Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for ఆగస్ట్, 2009

సాక్షి పత్రికలో ఆగస్ట్ 17 న ప్రచురితమైన ఈ వ్యాసం తాలూకు లింక్

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=34209Categoryid=1subcatid=3

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=34209&Categoryid=1&subcatid=3

mayaangelouపుస్తకాలంటే కొన్ని అక్షరాలు, పదాలు, వాక్యాల సంపుటి కాదు. జీవితాన్ని అల్లికబట్టి చూపించే అద్దాలు. రచయతలంటే, మనం ఎక్కడో దారి తప్పి ఎటు వెళ్ళాలో తెలియక దిక్కుతోచక నిలబడిపోతే, మనకు దిశానిర్దేశం చేసే దీపస్థంభాలు. ఇది అక్షర సత్యమని నిరూపించే రచయతల్లో  ఒకరు మాయా ఏంజలో! ఆమె ఫలానా అంటూ ఎలాంటి  ప్రత్యేక పరిచయం చేయనక్కరలేని విశ్వవిఖ్యాత కవయిత్రి, రచయత్రి,నాటకకర్త,  puliTzer Prize finalist. ఆమెను పాతికడుగుల  దూరం నుంచి చూస్తే, సూది పడితే వినపడేంత నిశ్శబ్దంలో ఆమె మాటలు వింటే , ఆమె వాక్ప్రవాహం ముందు మంత్రముగ్ధులైతే ఎలా వుంటుందో అది స్వానుభవంలోకి రావటం నా అదృష్టం.

అది ఒక అక్టోబర్ ఆకురాలు సాయంకాలం. ఆస్టిన్ లోని యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్ లోని  టెక్సాస్ యూనియన్ బాల్ రూం లో ఆమె విశేష ఉపన్యాసం ఏర్పాటైంది.గత నలభై ఏళ్లలో మాయ UT కి వచ్చి ప్రసంగించడం ఇది నాలుగో సారి. open to all అయినా రద్దీ వల్ల అతి కొద్ది మందికి లభించే ఫ్రీ పాస్ లు సంపాదించి అఫ్సర్, నేనూ  మాయా ఏంజలో ప్రసంగానికి వెళ్ళాము. ఫ్రీ పాస్ లతో వెళ్ళినా గంట ముందు వెళ్ళి క్యూ లో నిల్చోవాల్సి వచ్చింది. అక్కడ క్యూ లో నిలబడ్డ అందరి మొహాల్లో ఒక ఉద్విగ్నత కనిపిస్తొంది. నా ముందు నిలబడ్డ  ఒక ఆఫ్రో -అమెరికన్ స్టూడెంట్  ” మీరు ఆమె పుస్తకాలన్నీ చదివారా?” అంటూ పలకరించింది. ఒక్కోసారి ఒక్కో పుస్తకం మనం చదివినప్పటి కన్నా ఆ తర్వాతెప్పుడో జీవితంలో ఏదొ ఒక సందర్భంలో కానీ  అర్ధమైనట్టు అనిపించదని చెపితే పెద్దగా నవ్వేసింది.

యు.టి. టెక్సాస్ యూనియన్ 75 వ వార్షికోత్సవాల సందర్భంగా విశిష్ట వ్యక్తుల ప్రసంగాల్లో భాగంగా మాయా ఏంజలో ప్రసంగం ఏర్పాటైంది. ఆమె వేదిక మీదకు వచ్చినప్పుడు, ప్రసంగించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కూడా  ప్రేక్షకులంతా గౌరవపురస్కారంగా లేచి నిలబడి standing Ovation ఇచ్చారు.దాదాపుగా 70 ఏళ్ళు నిండవస్తున్నా  ఆమె కంఠ స్వరంలో కాని, ఆమె మాటల్లో కాని, ఆమె భావాల్లో కాని ఎక్కడా అణుమాత్రమైనా వృధ్ధాప్యపు ఛాయలు కాని, ఒక్క నిరాశాపూరిత ఆలోచన కాని కనిపించలేదు. ఆమె తన ప్రసంగం ” మీరెప్పుడైనా ఇంద్రధనస్సుని చూసారా?” అంటూ మొదలుపెట్టింది. ఒకొక్కరి జీవితంలో ఎన్నెన్ని ఇంద్రధనస్సులుంటాయో, వాటిని ఎలా కాపాడుకొవాలో, వాటి వెంట ఎలా ప్రయాణించాలో ఆమె తన జీవితం నుంచి కొన్ని కొన్ని సంఘటనలు ఉదహరిస్తూ చెప్పుకొచ్చింది.తన జీవితంలో తల్లి, తమ్ముడు, మామయ్య, తన కొడుకు వీళ్ళంతా రకరకాల జీవితపు దశల్లో ఎలా ఇంద్ర ధనస్సులై కొత్త ఆశల్ని, కొత్త కలల్ని మోసుకొచ్చారో చెపుతుంటే ప్రేక్షకులంతా  పసిపాపలై  ఆ ఏడురంగుల  అనుభూతుల వెంట ప్రయాణించారు.

బాలికగా వున్నపుడే, తల్లి బాయ్ ఫ్రెండ్ వల్ల రేప్ కు గురి కావటం, ఆ తర్వాత పోలిసులు వచ్చి ఆ రేపిస్ట్ హత్యకు గురైన సంఘటన చెప్పినప్పుడు తానెంత భయంకరమైన సంఘర్షణకు గురై, ఆ క్షణం  నుంచి ఆరేళ్ళపాటు ఒక్క మాట కూడా మాట్లడలేక గొంతు మూగబొయిందో ఆమె మాటల్లో వింటున్నప్పుడు కళ్ళు చెమర్చని ప్రేక్షకులు లేరేమో. ఆ మౌనం తోనే మాయా ఏంజలో  స్కూల్ కెళ్ళింది. ఎవ్వరితో మాట్లాడలేని మాయా లైబ్రరిలో వున్న ప్రతి ఒక్క పుస్తకం చదివేసింది. అలాంటి దశలో ఆమెకు దొరికిన ఆలంబన ‘ కవిత్వం ‘. అంతే ఆమె ఆ కవిత్వపు ప్రేమలో పడిపోయింది. కవిత్వం నా sanity ని కాపాడింది అని మాయా ఏంజలో చెప్పినప్పుడు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. తనకు పదకొండేళ్ళప్పుడు తాను షేక్ స్పియర్  రచనల్ని చదివి  అది రాసింది సౌత్ లో రేప్ కు గురైన ఒక నల్ల అమ్మాయి అని ఎంత గట్టిగా నమ్మిందో చెప్పినప్పుడు సభలో నవ్వులు విరిసాయి.

జీవితంలో ఎన్ని రకాల వొడిదుడుకులొచ్చినా సరె, కవిత్వాన్ని, రచనని మాత్రం తానెలా వొదిలిపెట్టలేదొ,అదే తనకొక ‘ ఔట్ లెట్ ‘ ఎలా అయిందన్న విషయాన్ని ఆమె చెప్పినప్పుడు చిన్నచిన్న వాటికే మనం ‘ రైటర్స్ బ్లాక్  ‘ అనుకోవడం ఎంత అసంబద్ధమో తెలిసివచ్చి తలదించుకోవాల్సి వచ్చింది. మాయా ఏంజలో తన కొత్త పుస్తకం Letters To My Daughter నుంచి ఒక చిన్న చాప్టర్, అలాగే తన కవిత ఒకటి  చదివి వినిపించటం వల్ల ఆమె చేసింది ఒక ప్రసంగం లా కాక ఓ అద్భుత performance అనుభూతిని మిగిల్చింది. అయితే నా చేతిలో వున్న ఎంపి3 ప్లేయర్ సరిగ్గ చార్జ్ కాకపోవటం వల్ల, ఆమె మాటల్ని మళ్ళీ మళ్ళీ వినటానికి వీలుగా ఆమె ప్రసంగాన్ని రికార్డ్ చేసుకోలేకపోవడం ఒక దురదృష్టం గా ఇప్పటికీ భావిస్తాను. ఆమెను చూసి, ఆమె ప్రసంగం విన్న స్పూర్తి నాలో నిద్రాణమై వున్న కవితాశక్తిని మళ్ళీ మేల్కొలిపింది.

మాయా ఏంజలో అంటే  వర్తమాన సాహిత్యంలో ఒక తిరుగులేని స్వరం. గత ఏప్రిల్ లో మాయా  70 వ పుట్టినరోజు సందర్భంగా ఓప్రా  షో లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓప్రా అడిగింది ” వయస్సు మీదపడటం గురించి ఏమనుకుంటున్నారని?”. అప్పుడు మాయా ఇచ్చిన సమధానం— ” ఏమి జరిగినా సరే, అదెంతో  చెడుగా ఇవాళ కనిపిస్తున్నా సరె, జీవితం ముందుకే సాగిపోతుంది. రేపు ఎప్పుడూ బాగుంటుందన్నది  నేను నేర్చుకున్న పాఠం”

మాయా ఏంజలో మిగతా రచనల్లాగే ఆమె కొత్త పుస్తకం ” లెటర్స్ టు మై డాటర్” కూడా మనమెవ్వరం కూడా మర్చిపోలేని పుస్తకం. ఈ పుస్తకంలో జీవితం, నమ్మకం, మాత్రుత్వం, కరుణ, మానవత్వానికి సంబంధించిన విషయాల మీద 28 చిన్న వ్యాసాలు, కొన్ని కవితలు వున్నాయి. మనం ఆ పుస్తకం నుండి  ఎంతో ప్రేమను పొందుతాము. జీవన సూత్రాల్ని, పాఠాల్ని నేర్చుకో గలుగుతాము. అందుకే అది ఒక్కసారి మాత్రమే చదివి పక్కనపెట్టేసే పుస్తకం కాదు. మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ, ఇతరులతో పంచుకోవాల్సిన   పుస్తకం. అందులో ఆమె ఇలా అంటారు ” నేను ఒక పిల్లవాడికి జన్మనిచ్చాను. కాని నాకు వేలవేలమంది కూతుర్లున్నారు. నువ్వు నలుపో, తెలుపో, యూదువో, ముస్లిమో, ఏషియనో, స్పానిష్ మాట్లాడుతావో,లేదా నేటివ్ అమెరికన్ వో. నువ్వు లావుగా వుంటావో, సన్నగా వుంటావో, అందంగానో, లేక మాములుగా వుంటావో, నువ్వు గే లేదా స్ట్రైట్, చదువుకున్నావో లేదా నిరక్షరాస్యురాలివో, కాని నేను మీ అందరితో మాట్లాడుతున్నాను. ఇదిగో మీ అందరికి నేనిది సమర్పిస్తున్నాను ” అంటారు. ఆమె ప్రేమను, ఆమె అందించిన కానుకల్ని అందుకున్న మనం ఎంతో అదృష్టవంతులం. ఆ పుస్తకం చదువుతున్నంత సేపు ఎవరికి వారం మనం ఆమె కూతురైనట్టు, మనం మన తల్లితో మాట్లాడుతున్నట్టు అనుభూతి చెందుతాము. జీవితంలో ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి అనుబంధాల్లోనైనా మనం నిజాయితీతో ఎందుకుండాలో, ఎలా వుండాలో ఒక తల్లిగా ఆమె తన అనుభవాల నుండి చెప్పే మాటలు మనందరికీ ఇవాళ పనికొచ్చే పాఠాలు.

మనలాంటి వాళ్ళందరికి మాయా ఏంజలో ఎప్పటికీ ఆరిపోని  ఒక దీపస్థంభం! ఆ వెలుతురు ముందు మనమంతా మిణుగురులమే!

కల్పనారెంటాల

 

ఓప్రా ఇంటర్వ్యూ లో మాయా ఏంజలో తాను నేర్చుకున్న విషయాల గురించి చెప్పిన ఆణిముత్యాలాంటి మాటలు…

మీ తల్లితండ్రులతో మీ అనుబంధం ఎలాంటిదైనా మీ జీవితం నుంచి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీరు వాళ్ళను ఎంతలా కోల్పొయినది అనుభవంలోకి వస్తుందనేది నేను నేర్చుకున్నాను”.

జీవనం కోసం సంపాదించుకోవటం, ఒక జీవితాన్ని తీర్చిదిద్దటం  ఒకటి కాదని నేను నేర్చుకున్నాను”.

జీవితం ఒక్కోసారి నీకు రెండో అవకాశం ఇస్తుందని నేను నేర్చుకున్నాను”.

ఎప్పుడైనా సరే నేను మనస్పూర్తిగా ఒక నిర్ణయం తీసుకుంటే , దాదాపుగా అది సరైన నిర్ణయమైనట్టు నేను నేర్చుకున్నాను”.

ప్రతిరోజు బయటకెళ్ళి ఎవర్నో ఒకరిని చేరుకొని , ఎవరినో ఒకరిని తాకండి. ఒక వెచ్చటి కౌగిలింత, లేద వీపు మీద ఒక స్నేహపూరిత చరుపు లాంటివాటిని అందరూ ఇష్టపడతారని నేను నేర్చుకున్నాను”.

నేను నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా వున్నాయన్న సంగతి నేను నేర్చుకున్నాను”.

ఇతరులతో నువ్వేమి చెప్పావో వాళ్ళు మర్చిపోతారు. ఇతరులకు నువ్వేమి చేసావో కూడా వాళ్ళు మర్చిపోతారు. కానీ నువ్వు వాళ్ళను  ఎలా ఫీల్ అయ్యేలా చేసావో మాత్రం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరన్న సంగతి నేను నేర్చుకున్నాను”.

 

 

 

 

 

ప్రకటనలు

Read Full Post »