద్ద నుండి అతని ఆస్థిలో వాటా అడగడం సమంజసం. ఈ కథను విమర్శించిన కోడూరి శ్రీరామమూర్తి సునీత నిర్ణయం గందరగోళంగా వుందని వ్యాఖ్యానించారు.
వివినమూర్తి రాసిన నేరం కథ చూస్తే, విప్లవజీవితం నుండి తండ్రి రమ్మంటే బైటకు వచ్చి పెళ్ళి చేసుకుని అమెరికా వెల్తుంది వైప్లవ్య. అకక్డ కొన్నాళ్ళున్నాక మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి కార్పోరేట్ ఆస్పత్రి కట్టీస్తారు భార్యాభర్తలు వైప్లవ్య, రాఘవలు. ఇంట్లో పనులు చూసుకోవడానికి పెట్టుకున్న పనివాడు భిక్షంను పనివాడిలాగా కాకుండా విప్లవ భావజాల ప్రభావంతో తమతో సమానంగా చూస్తారు ఆ భార్యాభర్తలు. భిక్షం వైప్లవ మంచితనం (?) అర్ధం చేసుకోకుండా ఆమెపై అత్యాచారం చేసి చివరికి పశ్చాత్తపపడతాడు. అపప్టివరకూ భార్య మాటకు ఎదురు చెప్పని రాఘవ అత్యాచారం సంఘటనతొ వైప్లవ్యకు విడాకులిస్తాడు. అత్యాచారం సంఘటనతో షాక్‌కు గురై ఆస్పత్రిలో వున్న వైప్లవ్య ఆ షాక్ నుండి కోలుకొని భిక్షం తప్పును క్షమించి తన కొడుకుగా దత్తత తీసుకుంటుంది. ఈ కథంతా విన్న శిష్యుడు ‘ ఎక్కడుండాల్సిన వాళ్ళను అక్కడ ఉంఛకపోతే ఇలాగే జరుగుతుందన్న ‘ మాటలకు గురువు చెంపదెబ్బ కొట్టడంతో కథ ముగుస్తుంది. ఇలాంటి అతి సాధారన వ్యాఖ్యలు చేసే మేధావులకు చెంపదెబ్బ కొట్టడం లాంటిది ఇది అంటారు కోడూరి. ఈ కథలో కేవలం చివర్లో చూపిన పరిష్కారమే కాదు. మొదటి చివర వరకూ కథలో , కథనంలో అనేక లోపాలున్నాయి. అయితె కోడూరి దీని గొప్ప కథగా చెప్పటమే కాకుండా ఇందులో స్త్రీవాద దృక్పథానికి మించిన పరిధి వుందనటం విశేషం.
అత్యాచారం అనే అంశాన్ని రచయితలిద్దరూ రెండు రకాలుగా చిత్రించారు. ఇందులో నిజానికి నిర్మలారాణి కథ స్త్రీవాదానికి దగ్గరగా అనడం కంటే జీవన వాస్తవికతకు దగ్గరగా వుందని చెప్పాలి. కానీ వివినమూర్తి కథలోని ప్రధాన లోపం బలహీనమైన వ్యక్తిత్వమున్న వైప్లవ్య పాత్ర. విప్లవ జీవితంలోంచి తండ్రి పిలిపించేస్తే వచ్చేస్తుంది. చాలా మంది లాగానే డబ్బున్నవాడిని పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళిపోయి డబ్బు సంపాదించి తిరిగివస్తుంది. తిరిగొచ్చాక మంచి కార్పోరేట్ ఆస్పత్రి కట్టిస్తారు భార్యాభర్తలు. ఇలా అన్న్నీ తమకనుకూలంగా చేసుకుంటున్నా వైప్లవ్య అంతరంగంలో చాలామధనపడుతోందని, అపరాధ బహవనకు గురవుతోందని రచయిత వాచ్యంగా చెప్తారు.ఆ అపరాధ భావనతోనే పనివాడిని పనివాడిలా చూడాలనుకోవడం కాకుండా తమతో పాటు ఇంట్లో సమాన హోదా కల్పిస్తారు. అంటే అపరాధ భావనకు ఇది పరిష్కారమా? ఆమెలో అపరాధ భావన కథలో బలంగా చిత్రితం కాకపోవడమన్న లోపాన్ని పక్కన పెడితే అత్యాచారం జరిగిన తర్వాత భర్త వైప్లవ్యను వదిలేస్తాడు. ఆమె షాక్‌కు గురై ఆస్పత్రిలో చేరుతుంది. అత్యాచారం అనేదాన్ని శీలం, పాతివ్రత్యం అనే భావనల నుండి కాకుండా దాన్ని శరీరంపై జరిగిన ఒక యాక్సిడెంట్‌గా పరిగణించి ఆమె ఆ చేదు అనుభవం నుండి బైటపడితే అది సహజత్వానికి దగ్గరగా వుండి స్త్రీవాద కథ అయివుండేదేమో. అందుకోసం ఆమె తనను రేప్ చేసినవాడిని కొడుకుగా స్వీకరించి మాతృత్వభావనను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం మనకు కథ రిత్యా కాని, సమాజ రిత్యా కాని కనిపించదు. అత్యాచారంపై వచ్చిన కథల్లో వైపవ్య చేసినది ఓ విభిన్న పరిష్కారం. వివినమూర్తి కథకు వినూత్న ముగింపు ఇచ్చారు. అంత మాత్రాన అది స్త్రీ వాద కథ అయిపోదు.
అత్యాచారం లాంటి స్త్రీల సమస్యకు భిన్నమైన ముగింపు ఇచ్చిన వివినమూర్తి నేరం కథ ఆ ఏడాది వచ్చిన మంచి కథగా పొందితే ఇదే సమస్యకు మరో భిన్నమైన ముగింపు ఇచ్చిన నిర్మలారాణి కథ గందరగోళం వున్న కథగా విమర్శకుల వ్యాఖ్యానం పొందింది.
ఇలాంటి ఉదాహరణలు వెతుక్కుంటూపోతే కోకొల్లలుగా మనకు ఇటీవలి తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి.
సద్విమర్శ అనేది సాహిత్యానికి ప్రాణవాయువు లాంటిది. అలాంటి సద్విమర్స రచనల మీద రావాలి. అంతే కాని రచయిత్రుల వ్యక్తిగత జీవితాలపైనో, వారు నమ్ముకున్న సిద్ధాంత భావజాల మీదనో కువిమర్సలు చేస్తూ హస్య, వ్యంగ్యాత్మకంగా కథలు రాయడం నీచ సంస్కృతి. అలాంటి నీచ సంస్కృతి తెలుగునాట మొదలైంది. నిజమైన సాహిత్యాభిలాషులెవరైనా దాన్ని ఖండించాల్సిందే…
స్త్రీ వాద సాహిత్యం పై సాధికారతతో రాసిన ఈ వ్యాసం నాకు నచ్చింది.
మీ వ్యాసంలో కంటెంట్ సంగతెలా ఉన్నా అక్షర దోషాలు పుష్కలంగా ఉన్నాయి. అవి సవరించగలరు.
వ్యాసం బాగుంది.
అఖరున మీరన్న ” సద్విమర్శ అనేది సాహిత్యానికి ప్రాణవాయువు లాంటిది. అలాంటి సద్విమర్స రచనల మీద రావాలి. అంతే కాని రచయిత్రుల వ్యక్తిగత జీవితాలపైనో, వారు నమ్ముకున్న సిద్ధాంత భావజాల మీదనో కువిమర్సలు చేస్తూ హస్య, వ్యంగ్యాత్మకంగా కథలు రాయడం నీచ సంస్కృతి. అలాంటి నీచ సంస్కృతి తెలుగునాట మొదలైంది. నిజమైన సాహిత్యాభిలాషులెవరైనా దాన్ని ఖండించాల్సిందే…” ప్రామాణిక సత్యమైనా, అచారణలో దానిని ఎంతమంది పాటిస్తున్నారన్నది చూడాలి!
అప్పుతచ్చులు ఎక్కువగానే ఉన్నవి! ఐనా మీ చెయ్యి బాగోనప్పడు, ఇంకెవరైనా సాహిత్యాభిమానితో టైప్ చేయించడానికి ప్రయత్నించండి.
@ నెటిజన్ , శరత్ వ్యాసం నచ్చినందుకు థాంక్స్. ప్రతిమ గారు అక్షరదోషాలకు క్షమాపణలు. నెమ్మదిగా సరిచేస్తాను.
బాగుంది కల్పనా. అక్షరదోషాలకేం గానీ, స్త్రీల రచనలగురించి, ఈనాడు వస్తున్న విమర్శలగురించి మంచి సమీక్ష అందించావు. ముందు నీకు చెయ్యి నయం అయినతరవాత, వీలయినప్పుడు, ఈవిషయంమీద సమగ్రమైన, సంపూర్ణమైన వ్యాసం ప్రచురించగలవని ఆశిస్తున్నాను.
తీసుకున్న విషయం, రాసిన నిడివి రెండిటి ప్రకారంకూడా ఇది చాలా విశాలమైన విమర్శ. ఈ కాలంలో స్రీవాదం అనేది ఒక politically correct పంధా. భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ భావజాలం యొక్క సైద్దాంతిక స్వరూపం అస్తవ్యస్తంగా ఉంది.
ఇలాంటి స్థితిలో rhetoric కి ఉన్న విలువ సాహిత్యానికి లేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. రాజకీయ పార్టీలు emotive slogans వాడినట్లు చాలా మంది రచయిత/త్రు లు ఈ వాదాన్ని వాడేస్తున్నారు.
సాహిత్యాన్ని కేటగరైజ్ చెయ్యటంలో మొదటిది సహజసిద్దంగా వచ్చిన సాహిత్యాన్ని సిద్దాంతీకరించే పద్దతైతే మరొకటి సిద్దాంతాన్ని బట్టి సాహిత్యాన్ని సృష్టించడం.ప్రస్తుతంవున్న చాలా మంది స్త్రీవాద రచయిత/త్రు లు చేస్తున్న పని రెండోరకానికి చెందింది. అందుకే ఇన్ని సమస్యలున్నాయని నా అభిప్రాయం. విమర్శకుల వివక్షకి ముఖ్య కారణంకూడా అదే కాబోలు. విస్తృతమైన మానవసంబంధాలూ, సామాజిక సమస్యలమీద రచయిత/త్రులు సహజంగా రాసిన తరువాత వాటిల్లోవున్న స్త్రీవాదకోణాన్ని అర్థం చేసుకుని విమర్శనలు చెయ్యడం వేరు, కేవలం స్త్రీవాద రచనగనక ఆ ధృష్టికోణంలో దాన్ని చూసి ‘విలువకట్టడం’ వేరు.
“A failed writer becomes a critic” అన్నట్లు, మన తెలుగు సాహిత్య విమర్శకులలో చాలా మంది ఈ బాపతుగానే అనిపిస్తారు. వారు చేసే “విమర్శ”లెక్కువా “విమర్శనలు” తక్కువా. ఎంతసేపూ ఉన్న సాహిత్యంలో లోపాలను వెతకడానికి కంకణం కట్టుకున్నట్లు మాట్లాడతారేగానీ, ఆ రచనకున్న సామాజిక విలువ, పాఠకులకు ఈ రచన ఎలా ఉపయోగకరంగా ఉంటుందో విశ్లేషించరే? వీళ్ళందరూ T.S.Eliot, F.R.Leavis, Mathew Arnold వంటి విమర్శకులని చదివుండరనిపిస్తుంది.
ఇక్కడున్న అందరికీ ఒక ప్రశ్న…ఈ మధ్యకాలంలో ఎంతమంది పుస్తక సమీక్షనో లేక విమర్శనో చదివిన తరువాత ఆ రచనల్ని చదవటానికి నిర్ణయించుకున్నారు? When was the last time you decided to read a book after reading a review of a critique of the book?
”ఈ భావజాలం యొక్క సైద్దాంతిక స్వరూపం అస్తవ్యస్తంగా ఉంది.”ఏరకంగానో నాకైతే అర్దం కాలేదు. దీన్ని వివరించగలరా?
మంచి రచయిత/త్రులు కావాలని సిద్దాంతం కోసం కధలు రాయరు. అలా ఎవరు రాసినా అవి మంచి కధలుగా కలకాలం నిలబడలేవు. పనిగట్టుకొని సిద్దాంతం కోసం రాసిన రైటర్స్ కధారచనలోను, పాపులారిటి లోను తప్పనిసరిగ విఫలమవుతారు. కొందరు రైటర్స్ వాదాల లేబుళ్ళు పెట్టుకొని కధలు రాసినట్టే, కధలు చదవటానికి ముందే ఈ రైటర్ ది ఈ వాదం, ఇక్కడ ప్రచురిస్తే ఇలాగే వుంటాయన్న రంగు కళ్ళద్దాలు పెట్టుకొని కొందరు పాఠకులు, లేదా విమర్శకులు చదవటం వల్ల చాలా కధలు misunderstanding కి గురవుతాయని నేను అనుకుంటాను.
”ఇక్కడున్న అందరికీ ఒక ప్రశ్న…ఈ మధ్యకాలంలో ఎంతమంది పుస్తక సమీక్షనో లేక విమర్శనో చదివిన తరువాత ఆ రచనల్ని చదవటానికి నిర్ణయించుకున్నారు? When was the last time you decided to read a book after reading a review of a critique of the book? ”
అది ఆ పుస్తక సమీక్ష లేదా విమర్స చేసిన వారిని బట్టి వుంటుంది. వాళ్ళకు ఆ పుస్తకం ఎంతమేరకు అర్ధమైంది, ఎంతమేరకు దాన్ని విపులంగా సమీక్షించగలిగారు అన్నది ఈ సందర్భంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే నా మటుకు నాకు చాలా సార్లు ఎలాంటి review చదవకుండా పుస్తకం చదవటమే ఇస్టం. దానివల్ల reviewer influence నా ఆలోచనల మీద వుండకుండా వుంటుంది.
తెలుగు సాహిత్యాన్ని విమర్సించటానికి తప్పనిసరిగ Eliot, Arnold చదివి వుండాల్సిన పని లేదన్నది నా అభిప్రాయం. అయితే వాళ్ళను చదవటం వల్ల ఒక text ని ఎలా చూడవచ్చు, లేదా ఎలా అర్దం చేసుకోవచ్చు అన్న విషయంలో మన అలోచన పద్ధతి తప్పనిసరిగా మెరుగవుతుంది .
1)మీకు అర్థం కాక అడిగారంటే నేను నమ్మలేను. అయినా ఆ స్టేట్మెంట్ ఇచ్చింది నేను గనక,వివరించాల్సిన నైతిక బాధ్యతని తీసుకుని వీలైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.
సాధారణంగా భారతీయ స్త్రీవాదాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటిది బ్రిటిష్ పాలన సమయంలో జరిగిన సామాజిక ఉద్దరణ. దీనికి మూలం మానవత్వం అనిచెప్పుకోవచ్చు. ‘సాంఘిక సంక్షేమం’ ఆధారంగా కొందరు సతీసహగమనం,వితంతువివాహం మొదలైనవాటి నిర్మూలనకు పోరాడిన సమయం ఇది.
రెండవది, స్వాతంత్రోద్యమ నేపధ్యంలో జరిగిన మహిళా చేతన. ముఖ్యంగా గాంధీ భారతీయ రాజకీయ తెరపైకివచ్చి మహిళల్ని కార్యోన్ముఖుల్ని చేసిన దశలో జరిగిన కాలమిది. ఇప్పుడే ‘మహిళలు మాత్రమే’ ఉన్న సంస్థలూ,ఉద్యమాలూ మొదలయ్యాయి. ఇవన్నీ దేశస్వాతంత్ర్యంతోపాటూ మహిళా స్వేచ్చని కాంక్షించేవిగా ఎదిగాయి.
స్వాతంత్ర్యానంతరం కూడా వీరి పరిధి మహిళాశిశు సంక్షేమం, సమాన వేతనాలు వంటివాటికే పరిమితమయ్యాయి. ప్రభుత్వంకూడా ఈ ఫనులన్నింటినీ ఒక ప్రోత్సాహంలాగానే (దయతలచినట్లు) చేసిందేతప్ప “హక్కుల” ధృక్కోణంలో చెయ్యలేదు.
మూడవభాగం 1970లలో ప్రపంచవ్యాప్తంగా,ముఖ్యంగా అమెరికాలో వచ్చిన స్త్రీవాద మార్పుల నేపధ్యంలో భారతీయ స్త్రీవాదం మరో బలమైన మలుపు తిరిగింది. వ్యక్తిగతస్వేచ్చ,హక్కులు, జెండర్, సెక్సువాలిటీ,గృహహింస, పితృస్వామ్యం వంటి విస్తృతమైన సమస్యల్ని ప్రధానస్రవంతిలోకి తీసుకురావడానికి ఈ సమయంలో ప్రయత్నాలు జరిగాయి.
పైన ఉన్న ప్రతి భాగంలో అప్పటి పరిస్థితికి అనుగుణంగా సాహిత్యసృజన జరిగింది. కాకపోతే, భారతదేశం 1990వ దశకంలో చాలా విప్లవాత్మకమైన మార్పుల్ని సంతరించుకుంది. 1970 లలోని ఆర్థిక మూసతో స్త్రీవాద ఉద్యమం ముడిపడివున్నట్లే, ఈ విప్లవాత్మక మార్పుల దృష్ట్యా ఈ వాదంలోనూ మార్పులు రావాల్సింది. కానీ ఛాంధసవాద భావాలూ, సాంప్రదాయక విలువలలోని సౌఖ్యాన్ని అంతర్లీనంగా గ్రహించిన చాలామంది స్త్రీవాదులు కేవలం దీన్ని battle of sexes గా మార్చి, సమాజమూలాల్ని మార్చడంగురించి చర్చించడం మానుకున్నారు. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమయ్యింది.
ఈ నేపధ్యంలో స్త్రీవాదంలో ఒక రకమైన డొల్లతనం కనిపించడం ప్రారంభమయ్యింది. అమెరికా స్త్రీవాదాన్ని ఆదర్శంగా తీసుకున్న స్త్రీవాదులు, కేవలం వారికి అనుకూలమైనవాటిని మాత్రమే ఏరుకుని, మిగతా “స్వేచ్చ” విషయాలలో పితృస్వామ్యం మూసనే మళ్ళీ మన సమాజంపై తమ సాహిత్యం ద్వారా రుద్దటం ప్రారంభించారు. ఇక్కడే ఒక disconnect మొదలయ్యింది. అటు మూలసిద్దాంతం, ఇటు త్వరితగతిన మారిన సమాజం నేపధ్యంలో ఒక విధమైన సైద్దాంతిక గందరగోళం ఏర్పడింది.
చాలావరకూ స్త్రీవాద రచయిత/త్రులు నగరానికి చెందినవారవటం కారణంగా ఈ తేడా మరింత స్పష్టంగా కనిపించడం మొదలయ్యింది. మూల సమస్యలకన్నా కొసరు సమస్యలను నెత్తికెత్తుకుని అదే స్త్రీవాదంగా భ్రమించడం మొదలయ్యింది. అందుకే “all men are pigs” వంటి సులభమైన భావజాలాన్ని సృష్టించి దీన్ని మగాడికీ ఆడవారికీ మధ్య సమస్యగా మాత్రమే చూపుతూ తమ పబ్బం గడుపుకోవడం మనకు తెలిసిందే. ఇంతలో మారాల్సిన సమాజం అర్జంటుగా మారిపోయి, ఈ సిద్దాంతాలకి “బూజుపట్టించేసింది”. యువతలో చాలామంది ఈమూస స్త్రీవాదం నుంచీ దూరంగా ఉండాలనుకోవడం ఈ సైద్దాంతిక అస్తవ్యస్తతే అని నాకు అనిపిస్తుంది.
“అడామగాకున్నది మిత్రవైరమేకానీ శతృత్వంకాదన్న” మూల సిద్దాంతాన్ని విస్మరించి ప్రస్తుత స్త్రీవాదం,దాని సాహిత్యం కఠినత్వాన్ని నటిస్తోందని నేను చదివిన కొన్ని కథల మూలంగా అనిపించింది. మార్చాల్సిన కనబడే సామాజిక వ్యవస్థలకన్నా, పితృస్వామ్య భావజాలమనే ఒక శతృవుతో పోరాడటానికి వీరు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు కనబడుతుంది. దీనికితోడు, కొంత ఈ ఆలోచనా శైలితో విభేధించే ఏ స్త్రీనైనా లేక పురుషుడినైనా లేబుల్స్ తగిలించేసి “వెలివేసే” అలవాటు స్త్రీవాదుల్లో తయారయ్యింది.
70లలో ఆగిపోయిన స్త్రీవాద భావజాలం 90ల sensitivity ని పుణికితెచ్చుకోకుంటే, అసలే తెలుగు చదవడం మానేస్తున్న యువత, స్త్రీవాదం అనే మాటవింటేనే ఆ సాహిత్యంవైపు కన్నెత్తిచూసే సాహసం చెయ్యకపోవచ్చు. ఇక కేవలం రాసినోళ్ళూ,పబ్లిష్ చేసినోళ్ళూ లేక వృత్తిరీత్యా విమర్శకులూ ఆ సాహిత్యాన్ని చదవాల్సిందే. ఆ భావజాలాన్ని అభినందించాల్సిందే.
I don’t mean to take away any credit from feminism for what it has done in the past. But, at present if they don’t sensitize themselves with present day reality, the time may come when it is dead and none will be there even to mourn it.
2) నేను చెబుతున్నదీ అదేనండి. ప్రస్తుతం చాలామంది ప్రస్తుతం మార్కెట్లో ఈ వాదం నడుస్తుంది కాబట్టి రాయటం మొదలయ్యిందిగనకనే credibility ఒక సమస్యగా మారింది. ఇక పాఠకులంటారా, వారిని తప్పుబడితే నేను అంగీకరించను. Readers have every right to interpret the text as they wish. కాకపోతే విమర్శకులుకూడా సాధారణ పాఠకుల్లాగా భావజాలం రంగుటద్దాలతో a work of artని కొలవడం నేను అంగీకరించలేని విషయం.
“Literary criticism has a great role to play in not only indexing what is written, but also to contextualize the written word in present day society” అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. అందుకే సాహితీ సమీక్షలకూ, విశ్లేషణలకూ,విమర్శనలకూ నేను విలువనిస్తాను. కాకపోతే మన తెలుగులో కులాలూవాదాలూ తప్ప సమాజం ఎక్కడా విమర్శకుల ధృక్కొణంలో కనిపించక నిరాశపడుతూ ఉంటాను. ఈ విషయంలో మీ సొంత అభిప్రాయానికెప్పుడూ విలువుంది. అది పాఠకుడి చాయ్స్ కాబట్టి.
ఎలియట్ ఆర్నాల్డ్ చదివితేగానీ విమర్శకుడు కాదని నా ఉద్దేశం కాదు. కానీ, విమర్శకుడిగా మన బాధ్యత,నిబద్దత తెలియాలంటే సాహితీ విమర్శకు సంబంధించిన విభిన్నమైన ఆలోచనలు ఖచ్చితంగా తెలియాలి. అందుకే బహుశా మన విమర్శకులు చదవలేదేమో అనే సందేహం వెల్లడించాను.
>>>>>
స్త్రీలను గొడ్రాళ్ళుగా, మాచకమ్మలుగా వెక్కిరించిన పురుషాధిపత్యానికి
>>>>>
ఈ పురుషాహంకారులని విమర్శిస్తూ నేను కూడా వ్రాసాను ఈ లింక్ లో: http://sahityaavalokanam.net/?p=150