Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for ఆగస్ట్, 2008

 

కొత్త సరిహద్దుల్లో స్త్రీవాద కధ అన్న వ్యాసం పై కత్తి మహేష్ కుమార్ గారు ఒక రెండు వ్యాఖ్యలు నా బ్లాగ్లో రాసారు. మళ్ళి ఆ వ్యాఖ్యలను తన బ్లాగ్లో కూడా పెట్టుకున్నారు. ఇక్కడా, అక్కడా మహేష్ గారి వ్యాఖ్యలకు సమాధానాలు మరో టపాగా మారాయి. అదే ఇది.

 

స్త్రీవాదం అంటే ఏమిటొ నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే బ్లాగ్లోకంలో అలనాటి రంగనాయకమ్మ దగ్గరనుంచి నేటి కుప్పిలి పద్మ దాక ఫెమినిస్ట్ రచనలని అవపోసన పట్టిన అతిరధమహారధుల ముందు నేను ‘ కొత్త ‘ పిల్ల కాకిని.

 

మహేష్ కుమార్ గారు, మీరన్నది నిజమే. ”స్త్రీవాద భావజాలం యొక్క సైద్ధాంతిక స్వరూపం అస్తవ్యస్తంగా వుందీ’ అన్న మీ వ్యాఖ్య నాకు అర్ధమై కూడా వివరణ ఎందుకు అడిగానంటే స్త్రీవాదం అంటే మీకున్న అవగాహన తెలుసుకోవడం కోసమే. మీరిచ్చిన సమాధానమే మీ వ్యాఖ్యకు కూడా సమాధానం అనుకుంటున్నాను.

 

” స్త్రీవాద సాహిత్యం మీద నేను చేసిన సాధన చాలా పరిమితం.70,80వ దశకాలలో ఉన్న సాహిత్యంతో నాకెటువంటి పేచీ లేదు. వాటిల్లోకూడా కొన్ని reinforcing the dominant paradigm తరహాలోవున్నా,నాకెటువంటి అభ్యంతరం కలుగలేదు.నా పరిథి సిమితమైనదే అయినా, 90ల తర్వాత నేను చదివిన కథలు చాలావరకూ స్త్రీవాదం ముద్రను ఉపయోగించుకుని రాసిన “కన్నీటి కథలు” గానే అనిపించాయి.మీకిప్పుడు ఉదాహరణలు చూపాలంటే ఎప్పుడో చదివిన పత్రికలూ,పుస్తకాలూ వెతుక్కోవాలి. చాలా వరకూ సాధ్యమయ్యే విషయంకూడా కాదు.ఇక నా అభాండాలు “అందరు స్త్రీవాద రచయిత/త్రుల” మీద కాదు. కేవలం ముద్రను ఉపయోగించి తమ సాహిత్యానికి సలేబిలిత్య్ని తెచ్చుకుంటున్న “చాలా మంది” గురించి మాత్రమే. నేను చదివినంతవరకూ దాదాపు 80% కథలు ఈ కోవకిచెందడం నా దురదృష్టం. పైగా నాకు నచ్చిన కొందరు స్త్రీవాద రచయిత/త్రులు అస్సలు స్త్రీవాదానికీ మాకూ సంబంధం లేదంటున్నారు.దీన్నిబట్టి నా అభాండాల్లో కొన్ని కొంతైనా నిజలున్నాయేమోననే భ్రమకలిగింది.ఏదిఏమైనా సిద్ధాంతాలలో గందరగోళం,అవగాహనారాహిత్యం మధ్యన మీరు చదివిన కొన్ని మంచి రచనలు ఎక్కడున్నాయో (90లవి)చెబితే నేనూ చదివి నా అభిప్రాయాల్ని మార్చుకుంటాను.మన చర్చ నిజంగా తెలుగులో విమర్శకుల అవసరాన్ని ఎత్తిచూపుతోంది.ప్రస్తుతం చాలామంది మార్కెట్లో ఈ వాదం నడుస్తుంది కాబట్టి రాయటం మొదలయ్యిందిగనకనే credibility ఒక సమస్యగా మారింది. ఇక పాఠకులంటారా, వారిని తప్పుబడితే నేను అంగీకరించను.  Readers have every right to interpret the text as they wish . కాకపోతే విమర్శకులుకూడా సాధారణ పాఠకుల్లాగా భావజాలం రంగుటద్దాలతో  a work of art  ని కొలవడం నేను అంగీకరించలేని విషయం.” 

 

మీరు చదివినది స్వల్పమని మీరే చెప్పుకుంటున్నారు. 70,80 దశకాల్లో వచ్చిన సాహిత్యంతో పేచి లేదని మీరే వొప్పుకున్నారు. ’90ల తర్వాత కధలు కొన్ని ‘కన్నీటి కధలు ‘ గా మీకు అనిపించాయి. అది కేవలం మీరు చదివిన కధల వల్ల, అవి మీకు అర్ధమైన తీరు వల్ల మీకు స్త్రీవాదం పట్ల కొన్ని అభిప్రాయాలు కలిగాయి. మీ objections లేదా మీ అభాండాలు స్త్రీవాదులందరి మీదా కాదు అన్నరు. ముద్రనుపయోగించి తమ సాహిత్యానికి saleability తెచ్చుకుంటున్న ఆ ” చాలామంది ” ఎవరో, ఆ రచనలు ఎమిటో మీరు స్పస్టం చేస్తే మనం వాటి గురించి సహేతుకమైన సద్విమర్శ చేసుకోవచ్చు. మీరు చదివిన 80% కధలు ఆ కోవలోవే కావటం మీ/మా దురదౄస్టం. అలాగే మీకు నచ్చిన ఆ స్త్రీవాద రచయత/త్రులు  ( స్త్రీవాదం రాస్తూ దానితొ మాకు సంబంధం లేదన్న వారు) ఎవరో మాకు చెపితే మేము కూడా అలాంటి ద్వందవైఖరులున్న రచయతలేవరో తెలుసుకొని జాగ్రత్త పడతాము.మార్కెట్ లో ఈ వాదం నడుస్తోంది కబట్టి ఆ రకంగా ఒక ఫెమినిస్ట్ రైటర్ రాసిన ఒక కధ చూపించి మీ అభ్యంతరం చెప్పండి.అయినా అలాంటి చౌకబారు రచనల్ని పత్తించుకోవడం ఎందుకు మీలాంటి మేధావులు? వారికోసం మీలోని అసలు సిసలు స్త్రీవాద సానుభూతిని చంపుకోనక్కరలేదు కదా. లేదు అసలు మీకు మొత్తం స్త్రీవాదం పట్ల అభ్యంతరాలు వుంటే అదే వొప్పుకోండి. నేను పక్కా స్త్రీవాదినంటారు మళ్ళి గందరగోళం అంటారు.

 

 

తెలుగులో విమర్శకుల అవసరం ఎంతైనా వుంది అన్నది మాత్రం నేను కూడా నూటికి నూరు శాతం అంగీకరిస్తాను. ఇదె విషయం తాజా వ్యాసంలోను, ఇతర వ్యాసాల్లో కూడ నేను ప్రస్తావించాను. స్త్రీవాద సాహిత్యంలో మీరనుకుంటున్న గందరగోళం, అవగాహనారాహిత్యం లాంటివి చాలామందికి కలగటానికి ప్రధానమైన కారణం స్త్రీవాద సాహిత్యానికి తగినట్టుగా సాహిత్యవిమర్శ లేకపోవడమే. మీరు కాస్త నిదానంగా ఈ వ్యాసం చదివితే నెను ఆ వ్యాసం మొత్తం చెప్పిన ప్రధానమైన విషయం అదే అని అర్ధమవుతుంది.స్త్రీవాద సాహిత్యానికి వున్న పరిమితుల్ని నేను నా తాజా వ్యాసంలో ప్రస్తావించాను. స్త్రీవాద రచయత/త్రులు అత్మపరీశీలన చేసుకోవాల్శిన అవసరముందన్న సంగతి కూడా నేను నొక్కి వక్కాణించాను. స్త్రీల సాహిత్య కృషిని సాహిత్య చరిత్రలో సరిగ్గా గుర్తించలేదన్నది ఉదహరణలతో చెప్పడం ఈ వ్యాసం ప్రధాన వుద్దేశం. అలాగే విమర్సకులు, పాటకులు ఎలాంటి రంగుకళ్ళద్దలు ధరించి రచనల్ని చూసి తప్పు అభిప్రాయాలు యెర్పర్చుకుంటారొ చెప్పడం ఇంకో వుద్దేశం. నిర్మలరాణి గారు ఎక్కడా తాను స్త్రీవాదినని కాని, కాదు అని కాని చెప్పుకోలేదు.అత్యాచారం అన్న అంశాన్ని ఆవిడ తన కధలో చర్చించారు. దాని విమర్శకుడు స్త్రీవాద కధ అన్న లేబుల్తో చూసి చర్చించారు. దీనివల్ల జరిగిన నస్టం ఏమిటి అని ఆలోచిస్తే…మహేష్ గారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం తెలిసిపోతుంది. కోడూరి శ్రీరామూర్తి గారి సమీక్ష, ఆ సమీక్ష ని ప్రచురించిన పుస్తకం చదివిన పాఠకుడు కూడా ఆ కధని అదే ద్రుక్కొణంతో చూసే ప్రమాదం వుంటుంది. కధని కధగా చూసె ప్రక్రియ ఇక్కడ జరగలేదన్నది స్పస్తం.

 

ఇక ఒకోసారి  పాఠకులు  తమకు తెలిసి గాని, తెలియకుండానో గాని  రంగుకళ్ళాద్దలు పెట్టుకొని  ఎలా చూస్తారో చూద్దాము.ఉదహరణకు శారద గారి ‘ ఆదది కోరుకునే వరం’ కధ తీసుకుందాము.  శారద గారు ఎక్కడైనా తాను స్త్రీవాదినని గాని, కాను అని కాని చెప్పుకున్నర?ఆ కధని మీరు అంధ్రజ్యొతిలోనో, వార్తలోనొ చదివిన దానికి, భూమిక పత్రికలో చదివిన దానికి ఏమైనా తేడా వుంటుందా? మహేష్ గారు ఆ కధ భూమిక అనే ‘మహత్తర స్త్రీ వాద పత్రిక ‘ లో చదవటం వల్ల అది స్త్రీవాద కధ అనుకొని ఒక fixed frame లో నుంచి చూసారు. అంటే ఇక్కడ మహేష్ గారు తనకు తెలిశొ, తెలియకుండానో ఒక రంగుకళ్ళద్దలు పెట్టుకున్నరన్న మాట. వాటిల్లో నుంచి ఆ కధని విష్లెషించే ప్రయత్నం చేసారు. ‘ మానం కన్న ప్రాణం ముఖ్యమ, కాద ‘ అన్న point కన్న ఆ కధలో రైటర్ చాల ముఖ్యమైన  విషయాలు చర్చించారు. ఈ చర్చ ముందు అవి చర్చకురాకుందా మరుగునపడిపోయాయి. దీనివల్ల రైటర్ కి కాని, ఆ రచన కి కాని ఎమైనా అన్యాయం కాని జరిగిందా అంటే కధని కధగా అర్దం చేసుకోలెకపోవదానికి దారితీసిన కారణాలు ఎమిటి అంటే ఒక lable. స్త్రీవాదం అనేది ఒక బ్రహ్మపదార్ధం కాదు.అర్దం కాకపోవడానికి. స్త్రీల పట్ల, స్త్రీ సమస్యల పట్ల concern తో మాట్లాడటమే స్త్రీవాదం నా దృస్టిలో. అసలు ఆ పదం అంటేనె అసహ్యం , ఏవగింపు అనే వాళ్ళకు ఎవరైనా ఏమి చెప్పగలరు చెప్పండి? ఇవాళ మేము feminisTulam కాము, మాకు  feminism అంటే గిట్టదు అని చెప్పుకోవడం ఒక  fashion statement అయిపోయింది. .  స్త్రీల పట్ల , వారి జీవితాల పత్ల, వారి సమస్యల పట్ల సానుభూతి, సహానుభూతి వున్నవారికి అదొక అనివార్యత. 

 

స్త్రీవాదం పట్టణలకే పరిమితం కాలేదండి. కళ్ళుపెట్టి చూస్తే పూరిగుడిసెల్లో నాకు అసలు సిసలు స్త్రీవాదం కనపడుతుందండి ఒక్కోసారి.   పేదమహిళలు మొగుడు తాగి వచ్చి చావబాదితే నలుగురిలో పెట్టి  నిలదీస్తారు. ఆ  ధైర్యం ఈ పట్టణ మధ్యతరగతి ఆడవాళ్ళకు రాలేదండి. ముక్కలు, ముక్కలుగ నరకబడుతున్న ఆడవాళ్ళు, అయిదేళ్ళ పసిమొగ్గల నుండి అరవైఏళ్ళ వ్రుద్ద మహిళల  వరకూ  ఇంటా, బయటా అత్యాచారానికి గురవుతున్న ఆడవాళ్ళు, ప్రవాసంలో కూడా తప్పని కట్నపు బాధలు ఇవన్ని పేపర్లల్లో crime news గా చదివి పక్కనపెట్టేసి నా కడుపులో చల్ల కదలకుండా సరదగా ఎవో నాలుగు రాతలు రాసుకునే గుండె ధైర్యం నాకు లేదండి. వీటన్నింటికి స్త్రీవాదం పరిష్కారం కాదు అని తెలిసినా కూద ఏదో ఒక ఆశ. ఇవాళ కొందరు మగవాళ్ళు అయినా ఇంటి పనుల్లో, వంటపనుల్లో స్త్రీలకు సహయపడుతున్నారు, స్త్రీలను జీవనయాత్రలొ సమవుజ్జీలుగా చూడగలుగుతున్నారంటే అందుకు ఏంతో కొంత స్త్రీవాద ప్రభవం వుందని నేను నమ్ముతాను. అందుకే అందులోని లోపాల్ని నేను ఎత్తిచూపిస్తాను.  పెడధోరణులు అనుకున్న దాన్ని ఖండిస్తాను అవసరమైతె. నాకు సంబందించినంతవరకు అది కేవలం పిడివాదం కాదు.

ప్రకటనలు

Read Full Post »

 

అసలు బిడ్డలకు వలెనే కథలకు కూడా మాతృత్వం మాది అంటుంది కనుపర్తి వరలక్షమ్మగారి కథలోని రాజేశ్వరి (కథ ఎట్లా వుండాలె?) దాదాపు ’75,’80 ఏళ్ళ క్రితమే స్త్రీవాదం అన్న పేరు కూడా వినిపించని కాలంలోకథ చెప్పటం మా జన్మహక్కు అని ఆమె సగర్వంగా ప్రకటించింది.

 

అనగనగా అంటూ అమ్మమ్మ చెప్పిన కథతో స్తీలకథ మొదలైందని చెప్పవచ్చు. రాక్షసుడ్ని చంపేసిన రాజకుమారుడి చుట్టూ అల్లుకున్న రాకుమారి అందమైన ఊహల కథ.  రాకుమారుడో వచ్చి  యౌవన రెక్కల మీద ఎగరేసుకుపోతాడన్న ఊహల నుంచి రాకుమారుడ్ని పెళ్ళి  చేసుకోకుండానే వారసుల్ని కనగలిగే స్థాయికి ఎదిగింది నేటి కథల్లోని కథానాయిక. సైద్ధాంతికపరంగా మార్పుని స్త్రీవాద కథాపరిణామక్రమంగా చెప్పుకోవచ్చు.

 

సామాజిక చరిత్రకు సాహిత్యం దర్పణం లాంటిది. మానవ జీవనానికి కథ ప్రతిబింబంలాంటిది.  సమాజ పరిణామాలను  విమర్శనాత్మకంగా చూసినప్పుడు దాని తాలూకు ప్రతిబింబం మనకు సాహిత్య రూపాల్లో కనిపిస్తుంది. సాహిత్యానికి, సమాజానికి మధ్య వున్న ప్రతిఫలనం అవగాహన చేసుకున్నప్పుడు స్త్రీవాద సాహిత్యం కూడా సరిగ్గా అర్ధమవుతుంది.

 

తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యం తీవ్ర సంచలనాన్ని రేకేత్తించి అనేక వాద వివాదాలకు కారణమైన సంగతి అందరికీ తెలిసిందే. 1980 ల్లో స్త్రీవాద రచయిత్రులు  తమదైన స్వరంతో, భావ వ్యక్తీకరణలతో, కొత్త ఇతివృత్తాలతో, సరికొత్త భాషతో, పదచిత్రాలతో తిరుగుబాటు ప్రకటించారు. పితృస్వామ్యం, స్త్రీ, పురుష లైంగిక వివక్ష, స్త్రీల  అణచివేత, ఇంటి చాకిరీ మొదలైన విషయాల్ని స్తీవాదం చర్చల్లోకి తీసుకువచ్చింది. స్త్రీగా పుట్టడం వేరు,  స్త్రీగా తయారుచేయబడటం వేరు అన్న సంగతిని స్త్రీలు గుర్తించగలిగారు. తరతరాల సమాజం కోటానుకోట్ల మంది స్త్రీలను  తయారు చేసి వారిని విధంగా అదుపుచేయటాన్ని స్త్రీవాదులు నిలదీశారు. స్త్రీ, పురుష వివక్ష గురించి స్త్రీవాద రచయిత్రులు చైతన్య్వంతులై ప్రశ్నించారు. విధమైన ఆత్మచైతన్యాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతిబింబింపచేసే కథ, కవిత, నవలాసాహిత్యాన్ని  స్త్రీవాదులు సృజించారు.

 

మొదటి దశలో  రచయిత్రులకు , అతి కొద్దిమంది రచయితలకు పరిమితమైన స్తీవాదం క్రమంగా మొత్తం సమాజవాదంగా మారింది. ఇవాళ స్త్రీవాదం కేవలం స్త్రీలవాదమే కాదు, సమాజంలోని అన్నివర్గాల వారిది. స్త్రీ చైతన్యాన్ని, వ్యక్తిత్వాన్ని గౌరవించే స్త్రీ, పురుష పాత్రల్ని జండర్ భేదం లేకుండా అందరూ తమ రచనల్లో చిత్రిస్తున్నారు. దీన్ని స్త్రీవాదం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. అయితే మార్పు సమాజంలో ఆశించిన రీతిలో లేకపోయినప్పటికీ సాహిత్యంలో మాత్రం కనిపిస్తుంది. అయితే వ్యాసంలో ప్రధానంగా స్త్రీవాద రచయిత్రుల కథల్ని మాత్రమే చర్చకు తీసుకోవడం జరిగింది.

 

స్త్రీల జీవితాల గురించి, సమాజంలో స్తీల భాగస్వామ్యాన్ని గురించి రచయిత్రులు మొదటి నుంచీ కథలు రాస్తూనే ఉన్నారు. తమలోని స్త్రీత్వాన్ని నిర్వచించుకుంటూ రచయిత్రులు రాసిన కథలూ వున్నాయి. అయితే స్త్రీవాద కథ అన్నది మాత్రం ‘ 80 తర్వాత మాత్రమే కనిపించే భావన. ఇది  ప్రధానంగా సైద్ధాంతికపరమైన వృత్యాసాన్ని తీసుకువచ్చింది.  1902లో  వెలువడ్డ భండారు అచ్చమాంబ స్త్రీవిద్య కథనుండి మొదలుపెడితేమొదట స్త్రీ విద్యతోనే రచయిత్రుల కథ మొదలైంది. భర్త కోసం చదువుకుంది అచ్చమాంబ కథానాయిక. కథ ఇతివృత్తం అప్పటి సమాజ పరిస్థితులకు తగినట్టు వుంది. చదువుకోవడంతో మొదలైన స్త్రీ చైతన్యం నెమ్మదిగా  ఆర్ధిక స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, స్వాభిమానం, కుటుంబంలో, సమాజంలో సమానస్థానం, సమానహక్కుల గురించి మాట్లాడడం వరకూ వచ్చింది. సామాజికంగా స్త్రీలలో క్రమక్రమంగా  వచ్చిన చైతన్యానికి రచయిత్రుల సాహిత్యం దర్పణం పట్టింది.

  

మొదటి దశలో రచయిత్రుల కథల్లో కుటుంబంలో, సమాజంలో స్తీ,పురుష మధ్య అంతరాల్ని, వివక్షను అతి సహజ విషయంగా భావించగా స్త్రీవాదకథ వివక్షను పురుషాధిపత్యరాజకీయంగా  గుర్తించి ఎదిరించగలిగింది. అంటే ప్రధానంగా  స్త్రీలు రాసిన కథలకు, స్త్రీత్వపు గుర్తింపుతో రాసిన కథలకు, స్త్రీవాద కథలకు వున్న అంతరం సైద్ధాంతికపరమైంది. సైద్ధాంతికత సమాజంలో అణచివేతకు  గురైన అన్నివర్గాల స్త్రీలకు ప్రాతినిధ్యం వహించింది.

 

 

స్త్రీల సమస్యలు, స్త్రీ, పురుష సంబంధాలు, వివాహ వ్యవస్థలోని లొసుగులు వీటన్నింటి గురించి విస్తృతంగా చర్చించిన స్త్రీవాదులు ఇప్పుడు సమాజంతో పాటు కొత్త రూపు తీసుకుంటున్న సమస్యల  గురించి మాట్లాడుతున్నారు. గ్లోబలైజేషన్ ప్రభావంతో స్త్రీల జీవితాల్లో వస్తున్న మార్పుల్ని సునిశిత పరిశీలనతో చర్చకు పెడుతున్నారు. మారుతున్న పల్లెలు, పట్టణ స్వరూపాలు, కరవురక్కసి కాటుకు గురై చిద్రమవుతున్న మానవ సమబంధాలు, అంతరిస్తున్న కులవృత్తులు, జూదంగామారిన వ్యవసాయం, రాజకీయరంగాల్లో స్త్రీలపై కొనసాగే అణచివేత, స్త్రీలు ఎంచుకుంటున్న అకొత్త కెరియర్స్‌లోని మానసిక, శారీరక ఒత్తిడులు, మత విద్వేషాలు,, ప్రవాసం జీవితంలోని సంఘర్షణ ఇలా సమాజం విశ్వరూపాన్ని తమ కథల ద్వారా చర్చకు పెడుతున్నారు స్త్రీవాదులు.

 

ఓల్గా, కుప్పిలిపద్మ, గీతాంజలి, నల్లూరి రుక్మిణి, పి.సత్యవతి, వి.ప్రతిమ, కొండవీటి సత్యవతి, ముదిగంటి సుజాతారెడ్డి, సుభద్ర, ఎస్.జయ, సుబహాషిణీ, చంద్రలత, కె.వరలక్ష్మి, షాజహానా, , పుట్ల హేమలత, సి.సుజాత, నిర్మలారాణి, ఇంద్రగంటి జానకీబాల లాంటివాళ్ళు ఇటీవల రాస్తున్న కథల్ని చదివినప్పుడు, వారి కథల్లోని ఇతివృత్త వైవిధ్యాన్ని, శిల్ప పరిణితినీ్, పరిశీలిస్తే మనకు విషయం స్పష్టమవుతుంది.  

 

మొదట్లో శరీర రాజకీయాల గురించి మాట్లాడిన స్త్రీవాదులు ఇవాళ రాజకీయ, రాజ్యవ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. రాచపుండు, గంగజాతర (ప్రతిమ), ముందడుగు (కొండవీటి సత్యవతి) లాంటి కథలు రాజకీయరంగంలో స్త్రీలు పావులవుతున్న వైనాన్ని ప్రశ్నిస్తుండగా, కుబుసం (కుప్పిలి పద్మ), మంత్రనగరి (సత్యవతి), సాలెగూడు (ప్రతిమ), కొత్తకోర్సులొస్తున్నాయి జాగ్రత్త (సుభాషిణి) లాంటి కథలు గ్లొబలైజేషన్ వికృతస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కొత్త కొత్త కెరియర్స్ లో స్త్రీలపై మానసిక, శారీరక ఒత్తిడి ఎక్కువవటమే కాకుండా వారి వ్యక్తిత్వాలు ప్రశ్నార్ధకమవుతున్న తీరును సునిశితంగా ఎత్తి చూపిస్తాయి.

 

అవర్జా (చంద్రలత), సాలభంజిక (కుప్పిలిపద్మ) కథలు, వైవాహికేతర సంబంధాల్లో స్త్రీలు పడే మానసిక సంఘర్షణను, పల్లె జీవితంలోని వైరుధ్యాలను నల్లూరి రుక్మిణి కథలు చిత్రిస్తే, కరవు, ఫ్యాక్షనిజం భూతాల నోట్లో చిక్కుకున్న స్త్రీల  బతుకుల్లోని వేదనను చిత్రిస్తాయి. నిర్మలారాణి, రంగనాయకిల కథలు. స్త్రీలు మతపరమైన అణచివేతల్లొ కూరుకుపోతున్న విధానాన్ని షాజహానా, గీతాంజలి కథలు ఆగ్రహంతో ప్రశ్నిస్తుండగా, ఓల్గా రాసిన సమాగమం లాంటి కథలు పురాణ స్త్రీల మనోభావాలకు సరికొత్త వ్యాఖ్యానం  చేస్తాయి. ప్రవాస జీవితంలో స్త్రీలు పడే సంఘర్షణను చిత్రించే కథల్ని స్త్రీవాద కథల్లో భాగంగా చూడవచ్చు.

 

 

ప్రవాసాంధ్ర రచయిత్రుల్లో చాలామంది తమని తాము స్త్రీవాదులుగా ప్రకటించుకోకపోయినా వారి కథల్లోని స్త్రీ పాత్రల సంఘర్షణ, ప్రవాస జీవితంలోని వైరుధ్యాలను వారు చిత్రిస్తున్న తీరు స్త్రీవాదానికి మంచి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. నిడదవోలు మాలతి (చివురుకొమ్మ, చేవ, నిజానికీ ఫెమినిజానికీ మధ్య, డాలక్ర్‌కో గుప్పెడు రూకలు) శేషుశర్మ (అన్వేషన్ణ, అగాధం),  చినుటాకమల (అమెరికా ఇల్లాలు), ఉపాధ్యాయుల  సూర్యకుమారి (అమ్మపెళ్ళి), చెరుకూరి రమాదేవి (యాధృచికం మొదలైన వాళ్ళ కథలు ప్రత్యేకంగా స్త్రీవాద ముద్రతో లేకపోయినప్పటికీ 21 శతాబ్దంలో స్త్రీల జీవన విధానాన్ని అవి ప్రతిబింబిస్తున్న  కారణంగా వాటిని స్త్రీవాద కథలుగా గుర్తించడం సముచితమే. విధంగా స్త్రీవాద రచయిత్రుల కలం ఉండి వస్తున్న అనేకానేక కథలు సమాజంలొ స్థూలంగానె కాకుండా సూక్ష్మంగా జరుగుతున్న మార్పుల్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. సామాజిక బాధ్యతతో వీరు రాస్తున్న కొత్త కథలు పాథకులకు దిశా నిర్దేశం చెస్తున్నాయి.

 

అయితే స్త్రీవాదం చల్లబడిపోయిందని, స్త్రీవాద కథలు ఇతివృత్త  లోపంతో మూస ధోరణిలోకి వెళ్తున్నాయని, స్త్రీవాద కథల చిత్రణ  అంతా నగర, పట్టణ వాసాలకు సంబంధించినది మాత్రమే వుంటోందన్న విమర్శలను మాటలతోనో, వ్యాసాలతోనో కాకుండా పదునైన తమ సాహిత్యం ద్వారా స్త్రీవాదులు తిప్పికొడుతుననరనటానికి పైన పేఋకొన్న కథలే మంచి ఉదాహరణ. అయితే ఇక్కడ మనం అంగీకరించాల్సిన  సత్యం మరొకటి ఉంది. వాదానికైనా కొన్ని పరిమితులుంటాయి..అలాంటి  పరిమితులు అస్తిత్వవాదాలన్నింటికి వున్నట్టుగానే స్త్రీవాదానికి కూడా ఉండి.  స్త్రీవాద కథలు మూసధోరణిలోకి వెళ్ళడం లేదన్నది వాస్తవమైనప్పటికీ ఒక వాదంగా స్త్రీవాద సాహిత్యం కొన్ని పరిమితులకు లోబడి మాట్లాదుతోందన్నాదిమాత్రం నిరాకరించలేని సత్యం. “స్త్రీల శరీర ధర్మాలను హీనపరిచే పితృస్వామ్య సంస్కృతిని ఎదిరించె క్రమంలో కొన్నిసార్లు స్త్రీవాద సాహిత్యం స్త్రీల చుట్టూ కొని కొత్త మిత్ లను కల్పించింది.  స్త్రీల  ప్రత్యేకతలను ఆధిక్యాలుగా ప్రకటించింది. స్త్రీల శరీర ధర్మాలను, పునరుత్పత్తి శక్తిని సంపూర్ణ స్త్రీత్వంగా నిర్వచించిన సాహిత్యం  వచ్చింది. ఆమేరకు అవి , శారీరక లోపాలున్న స్త్రీలను  గొడ్రాళ్ళుగా, మాచకమ్మలుగా వెక్కిరించిన పురుషాధిపత్యానికి జవాబు చెప్పే శక్తిని కోల్పోయాయి  అన్న కాత్యాయిని మాటల్లోని వాస్తవాన్ని గుర్తించి స్త్రీవాద రచయిత్రులు ఆత్మపరిశీలన చేసుకోవడం కూడా సంధర్భంలో అవసరమే.

 

 మూస చరిత్ర పాక్షిక విమర్శ

 

స్త్రీల సాహిత్యాన్ని , వారి సాహిత్య కృషిని మొదటి నుండి పురుష నిర్మిత విమర్శానా పనిముట్లతోనే పరామర్శిస్తూ  స్త్రీలు ఇతర స్త్రీల కోసం రాసుకుంటున్న వాటిగానే  చూస్తున్నారు తప్ప వారి సాహిత్యానికి ప్రధాన  స్రవంతి  చరిత్రలో సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదన్నది నిష్టూరసత్యం. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో మొల్ల, మరో తిమ్మక్క అంటూ వేళ్ళ మీద లెక్కించడమే తప్ప స్త్రీల సాహిత్య కృషిని సరిగ్గా అంచనా వేసే ప్రయత్నమేదీ జరగలేదు. ప్రధాన స్రవంతి సాహిత్య చరిత్రలో స్త్రీల సాహిత్యాన్ని పాయగా మాత్రమే ఇన్నేళ్ళు చూపించారు సాహిత్య చరిత్ర రచనావిధానంలొనూ, సాహిత్య విమర్శలోనూ ఇన్నాళ్ళు పురుషస్వామ్యమే రాజ్యమేలింది. మూసపోసిన పురుష స్వామ్య చరిత్ర రచానవిధానాన్ని ప్రశ్నించి దాని తిరగరాసే ప్రయత్నాన్ని స్త్రీవాదులు మొదలెట్టారు. క్రమంలో  వచ్చిన మనకు తెలియని మన చరిత్ర ‘, ‘ మహిళావరణం ‘,’ నల్ల పొద్దు లాంటి పుస్తకాలు సాహిత్య, సామాజిక రంగాల్లో స్త్రీశక్తిని సరిగ్గా  అంచనా కంటే ప్రయత్నాలు. సాహిత్య విమర్శ విషయానికి వస్తే మొదటినుంచి కూడా స్త్రీల సాహిత్యానికి తగినట్టు విమర్శ రాలేదు. 

 

ముఖ్యంగా స్త్రీవాద  సాహిత్య విమర్శ ఆశించిన స్థాయిలో రాకపోవటానికి ప్రధాన కారణం అందుకు అనువైన భాషను, విమర్శనాసూత్రాల్ని సంపూర్ణంగా నిర్మించుకోకపోవడం,  ఓల్గా, జయప్రభ, కాత్యాయని, కాత్యాయని విద్మహే, మృణాళిని, అబ్బూరి చాయాదేవి, ఎస్.జయ లాంటివాళ్ళు కొంతమేరకు దీనిపై కృషి చేద్సిన ఇంకా చేయాల్సింది చాలానే ఉందని చెప్పుకోవాలి. ‘ స్త్రీ విద్య మొదలుకొని స్త్రీల సమగ్ర సహిత్య చరిత్ర, విమర్శ వచ్చినప్పుడే సమాజాన్ని వారి సాహిత్యం ప్రభావితం చేసిన తీరు స్పష్టమవుతుంది.

 

స్త్రీల సాహిత్యంపై మొదటి నుండీ మనకు పాక్షిక విమర్శలు మాత్రమే  వున్నాయన్నది ఇప్పటి స్త్రీవాదుల ఆరోపణ మాత్రమే  కాదు. కనుపర్తి వరలక్ష్మమ్మ కాలం నాటికే ఇది వుంది. రచయితల సాహిత్యంపై విమర్శ ఎలా సాగుతుందో ఆమె తన కథ కథ ఎట్లా వుండాలే?” లో చెప్పే సాహసం చేశారు. రచయితల కథల్ని వాళ్ళలో వాళ్ళే ప్రశన్సించుకొని దాన్నే సద్విమర్శగా చెలామణి చేసుకునే విధానాన్ని  వ్యంగంగా ఆమె ఎత్తి పొడుస్తారు. ఇప్పటికీ కథ నిత్యనూతనమే.

 

గురజాడ దిద్దుబాటుతొలి తెలుగు కథగా మొదలైన కథాచరిత్రలో తొలితరం రచయిత్రులకున్న ప్రాధాన్యత అతి స్వల్పం. కథాసాహిత్య చరిత్రలో రచయితలకు ఇచ్చిన స్థానం రచయిత్రులకు ఇవ్వలేదు. స్త్రీవాద  సాహిత్యం ’80 ల్లో మొదలైనా, భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ మొదలుకొని అనేక మంది రచయిత్రులు స్త్రీ చైతన్యం, స్త్రీ వ్యక్తిత్వం లాంటి అంశాల్ని 1900 నాటికే అప్పటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టు తమ రచనల్లో ప్రస్తావించారు. చర్చించారు. అచ్చామాంబ, వరలక్ష్మమ్మ, ఇలిందల సరస్వతిదేవి, పి.శ్రీదేవి, శివరాజు సుబ్బలక్ష్మి మొదలైన రచయిత్రుల  కథల గురించి ఎవరూ ఎక్కడా చర్చించిన దాఖలాలు మనకు కథాసాహిత్య చరిత్రలో కనిపించవు. కథకు సంబంధించిన చర్చలన్నింటిలోనూ ’50 నాటి  రచయిత్రుల  ప్రస్తావనలు నామమాత్రంగానే కనిపించడం విషాదకరం. తెలుగు కథ మీద ఇప్పటివరకూ వచ్చిన పుస్తకాలు , వ్యాసాలు అనేకం పరిశీలించినపుడు ముగ్గురు,నలుగురు రచయిత్రుల పేర్లతో.. ఫలానావారు రాసేవారు అంటూ ఏకవాక్యానికే పరిమితం కావడం కంపిస్తుంటుంది. రచయిత్రుల కథల గురించి, వారి శైలి, కథనం గురించి సీరియస్‌గా ఎవరూ చర్చించినట్టు కనిపించదు. గురజాడా దిద్దుబాటు ని, అచ్చహమాబ స్త్రీ విద్య ‘, ‘ ఖనా లాంటి కథల్ని పక్కనపెట్టి చూసినప్పుడు  దిద్దుబాటు కంటే స్త్రీ విద్య, ఖనా కథలు విధంగానూ తీసిపోవన్న సత్యం బోధపడుతుంది. 

 

 

విక్రమాదిత్యుని  ఆస్థానంలోని జ్యోతిశ్శాస్త్రవేత్త  మిహిరుని భార్య ఖనా కు ఎలాంటి దుర్గతి పట్టిందో చెపుతూ అచ్చమాంబ రాసిన కథ స్త్రీలు అప్పటికే సమాజంలో తమ స్థితిగతుల్ని గుర్తించడం మొదలుపెట్టారనటానికి నిదర్సనం.అలాగే ఐరోపా మహాసంగ్రామానంతర దుస్థితిని, మాంచెస్టర్ నూలు మిల్లులు వచ్చి దేశీయ పరిశ్రమలను దెబ్బతీసిన వైనాన్ని కనుపర్తి వరలక్ష్మమ్మ కుటీరలక్ష్మి” (1924) కథలో చిత్రించారు. ప్రపంచీకరణ తొలిరూపాలు సృష్టించబోయే విధ్వంసానికి మూలాల్ని మనం కథలో చూడవచ్చు.ఇలాంటి మంచి కథల్ని, రచయిత్రుల్ని పట్టించుకున్నవారు తక్కువే.

 

స్త్రీల సాహిత్యాన్ని చర్చించకుండా అసలు గుర్తించనట్టు మౌనంగా పక్కన పెట్టడం ఒకరకమైన వివక్ష అయితే, దాన్ని కేవలం సిద్ధాంతపరిధిలోమాత్రమే విమర్శించడం మరో రకమైన వివక్షగా పేర్కొనవచ్చు. ఇప్పటికీ మనకు పత్రికల్లో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం స్త్రీల రచనల్ని, వారి పుస్తకాల్ని సాధారణంగా స్త్రీలే సమీక్షించుకోవడం.

 

 స్త్రీవాద రచయిత్రులు రాసిన కథల్ని విమర్శించే విధానానికి,  స్త్రీవాద రచయితలు రాసే కథల్ని విమర్శించే విధానానికి వున్న తేడా విమర్శకులకున్న పక్షపాత ధోరణిని తేటతెల్లం చేస్తుంది. రచయిత్రుల కథల్ని స్త్రీవాద సిద్ధాంతపరిధిలో వున్నాయని విమర్శించే విమర్సకులు రచయితల కథల్ని స్త్రీవాద దృక్పథంతో వున్నాయని గొప్ప చేసి చూపించడం అలాంటిదే.

 

ఉదాహరణకు  అత్యాచారం ఇతివృత్తంగా రచయిత్రి రాసిన కథ, రచయిత రాసిన కథ తీసుకుంటే వాటిని విమర్సకులు ఎలా విమర్శించారో చూస్తే

 

వివినమూర్తి కథ నేరం ‘, నిర్మలారాణి కథ మలుపు తీసుకుంటె నిర్మలారాణి కథలో మోతుబరి చేతిలో  అత్యాచారానికి గురైన సునీత అతనితో పెళ్ళికి ఒప్పుకోదు. కానీ అత్యాచారం వల్ల కలగబోయే బిడ్డకు మాత్రం అతని అసథిలో వారసత్వం అడుగుతుంది. ఇందులో గందరగోళమేమీ లేదు. బలవంతంగా అత్యాచారం చేశాడు కాబట్టి దాని పెళ్ళి అనే సాంఘిక లైసెన్స్ తో సమాజ అంగీకారానికి తీసుకురావల్సిన పనిలేదు.  ఇక అత్యాచారం వల్ల కలగబోయే బిడ్డ చర్యకు ఫలితం కాబట్టి బిడ్డను పెంచడానికి అందుకు బాధ్యుడైన వాడి వద్ద నుండి అతని ఆస్థిలో వాటా అడగడం సమంజసం. కథను విమర్శించిన కోడూరి శ్రీరామమూర్తి సునీత నిర్ణయం గందరగోళంగా వుందని వ్యాఖ్యానించారు.

 

వివినమూర్తి రాసిన నేరం కథ చూస్తే, విప్లవజీవితం నుండి తండ్రి రమ్మంటే బైటకు వచ్చి పెళ్ళి చేసుకుని  అమెరికా వెల్తుంది వైప్లవ్య.  అకక్డ కొన్నాళ్ళున్నాక మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి కార్పోరేట్ ఆస్పత్రి కట్టీస్తారు భార్యాభర్తలు వైప్లవ్య, రాఘవలు. ఇంట్లో పనులు చూసుకోవడానికి పెట్టుకున్న పనివాడు భిక్షంను  పనివాడిలాగా కాకుండా విప్లవ భావజాల ప్రభావంతో తమతో సమానంగా చూస్తారు భార్యాభర్తలు. భిక్షం వైప్లవ మంచితనం (?) అర్ధం చేసుకోకుండా ఆమెపై అత్యాచారం చేసి చివరికి పశ్చాత్తపపడతాడు. అపప్టివరకూ భార్య మాటకు ఎదురు చెప్పని రాఘవ అత్యాచారం సంఘటనతొ వైప్లవ్యకు విడాకులిస్తాడు. అత్యాచారం సంఘటనతో షాక్‌కు గురై ఆస్పత్రిలో వున్న వైప్లవ్య షాక్ నుండి కోలుకొని  భిక్షం తప్పును క్షమించి తన కొడుకుగా దత్తత తీసుకుంటుంది. కథంతా విన్న శిష్యుడు ఎక్కడుండాల్సిన వాళ్ళను అక్కడ ఉంఛకపోతే ఇలాగే జరుగుతుందన్న మాటలకు  గురువు చెంపదెబ్బ కొట్టడంతో కథ ముగుస్తుంది. ఇలాంటి అతి సాధారన వ్యాఖ్యలు చేసే మేధావులకు  చెంపదెబ్బ కొట్టడం లాంటిది ఇది అంటారు కోడూరి. కథలో కేవలం చివర్లో చూపిన పరిష్కారమే కాదు. మొదటి చివర వరకూ కథలో , కథనంలో అనేక లోపాలున్నాయి. అయితె కోడూరి దీని గొప్ప కథగా చెప్పటమే కాకుండా ఇందులో స్త్రీవాద దృక్పథానికి మించిన పరిధి వుందనటం విశేషం.

అత్యాచారం అనే అంశాన్ని రచయితలిద్దరూ  రెండు రకాలుగా చిత్రించారు. ఇందులో నిజానికి  నిర్మలారాణి కథ స్త్రీవాదానికి దగ్గరగా అనడం కంటే జీవన వాస్తవికతకు దగ్గరగా వుందని చెప్పాలి. కానీ  వివినమూర్తి కథలోని ప్రధాన లోపం బలహీనమైన  వ్యక్తిత్వమున్న వైప్లవ్య పాత్ర. విప్లవ జీవితంలోంచి తండ్రి పిలిపించేస్తే వచ్చేస్తుంది. చాలా మంది లాగానే డబ్బున్నవాడిని పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళిపోయి డబ్బు సంపాదించి తిరిగివస్తుంది. తిరిగొచ్చాక మంచి కార్పోరేట్ ఆస్పత్రి కట్టిస్తారు  భార్యాభర్తలు. ఇలా అన్న్నీ తమకనుకూలంగా  చేసుకుంటున్నా వైప్లవ్య అంతరంగంలో చాలామధనపడుతోందని, అపరాధ బహవనకు గురవుతోందని రచయిత వాచ్యంగా చెప్తారు. అపరాధ భావనతోనే పనివాడిని పనివాడిలా  చూడాలనుకోవడం కాకుండా తమతో పాటు ఇంట్లో సమాన హోదా కల్పిస్తారు. అంటే అపరాధ భావనకు ఇది పరిష్కారమా? ఆమెలో అపరాధ భావన కథలో బలంగా చిత్రితం కాకపోవడమన్న లోపాన్ని పక్కన పెడితే అత్యాచారం జరిగిన తర్వాత భర్త వైప్లవ్యను వదిలేస్తాడు. ఆమె షాక్‌కు గురై ఆస్పత్రిలో చేరుతుంది. అత్యాచారం అనేదాన్ని  శీలం, పాతివ్రత్యం అనే భావనల నుండి కాకుండా దాన్ని శరీరంపై జరిగిన ఒక యాక్సిడెంట్‌గా పరిగణించి ఆమె చేదు అనుభవం నుండి బైటపడితే అది సహజత్వానికి దగ్గరగా వుండి స్త్రీవాద  కథ అయివుండేదేమో. అందుకోసం ఆమె తనను రేప్ చేసినవాడిని కొడుకుగా స్వీకరించి మాతృత్వభావనను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం మనకు కథ రిత్యా కాని, సమాజ రిత్యా కాని కనిపించదు. అత్యాచారంపై వచ్చిన కథల్లో వైపవ్య చేసినది విభిన్న పరిష్కారం. వివినమూర్తి కథకు వినూత్న ముగింపు ఇచ్చారు.  అంత మాత్రాన  అది స్త్రీ వాద కథ అయిపోదు.

 

అత్యాచారం లాంటి స్త్రీల సమస్యకు భిన్నమైన ముగింపు ఇచ్చిన వివినమూర్తి నేరం కథ ఏడాది వచ్చిన మంచి కథగా పొందితే ఇదే సమస్యకు మరో భిన్నమైన ముగింపు ఇచ్చిన నిర్మలారాణి కథ గందరగోళం వున్న కథగా విమర్శకుల  వ్యాఖ్యానం పొందింది.

 

ఇలాంటి ఉదాహరణలు వెతుక్కుంటూపోతే కోకొల్లలుగా మనకు ఇటీవలి తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి.

 

సద్విమర్శ అనేది సాహిత్యానికి ప్రాణవాయువు లాంటిది. అలాంటి సద్విమర్స రచనల మీద రావాలి. అంతే కాని రచయిత్రుల వ్యక్తిగత జీవితాలపైనో, వారు నమ్ముకున్న సిద్ధాంత భావజాల మీదనో కువిమర్సలు చేస్తూ హస్య, వ్యంగ్యాత్మకంగా కథలు రాయడం నీచ సంస్కృతి. అలాంటి నీచ సంస్కృతి తెలుగునాట మొదలైంది. నిజమైన సాహిత్యాభిలాషులెవరైనా దాన్ని ఖండించాల్సిందే 

 

 

 

 

 

 

 

 

Read Full Post »

నేనొక వరూధినిని
భీతహరిణేక్షణను, తిరస్క్రుతను
వలచిన నేరానికి
దగాపడ్డ వెలయాలిని!
హిమవత్పర్వత సాక్షిగా
దక్కింది నిర్నిద్ర వేదనే!

వలచి వచ్చిన వనితల్ని
మోసగించే మాయప్రవరుల వారసులే మనువులు!

*****

నేనొక శకుంతలను!శాపగ్రస్తను!
ఓ మగవాడి అవ్యక్త స్మ్రుతిని!

నేను మినహా అన్ని గుర్తున్న అతను
అతను వినా మరేమి గుర్తు లేని నేను

ఇద్దరి నిరవధిక సుఖవారాశికి
మనఃప్రక్రుతే మౌనసాక్షి!

అభిజ్ఞానం తప్ప మగని ఆదరణ పొందలేనిదాన్ని!

******

నేను పంచభర్త్రుక ద్రౌపదిని

అర్జునుణ్ణి వలచి అయిదు ముక్కలైనదాన్ని

మగవాడి మాయాజూదంలో ఓ పణాన్ని

నిండు కొలువులో నిలువెత్తు పరాభవం
ఇల్లాలితనమే లేదన్న ధర్మసూనుడు

వంతుల కాపురానికి మిగిలింది
జీవన నటనా విషాదం!
*****

నేను యయాతి పుత్రికను మాధవిని

దురహంకార పురుషజాతి ఆస్తిని

నియోగినిని!నిలువెత్తు సౌందర్యరాశిని!

నలుగురితో సంసారం
నాకు మాత్రం నగుబాటు కాదట

నాది క్షాత్రధర్మమట
నాలుగు పసిమొక్కల క్షేత్రధర్మమట
నిత్య యవ్వనకన్యనట

అకటా!
మగువ మనసు తెలియని వీరా
మహరాజులు!మహర్షులు!మగవారు!

*****

కనుదోయిపై కలల నీలి నీడలు
కాలం చెప్పిన కధల్లో
అందరూ దుఃఖభాగినులే
ఈ స్త్రీపర్వమంతా దుఃఖస్మ్రుతుల దొంతర!

****

ఇప్పుడు నేను మానవిని
అవ్యక్తనూ, పరిత్యక్తనూ కాను
అయోనిజనో, అహల్యనో కాబోను
వంచిత శకుంతల వారసురాలిని అసలే కాను

స్త్రీత్వపు కొలమానం గానే మిగలనింక
నేను అపరాజితను
కనిపించని సంకెళ్ళను ఛేదించే కాళిని
సస్యక్షేత్రాన్నే కాదు, యుద్ధ క్షేత్రాన్ని

సిగ్గుతో చీలిపోయిన భూమిని నేనే
నెర్రెలు విచ్చిన నేలను విశాలమైన బాహువులతో కప్పే ఆకాశాన్ని నేనే!

Read Full Post »

మాలతి గారి సాహిత్య యాత్రావలోకనం చదివి మరోసారి అవిడ మీద (ఈ సంభోదన గౌరవ ప్రపత్తులతో సుమా)ముచ్చటేసింది. నా స్నేహితురాలు కదా అని కించిత్తు గర్వం కూదా యే మూలనో.

చాలా మంది రచయిత్రుల్లో నుంచి మాలతి గారిని ప్రత్యేకంగా నిలబెట్టిన కొన్ని అంశాలున్నాయి. వాటి గురించి ఈ సందర్భంగా నాకు  తోచినవి ఇక్కడ చెప్పడం సందర్భోచితం అనుకుంటాను.నాకు చాలా తెలుసు, బాగా చదువుకున్నానన్న గర్వం యే కోశాన లేని మంచి హాస్య చతురత వున్న వ్యక్తి. ఆ వ్యక్తిత్వ సుగుణం వల్లే ఆమె ఈ వయసులో కూడా చక్కగా రాయగలుగుతున్నరు. తనకన్నా చిన్నవాళ్ళతో కూడా హాయిగా కలిసిమెలిసి తిరగగలుగుతున్నారు. శుద్ధమైన తెలుగు ఆవిడ మాటల నిండా, రాతల నిండా మనకు ప్రస్ఫుటంగ కనిపించి మనసుని ఆహ్లాదపరుస్తాయి.ఇది కేవలం పొగడ్తల పర్వం కాదు. అవిడలో నాకు నచ్చే గుణాలతో పాటు నచ్చని గుణాలు కూడా కొన్ని వున్నయి. అయితే అవి చాలా స్వల్పమైన విషయాలు. ఒక ఇద్దరి మధ్య స్నేహానికి, ఒక చిన్న అనుబంధం పెరగడానికి అవేమి ఆటంకాలు కావనుకుంటాను.

మా ఇద్దరి మధ్య స్నేహం నిలుస్తుందని నేను  వూహించలేదు. స్త్రీవాదం అంటే ఆమెకు, నాకు వున్న భిన్నమైన అభిప్రాయాలు అందుకు ఒక కారణం అనుకుంటాను.  అయితే ఎదుటి వారి అభిప్రాయాలు మనకు నచ్చినా, నచ్చకపోయినా మొదట వినే ప్రయత్నం చేయడం, వాటి గురించి ఆలోచించడం, చర్చించడం లాంటి అలవాట్లు మా ఇద్దరికి వుండటం వల్ల మా మధ్య సాహిత్యపరమైన విభేదాలేమీ రాకుండా కాపాడాయి. అందుకు ఆవిడకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి.అలా మా స్నేహం పెరిగింది.అయితే ఆ తర్వాత మెము ఇండియాలో కొద్ది కాలం వుండి తిరిగివచ్చాక  ఆస్టిన్ కి రావడం వల్ల ఇప్పుడు వెనకటి పలకరింతల పులకరింతలు లేవనే చెప్పాలి. అందుకు నా అనారోగ్యం, ఇంకా అనేక ఇతర హడావిడులు కారణం.

మేం మాడిసన్లో వున్నంతకాలం మా ఇద్దరి సాహిత్య చర్చలు ఇద్దరిని కూడా అలోచింపచేసాయనుకుంటున్నాను. మంచుదెబ్బ లాంటి కధలు చదివి కదిలిపోయిన సందర్భాలు మాకింకా గుర్తే. ఆమె స్త్రీపాత్రలు కొన్ని ఒక్కోసారి మనల్ని చాలా కాలం వెంటాడతాయి. సున్నితమైన హాస్యం, సన్నని వెక్కిరింత తప్ప ఇతరుల్ని కించపర్చని వ్యంగం ఆవిడ కలానికున్న ప్రత్యేకత. ఆవిడ స్త్రీ పాత్రల్లాగే ఆమె కూద చాల బలమైన వ్యక్తిత్వమున్న రచయిత్రి.

ఆమె కథల మీద సమీక్షా వ్యాసం మరోసారెప్పుడో ఇలానే  మరో టపాలో…సెలవు.

Read Full Post »