తెలుగు కథాచర్చ -రెండవ భాగం
కథావిమర్శ (చర్చ) – రెండోభాగం : వ్యాఖ్యలూ, విమర్శలూ, సంపాదకులధోరణిలో మార్పులు
ఈ చర్చ మొదటి భాగం ఇక్కడ.
కల్పనః మాలతిగారు, క్రితంసారి మనం కధలగురించి మాట్లాడుకున్నప్పుడు మంచి కధలగురించి తర్వాత మాట్లాడాలనుకున్నాము కదా! అసలు మంచికథ అంటే ఏమిటి? ఎలా నిర్ణయిస్తాం ఏది మంచికథో?
మాలతిః ఏమో మరి. కొన్నాళ్లపాటు నేను కూడా చాలామంది విమర్శకులలాగే, ప్రారంభం, ముగింపూ, సన్నివేశాలూ, సంఘర్షణలూ, పాత్రపోషణ అంటూ కొన్ని కొలమానాలు అవసరం అనుకున్నాను కానీ, ఆలోచించినకొద్దీ అలాటి కొలతల్లో ఇమడకపోయినా, పాఠకుల ఆదరణ పొందినరచనలు కనిపిస్తున్నాయి. అలా చూసినప్పుడు, మనం కథని ఇలా ఒక చట్రంలో బిగించడం రచయితలభావుకతకి ప్రతిబంధకం అనిపిస్తోంది. అంచేత మంచికథ ఏదీ అనడం కంటే నేను ఎందుకు రాస్తున్నాను అంటే చెప్పగలనేమో. మరి నీ అభిప్రాయంలో మంచి కథ అంటే ఎలా వుండాలి?
కల్పనః ఏది మంచికధగా గుర్తించబడుతోంది? లేదా పాఠకులదృష్టిలో ఏది మంచికధ? అనేది ఒక ప్రశ్న అయితే, రచయితదృష్టిలో, సంపాదకులదృష్టిలో మంచికధ అనుకున్నది పాఠకులకు మంచి కధ అవుతోందా, లేదా? అనేది ఇంకో ప్రశ్న. మీరు చెప్పిన కొలమానాలు అవసరమే. అయితే అవి మాత్రమే కధ కాదు. ఇంతకుముందు మనం చాట్లో చెప్పుకున్నట్టు ఈనాటి కధాస్వరూపం మారింది అని నేననుకుంటున్నాను. అందుకే narratives కూడా కధలవుతున్నాయి. వీటినన్నింటిని గుర్తించి, అర్ధం చేసుకున్న అవగాహనతో మాత్రమే మనం మంచికధ అంటే ఏమిటి అని మాట్లాడుకోవాలంటాను నేను. మీరేమంటారు? అసలు మీరెందుకు కధలు రాస్తారో చెప్పండి పోనీ.
మాలతిః ఎందుకు రాస్తున్నానంటే, మనకి తోచిన ఆలోచనలు అభివ్యక్తం చెయ్యడం, పక్కవారితో చెప్పుకోవడం మానవనైజం కనక. మనం గమనించినవిషయం – అందరికీ తెలిసినదే అయినా ఎవరూ పట్టించుకోనివిషయం అయినప్పుడూ, ఎవరూ గమనించలేదు – అదేలే నాకు తెలిసినంతలో – అనిపించినప్పుడు రాయాలనిపిస్తుంది నాకు.
ఉదాహరణకి, ఈమధ్య పొద్దు.నెట్లో ప్రచురించిన “నాకోసం” కధ చూడు. ఈరోజుల్లో ఉద్యోగాలు దొరకడం కష్టంగా వుంది. దానికోసం పడేపాట్లు చాలా కథల్లో వస్తున్నాయి. అయితే మేథస్సు వుండి కూడా ఒకరకమైన స్వోత్కర్షతో, సీరియస్గా ఉద్యోగాన్యేషణ చెయ్యనివాళ్లు కూడా వుంటారన్నది అందులో ఒక అంశం. ఇది అమెరికాలోనేనా కావచ్చు. ఇండియాలోనేనా కావచ్చు. రెండోది, ఈనాటి స్త్రీలు విద్యమూలంగా ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం సంతరించుకున్నవారు. స్త్రీలకి గల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం సంసారంలో కలతలకీ, ఈతి బాధలకీ కారణమవుతున్నాయి అన్నది రెండో అంశం. ఎవరు ఎవరికోసం ఏమిటి త్యాగం చేస్తున్నారన్నది ఇదమిత్థమని మనం చెప్పలేకపోవచ్చు. కానీ ప్రాథమికంగా పాఠకులు గమనించవలసినవి ఈరెండు అంశాలూ నాకథలో. ఈ యువతీ, యువకుల మనస్తత్త్వాలు పాఠకులముందు పెట్టడమే ఈకథలో నేను చెయ్యదలుచుకున్నది. మొదటి డ్రాఫ్టులో ఇందులో సగమే రాసేను. కొందరు స్నేహితులకి చూపించి, వాళ్ల సలహాలు విని, మరికొన్ని సన్నివేశాలు చేర్చి మరింత వివరించడానికి ప్రయత్నించేను. దీనిమీద వచ్చినవ్యాఖ్యలగురించి తరవాత మాటాడుకుందాం.
నువ్వు నీకథ, అయిదోగోడ తీసుకుంటే, అందులో నువ్వు కూడా ఇలాగే చేస్తున్నట్టు అనిపించింది నాకు. నువ్వే ఆతరవాతిటపాలో రాసినట్టు, వయసుమళ్లినమగవాడు మళ్లీ పెళ్లి చేసుకోడంమీద చాలా కథలే వచ్చాయి కానీ వయసు మళ్లినస్త్రీ పునర్వివాహం చేసుకోడంమీద కథలు రాలేదు. అంచేత అది తప్పకుండా రాయవలసినకథ అని నేను అనుకుంటున్నాను. ఏమంటావు?
నువ్వు కథలు రాయడం మొదలుపెట్టినప్పటికీ, ఇప్పటికీ ఏమయినా తేడా వుందా? ఈనాటి విమర్శనాపద్ధతులగురించి నీ అభిప్రాయం ఏమిటి? ఇజాలు ప్రాతిపదికగా మంచికథ రాయడం సాధ్యం కాదా? మరోలా అడగాలంటే, చిన్నకథల్లో సిద్ధాంతపరంగా చర్చ చొప్పించి ఒప్పించడం సాధ్యమే అంటావా?
కల్పనః నా కధలు ప్రధాన అలోచనా స్రవంతిని ప్రశ్నించటం వల్ల కొంత భిన్నంగా కనిపించవచ్చు. చాలామందికి నా కధలు నచ్చకపోవచ్చు, నేను తీసుకునే ఇతివృత్తాల వల్ల. అయితే ఇలా ప్రశ్నించే కధల్ని ఏదో ఒక ” ఇజం” ముద్ర వేసి వాటికి సాహిత్య విలువ లేదని చెప్పేయటం తెలుగు నాట కొందరు విమర్శకులకు, ఇప్పుడు కొత్తగా కొందరు బ్లాగ్ పాఠకులకు అలవాటైపోయింది. అసలు “ఇజాలు” మనుషులకోసం పుట్టాయా? లేక మనుషులు “ఇజాల”కోసం పుట్టారా? ఒక కధలో “ఇజం” వుంది అని ముద్ర వేసి వెలి వేసేవారు, మౌనంగా కూడా తిరస్కరించేవారు, ఫలానాచోట మీరు “ఇజం” మాట్లాడారు, లేదా కధలో బలవంతంగా చొప్పించారు అని చూపిస్తే, నిజంగా ఏ రచయత అయినా అది ప్రయత్నపూర్వకంగా చేస్తే ఆ తప్పును దిద్దుకునే అవకాశం వుంటుంది.
Marital rape గురించి మాట్లాడటం ఇజమా? ఒక స్త్రీ రెండో పెళ్ళి చేసుకోవడం అంత సులభం కాదు. దానిచుట్టూ బోలెడన్ని మనకే తెలియని myths వున్నయని చెప్పటం ఇజమా?
కాలం ముందుకెళ్ళింది అని జబ్బలు చరుచుకునే కుహనా మేధావులకు కూడా తెలుసు ఒక స్త్రీ పెళ్ళి చేసుకోవాలంటే, ఆ పెళ్ళి చుట్టూ అల్లుకొని వున్న అనేకానేకా గృహ, శారీరక, సామాజిక హింసలు. జీవితం వాదన కాదు. కాని కొన్ని సమస్యలు చెప్పేటప్పుడు కధలో పాత్రలమధ్య వాదనద్వారా ఎన్నో విషయాలు చెప్పాల్సి వస్తుంది. అది కధనశైలికి నష్టము అయితే కావచ్చు గాక, కాని ఒక అంశం గురించి, అందులో వుండే బాధ గురించి ఎక్కువ అర్ధం అవటానికి అవకాశం వుంటుంది. మీరు చెప్పిన ద్వని, వక్రోక్తి లాంటి వాటితో నేటి తరం స్త్రీలు పడే ఇబ్బందులమీద కధ రాసి మెప్పించటం ఆసాధ్యమేమి కాదు కాని నాకు ఇష్టం లేదు. స్వేచ్చగా open గా మాట్లాడతాయి నా పాత్రలు.
ఇవే కధలు ఒక పురుషుడు రాస్తే, దానికి వచ్చే response ఖచ్చితంగా భిన్నంగా వుంటుందని నేను చెప్పగలను.
ఒక ఏడాదిక్రితం అనుకుంటాను. ఇక్కడే బ్లాగ్ లో ఒక కధ చదివాను. నాకు ఆ బ్లాగుపేరు కాని, రచయితపేరు కాని గుర్తు లేవు. వుంటే తప్పక చెప్పేదాన్ని. ఆ ఇతివృత్తం అందరికీ తెలుసు, ఎందుకంటే దాన్ని ఒక చిన్న జోకు గా ఒక సినిమాలో వాడటం వల్ల.
ఇండియాలో వున్న ఒక అమ్మాయి గ్రీన్ కార్డ్ కోసం అది వున్న అబ్బాయిని పెళ్ళి చేసుకొని అమెరికా రాగానే విమానాశ్రయంలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ కధ అందరికీ నచ్చింది. దానిగురించి రచయిత చెప్పిన వివరణ ఏమిటంటే అలాంటి సంఘటనలు జరిగినట్టు ఆయనకు తెలుసట. నిజానికి అలాంటివి ఎన్నివేలల్లో ఒకటో, రెండో జరగవచ్చు. కాని కధద్వారా చాలామందికి తెలిసేలా ఆ రచయిత ప్రయత్నించారు. ఆ కధకి అర్ధం అమెరికాకు వచ్చే ఆడవాళ్ళంతా అలా చేస్తున్నరనా? లేక ఆయన ఇలాంటి కధలద్వారా స్త్రీలను కించపరుస్తున్నారనా? దీనికి ఎవరికి వారు ఎలా కావాలంటే అలా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. నాకు గుర్తు వున్నంతవరకు నేను తప్ప ఆ కధ ఇతివృత్తం గురించి వేరెవ్వరు మాట్లాడలేదు అక్కడ.
అలాగే, ఎవరో ఒకావిడను భర్త ప్రతి రోజు పెట్టే శారీరక హింస గురించి మనం ఒక కధ రాస్తే, ఇలా జరగదు, ఇవి feminism కధలు, అంటూ అడ్డదిడ్డంగా వ్యాఖ్యానిస్తుంటే అలాంటివాళ్ళకు ఏమి సమాధానం చెప్తాము? మాకు తెలిసిన ఒకావిడకు ఇలా జరిగింది, అది నేను కధ గా రాశాను అని సాక్ష్యం చూపించాలా?
కాబట్టి కధలంటే జీవితాలే. అయితే కొన్ని సంఘటనలు కధలరూపం గా వచ్చినప్పుడు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. ఒక రచయతగా నాకర్తవ్యం నేను రాయాలనుకున్నది రాసుకుంటూ పోవడమే. ఎక్కడో ఒకచోట నాకధలతో relate చేసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ personal letters రాసే పాఠకులు వుంటూనే వున్నారు. వాళ్ళ కోసమే ఆ కధలు.
ఇవి బ్లాగుల్లో నా కధల అనుభవాలు. మరి మీ కధల్ని పాఠకులు ఎలా ఆదరిస్తున్నారు?
మాలతిః పైన చెప్పేను కదా ఏ కథకయినా పాఠకులు వుంటూనే వున్నారు. అయితే కొన్ని వ్యాఖ్యలు మాత్రం ప్రధానాంశానికి సంబంధం లేకుండా వుంటున్నాయి. ఉదాహరణకి ఒక వ్యాఖ్యాత నా కథ “నీకోసం”లో నేను stay-at-home dadsని తక్కువగా మాట్లాడేనన్నారు. నిజానికి వాళ్లు పిల్లలని చూసుకోడమో, మరేదో పని ఇంట్లో వుండి చేయగలిగినది చేస్తారు అని స్పష్టంగానే రాసేను. ఆవ్యాఖ్యాత కాస్త శ్రమపడి కథ సరిగ్గా చదివి వుంటే ఆవ్యాఖ్యానం చేసి వుండేవాడు కాదు. ఇలాటి వ్యాఖ్యానాలకి ఏం సమాధానం చెప్తాం? అలాగే మరో వ్యాఖ్య కూడాను. నేను స్త్రీలు నిర్వహించే గృహకృత్యాలని తక్కువ చేసి మాటాడేనన్నారు. కథలో ఆవాక్యం సందర్భం చూడు. అది ధరణి ఆలోచన. ఒకసందర్భంలో ఒకసామెత మనసులోకి రావడం వేరు. రచయిత లేక కథకుడు కేటగారికల్గా తనఅభిప్రాయాలు కథలో చొప్పించడం వేరు. ఈధోరణి – పాత్రచేత అనిపించిన మాటని రచయితఅభిప్రాయంగా గుర్తించడం నాకు మొదట అసందర్భంగా కనిపించింది. ఇలాటివి చాలా వ్యాఖ్యలు చూసేక, నాకు తోచింది ఏమిటంటే, నాకథ ఆధారంగా పాఠకులు వాళ్లకి తోచిన ఆలోచనలు వాళ్లు చెప్తున్నారని. నేను చెప్పనివిషయాలు పాఠకులకి స్ఫురిస్తే, వాళ్లు మరోకథ రాస్తున్నారనుకుంటాను. బహుశా, నాకథకి అది మరో ప్రయోజనమేమో.
మరోలా చెప్పాలంటే నాకు వ్యాఖ్యలు మూడురకాలుగా కనిపిస్తున్నాయి.
1. “అలా ఎవరూ మాటాడరు” అలా ఎవరూ చెయ్యరు” అనేవి ఒక రకం. ఇలాటివ్యాఖ్యానాలు చేసేవారు తమకి తెలిసినలోకమే తప్ప అంతకుమించి ఇంకా ప్రపంచం వుందనీ, కొన్ని కోట్లప్రజలు వున్నారనీ, వాళ్లు వేరేవిధంగా ప్రవర్తించవచ్చనీ అంగీకరించలేరు. అలా అంగీకరించడానికి openmindedness కావాలి. దీన్నే “willing suspension of disbelief” అన్నాడు Wordsworth. ఆయన కవిత్వం విషయంలో అన్నా కథకి కూడా కొంతవరకూ అది అవసరమనే నేను అనుకుంటాను. అంటే మన నమ్మకాల్ని, మనకి పరిచయమయిన ప్రపంచాన్నీ కాస్సేపు పక్కన పెట్టేసి, కథలో లీనమయిపోవాలి. కథ చదువుతున్నంతసేపూ ఆకథే మొత్తం ప్రపంచం. అప్పుడే, పాత్రలూ, సంఘటనలూ అర్థం అవుతాయి.
అంతేగానీ, ఎవరో “అలా జరగదు” “మనుషులు అలా వుండరు” అన్నారని నేను వాళ్లకి ఋజువులూ, సాక్ష్యాలూ చూపించి వాళ్లని నమ్మించాలనుకోను. పాఠకులు తమఇళ్లలో ప్రశాంతంగా కడుపులో చల్ల కదలకుండా కూర్చుని తమనమ్మకాలతో రోజులు గడుపుకుంటాం అంటే నేనెవర్ని కాదనడానికి. నేను మాత్రం, నాదృష్టిలోకి వచ్చినవి, నేను రాయాలనుకున్నవి రాసుకుంటాను.
కల్పనః ఇలాటిపాఠకులు కథలలో ఏమిటి ఆశిస్తారంటారు? నేననుకుంటాను, పాఠకులు తమ అభిప్రాయాలకు దగ్గరగా వున్న కధల్ని రచయతలనుండి ఆశిస్తారు. అలా కాకుండా మనం భిన్నంగా చెప్తే వాళ్ళకు నచ్చకపోవచ్చు.
మాలతిః నిజమే. నేనూ అలాగే అనుకుంటున్నాను. బహుశా తమకి తెలిసినవీ, తమ నమ్మకాలని ధృవపరిచేవి అయితేనే చదివి ఆనందించగలరేమో వారు.
2. ఇక రెండోరకం వ్యాఖ్యాతలు మనకథలోనుండి మరోకోణం లాగుతారు. కథలో ఏదో ఒక అంశమో, వాక్యమో తీసుకుని ఆలోచిస్తూ ఆ ఆలోచనవెంట మరోవైపుకి పోతారు tangentially. ఇలా చెయ్యడంవల్ల నేను కథలో అనుకోని కోణాలు ప్రదర్శితమవుతాయి. ఆ అంశాలు కథలో కలపడానికి అవకాశం లేకపోవచ్చు కానీ, కొత్తవిషయాలు తెలియడం జరుగుతుంది. ఇది కూడా బ్లాగుల్లో మాత్రమే జరుగుతోంది కానీ సాంప్రదాయకంగా విమర్శలు చేస్తున్నప్పుడు కనిపించదు.
3. మూడో రకం వ్యాఖ్యానాలు కథని విశ్లేషిస్తూ చేసినవి. కథలో ప్రధానాంశం, శైలీ, శిల్పంమీద చేసిన వ్యాఖ్యానాలు. ఉదాహరణకి నాకథమీద “ఆకథలో సింప్లిసిటీ లేదు. లోతు లేదు” అన్నవ్యాఖ్య తీసుకో.
ఈమధ్య “లోతు లేదు” అన్నమాట తరుచూ వింటున్నాను. కథలో లోతు ఎలా వస్తుంది అని చాలా ఆలోచించేను. సీదాగా “ధరణి దినకర్ని ఉద్యోగం చూసుకోమంది. అతను చూసుకోలేదు.” అంటూ ఏకోన్ముఖంగా కథ చెప్పుకుపోవడం ఒక పద్ధతి. రెండోపద్ధతిలో ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించేడు అని మాత్రమే కాక, అలా ఎందుకు ప్రవర్తించేడు, తన ప్రవర్తనని ఎలా సమర్థించుకుంటాడు, ఆ ప్రవర్తన ఎదటివారికి ఎలా కనిపిస్తుంది, వారికి కలిగిన అభిప్రాయానికి వెనక వారి సమర్థన ఏమిటి – ఇలా విస్తరించుకుపోవడమే కథలో “లోతు” అని నేను అనుకుంటున్నాను. అయితే ఇలా విస్తరించినప్పుడు కొంత అయోమయానికి ఆస్కారం వుంది కానీ సింప్లిసిటీ సాధ్యం కాదు. నామటుకు నాకు ఆరెండూ పరస్పర విరుద్ధం అనిపిస్తోంది.
కల్పనః మీరు మొదటినుంచి కధారచయిత్రి అయినప్పటికి, బ్లాగ్ కోసం నిరంతరం కొత్తగా కూడా కధలు, చిన్న చిన్న స్కెచెస్ లాంటివి, సాహిత్య విమర్శలాంటివి రాస్తున్నారు కాబట్టి మీకు ఈ పాఠకులకామెంట్లు, వారిధోరణి బాగా అర్ధమైనట్టు వుంది. పాఠకులగురించి మీ విశ్లేషణ బావుంది.
అయితే నాకు మాత్రం బ్లాగ్ పాఠకులధోరణి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. ఎందుకంటే, నేను నాబ్లాగుకోసమంటూ, బ్లాగ్ పాఠకుల కోసమంటూ ఏమీ రాయలేదు. నేను వేరే పత్రికలకోసం ఇంతకుముందు రాసినవి, ప్రచురితమైనవి ఇక్కడ నాబ్లాగ్లో పెట్టుకుంటున్నాను.
మాలతిః ఈనాటిసంపాదకులధోరణిలో మార్పు వచ్చింది కదా. నీ అనుభవంలో ఆమార్పువల్ల లాభనష్టాలు ఏమిటంటావు?
కల్పనః సంపాదకుల ధోరణి అంటే పండితారాధ్యుల, పురాణం, నార్ల, పొత్తూరి, ఏబికే, దీక్షితులు, రామచంద్రమూర్తి, ఎంవీఆర్ శాస్త్రి, వేమూరి బలరాం, కనకాంబరరాజు ఇంతమందిగురించి నాకు అంతో, ఇంతో బాగానే తెలుసు. అంటే వ్యక్తిగతంగా తెలియటం కాదు, సంపాదకులుగా వారి వారి పధ్ధతులగురించి. కధల ఎంపిక గురించి నాకన్న మీరే ఎక్కువ వివరాలు చెప్పగలరు.
మాలతిః లేదులే. ఏవో ఒకటి రెండు పేర్లు విన్నవే అయినా వారిగురించి నేను చెప్పగలిగినది అట్టే లేదు. నాఅనుభవం చెప్తాను. నాచిన్నతనంలో సంపాదకులు వ్యక్తిగతంగా పరిచయం వున్నరచయితలకి సూచనలు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆరోజుల్లో గోరాశాస్త్రి, నార్ల వెంకటేశ్వరరావు, పురాణం వంటి పత్రికాసంపాదకులు ఏవో చిన్న చిన్న సూచనలు చేసేరనుకుంటాను. కానీ, నాకు అలాటి పరిచయాలు లేవు కనక నాకథలు అంగీకరించడమో, అంగీకరింపబడకపోవడమో మాత్రమే జరిగేది. అంతే.
నాకు తెలిసి, సంపాదకులు, అదీ నెట్ పత్రికలే విస్తృతంగా సూచనలు ఇవ్వడం ఇప్పుడే మొదలయింది. ఒకొక్కప్పుడు మంచి తప్పులే ఎత్తి చూపుతున్నారు. నా “పెంపకం”కథలో ఒకే పాత్రకి రెండు పేర్లు పెట్టేను పొరపాటున. అలాగే, “నాకోసం” కథలో దినకర్ ఉద్యోగంవిషయంలో టైమ్లైను సరిగ్గా చూసుకోలేదు. ఇలాటివి ఎత్తి చూపితే సంతోషంగా అంగీకరిస్తాను. ఇవి factual errors కనక. కానీ, కథలో సన్నివేశాలూ, శైలీ మార్చమనడం, ఎంత మర్యాదగా చెప్పినా ఉచితం కాదనే నానమ్మకం. రచయితలే అలాటి కోణాలగురించి అడిగితే అది వేరే దారి.
నాకు మరొక సందేహం కూడా వస్తోంది. సంపాదకులు ఒక కథమీద సూచనలు ఇస్తున్నప్పుడు వారు తమ పాఠకులని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నారా, లేక, తమ స్వంత అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారా? అని. ఇలా తాము సంస్కరణలు సూచించి, అలా సరిదిద్దబడినకథని పాఠకులు ఇతోధికంగా ఆదరిస్తున్నట్టు దాఖలాలు ఏమైనా వున్నాయా?
ఈమధ్య “మంచికథలు రావడంలేదు” అన్న అభియోగం తరుచూ వింటున్నాం. మరి సంపాదకులు ఇలా పూనుకుని కథలు సరిదిద్దడంమూలంగా కథల్లో వాసి ఏమైనా పెరిగిందా?
నేను కూడా సంపాదకురాలినే కనక, నేను ఏం చేస్తున్నానో చెప్తాను. తూలికకి వచ్చిన అనువాదాలు చూసినప్పుడు రెండు అంశాలు చూస్తాను.
(1) కథాంశం నా సైటుపాలసీకి అనుగుణంగా వుందా, లేదా?
(2) అందులో భాష మనసంస్కృతి తెలియనివారికి అర్థం అయేలా వుందా, లేదా? అని. లేకపోతే ఒకటో రెండో పేరాల్లో నేను కొంత మార్చి చూపిస్తాను ఎలా వుంటే బాగుంటుందనుకుంటున్నానో. అయినా అది వేరే ప్లాట్ఫారం కనక నా పాలసీ ఇక్కడ పనికిరాదేమో.
సరే, కల్పనా, ఇలా మాటాడుతూంటే, మనకి అర్థమవుతున్నది మంచి కథ అన్న పదానికి నిర్దుష్టమయిన ఒక నిర్వచనం లేదనే. పాఠకులు ఎంతమంది వున్నారో అన్ని నిర్వచనాలు. ఇక్కడ పాఠకులంటే చదివేవారందరూ, రచయితలూ, సంపాదకులతో సహా. ఇప్పటికే చాలా పెద్ద చాటు అయిపోయింది. ఈనాటికి సరిపెడదాం. ఇంక ఇది చదివిన పాఠకులు ఏమంటారో చూద్దాం..
Kalpana – Thanks for posting this discussion. నేను ఇంగ్లిష్ లొ కామెంట్ రాస్తున్నందుకు క్షమించాలి. It’s been a really really long time and lost practice…:- (
I was smiling reading your remark about blog readers. I’ve come to a conclusion that, on blogs, there really is no such thing as a reader. Something happens to a reader when he/she gets on the internet and reads. The instinct to a rushed response takes over and mauls all his/her sense of proportion. Perhaps this has to do with the “lean-forward” mode of interaction with the computer. Or perhaps the reason is as simple as the fact that you cannot really hold the laptops and desktop computers in our hands like we hold the books while we read them. In any case, unfortunate fact is if one is posting stories on the internet, then everybody is a critic. That can be depressing because not everyone who has an opinion can be a critic, but you try saying that to your readers…:- ) I think a case can be made for a writer that she/he should not post their best work on the internet: not only it is wasted on the story-unfriendly nature of the internet medium but a publisher may not accept it for print copy if it is already on the net.
That said, as a reader I know there are not enough stories. We need more stories that capture the range of human emotions. Especially the stories that show a woman’s world to a man, and a man’s world to a woman. This is especially true in the Indian context. For various reasons that we all more or less know and can relate to – chauvinism, tradition and patriarchy etc. – an Indian woman and an Indian man are particularly strange creatures to one another. I for one always look for that little something from a story that makes me go, “Aha…” and if a story has that, then what more can one expect…?
Regards,
Crazyfinger