వెన్నెల, జలపాతాలు, ప్రకృతి సౌందర్యం వీటిని ఇష్టపడి ప్రేమించని వారెవరు? ఆరాధించనివారెవ్వరు? అయితే అందరూ చేయలేని పని ఒకటుంది. అది వెన్నెలని కవిత్వం గా, కవిత్వాన్ని వెన్నెల గా మార్చగలగటం. ఆ ఆల్కెమి తెల్సిన మంచి కవుల్లో వైదేహి ఒకరు. ఇప్పటికే చాలా మంది ఇటీవల వైదేహి కవిత్వాన్ని సమీక్షించారు. అవి నేను కూడా చదివాను. అయితే అవేమి ఇప్పుడు నేను వైదేహి కవిత్వాన్ని గురించి రాస్తున్నప్పుడు నాకు గుర్తు లేవు. ఇప్పుడు నేను రాస్తున్న ఈ నాలుగు మాటలు కూడా ఎవరికీ గుర్తుండవు. ఎందుకంటే అప్పటికే అందరి మనస్సుల్లో వైదేహి కవిత్వం గుర్తుండిపోయింది కాబట్టి. ఈ కారణం చేతనే నాకు కవిత్వాన్ని సమీక్షించుకోవటం ఒక్కోసారి అనవసరమనిపిస్తుంది. కవిత్వం ప్రధానం గా అనుభూతి ప్రక్రియ. ఆ అనుభూతిని అనుభవించటమే తప్ప ఇంకేమి చేసినా ఆ సహజ సౌందర్యం ముందు నిలబడవు.
అందుకనే వైదేహి ఏం చేసిందంటే తిలక్ ని, అతని కవిత్వాన్ని, ఆ కవిత్వం లోని వెన్నెల సొబగులని, సౌందర్య జలపాతపు వొంపు సొంపుల్ని తన మనసు లోతుల్లోకి వొంపేసుకుంది. తనూ, తిలక్ ఇక ఒకటై పోయారు. తానే ఒక తిలకై పోయారు. ఇక మనమేం మాట్లడతాము? ఒక్క తన కవిత్వపు నిషాలో మత్తెక్కి పోవటం తప్ప. ఎంత అందంగా అనుభూతించగలిగింది, ఎంత బాగా అక్షరీకరించగలిగింది అని తన్మయత్వంతో మురిసిపోవటం తప్ప. తన కవిత్వం చదివిన తర్వాత ఇప్పటి దాకా ఏమీ రాయకుండా నేను చేసింది అదే.
(మనందరికీ ఇష్టమైన ఇస్మాయిల్ గారి అవార్డ్ ని అందుకుటున్న మన వైదేహి కి ప్రేమతో, స్నేహంతో ఈ నాలుగు వాన చినుకుల్లాంటి మాటలు)
“కవిత్వం ప్రధానం గా అనుభూతి ప్రక్రియ. ఆ అనుభూతిని అనుభవించటమే తప్ప ఇంకేమి చేసినా ఆ సహజ సౌందర్యం ముందు నిలబడవు. ”
రెండు వాక్యాల్లో వున్న మాట చెప్పేసారు. ఆ అనుభూతి కోసమే నేను జీవిస్తుంది. నా అనుభవాన్ని ఇంకొంచం ఇంకొంచం కలుపుకుంటూ ఈ కవితా సాగరంలో ఈదుతున్నదీను. ఎందరెన్ని చెప్పిన ఒక్కొక్కరిదీ ఒక్కో బాణీ కదండి, మళ్ళీ మళ్ళీ వినాలనేవుంటుంది, కొందరి గురించి.
నిద్రితనగరపు అద్భుత కవయిత్రికి అభినందనలు.
స్వాప్నికలోక వైదేహిగారికి శుభాభినందనలు
ఏ చిన్న కలహమైతే మన మధ్య కోటగోడలా నిల్చి
మన మాటలు మనకే వినపడకుండా చేసిందో…
నేను చెప్పాలనుకున్నవన్నీ నీకూ
నీవు చెప్పలేనివన్నీ నాకు
గుసగుసగా వినిపించేసి
నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం
మూగవోయిన వాయిద్యమై మెరుస్తుంది.
ఇంత సటిల్ ఫీలింగ్స్ ని అంతే స్పష్టంగా అక్షరాలలోకి తర్జుమా చేయగలగటం మామూలు విషయం కాదు. భాషపై పట్టు, భావాలలో క్లారిటీ, వాక్యనిర్మాణంపై సాధికారికత ఉంటే తప్ప సాధ్యం కాదు.
అద్బుతమైన కవిత్వం. ఇస్మాయిల్ గారి అవార్డుకు వన్నె, బరువు, పరువు కలిగించిన ఎంపిక అనటం సముచితమే.
వైదేహి గారికి అభినందనలు.
బొల్లోజు బాబా
హ్మ్మ్మ్
నా అజ్ఞానానికి మన్నించండి. వైదేహి ఎవరబ్బా! కానీ, ఈ సారి ఇస్మాయిల్ గారి కవిత్వ బహుమతి నామాడి శ్రీధర్ గారి “బంధన చాయ”కు వచ్చినట్టు ఈరోజే చదివానే. మరేమనుకోక వైదేహిగారిని, వారి కవిత్వాన్ని పరిచయం చేయండి- వీలు చూసుకుని.
కల్పన గారూ,
ఈ రోజు మాలతి గారు చెప్పేవరకూ,అనేక రకాల పనుల వత్తిళ్ళలో ఉండి మీ బ్లాగు చూడలేదు.ఇంత స్నేహపూర్వకంగా,అరమరికలు లేని అభిమానంతో మీరు తెలిపిన అభినందనలకు ధన్యవాదాలు.
మీవంటి ప్రముఖ కవయిత్రి,రచయిత్రి నుండి అభినందనలు అందుకోవటం నాకు చాలా సంతోషకరం.
సహృదయతతో అభినందనలు తెలిపిన సాహితీ మిత్రులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.
వైదేహి శశిధర్
మిత్రులు రవి కుమార్ గారికి
ఇస్మాయిల్ గారి అభిమాని అయిన తమ్మినేని యదుకుల భూషణ్ గారు తమ గురుతుల్యులైన్ ఇస్మాయిల్ గారి పేరున ఇచ్చే వార్షిక పురస్కారాన్ని ఈ సంవత్సరానికి వైదేహి శశిధర్ గారికి అందించటం జరుగింది. వీరి ఈ కవితా సంకలనంపై ఈమాటలో మంచి రివ్యూ వచ్చింది. వీలైతే చూడండి. కవయిత్రి గురించిన విశేషాలు కూడా దొరుకుతాయి.
ఇక మీరంటున్న బంధన ఛాయ గురించైతే, కాకినాడలోని కొంతమంది ఇస్మాయిల్ అభిమానులు వారి పేరున ఏర్పాటుచేసిన కవితా పురస్కారాన్ని ఈ సంవత్సరం నామాడి శ్రీధర్ గారికి ఇచ్చారు. బంధన చాయ పుస్తకం గురించి గత రెండునెలలుగా మా వూరి బుక్ డిపో వానికి చెపుతున్నా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని రోజులు దొర్లిస్తున్నాడు.
నామాడి శ్రీధర్ మంచి కవి. ఏ విధమైన ఇజాల జోలికీ పోకుండా మంచి స్వచ్చమైన కవిత్వం వ్రాసే, మనకున్న మంచి కవులలో ఆయనొకరు. ఆయన గత సంపుటి పేఋ ఆకుపచ్చని లోయ. చాలా మంచి పేరు తెచ్చుకొంది.
భవదీయుడు
బొల్లోజు బాబా