Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్, 2009

nidritanagaram2వెన్నెల, జలపాతాలు, ప్రకృతి సౌందర్యం వీటిని ఇష్టపడి ప్రేమించని వారెవరు? ఆరాధించనివారెవ్వరు? అయితే అందరూ చేయలేని పని ఒకటుంది. అది వెన్నెలని కవిత్వం గా, కవిత్వాన్ని వెన్నెల గా మార్చగలగటం. ఆ ఆల్కెమి తెల్సిన మంచి కవుల్లో వైదేహి ఒకరు. ఇప్పటికే చాలా మంది ఇటీవల వైదేహి కవిత్వాన్ని సమీక్షించారు. అవి నేను కూడా చదివాను. అయితే అవేమి ఇప్పుడు నేను వైదేహి కవిత్వాన్ని గురించి రాస్తున్నప్పుడు నాకు గుర్తు లేవు. ఇప్పుడు నేను రాస్తున్న ఈ నాలుగు మాటలు కూడా ఎవరికీ గుర్తుండవు. ఎందుకంటే అప్పటికే అందరి మనస్సుల్లో వైదేహి కవిత్వం గుర్తుండిపోయింది కాబట్టి. ఈ కారణం చేతనే నాకు కవిత్వాన్ని సమీక్షించుకోవటం ఒక్కోసారి అనవసరమనిపిస్తుంది. కవిత్వం ప్రధానం గా అనుభూతి ప్రక్రియ. ఆ అనుభూతిని అనుభవించటమే తప్ప ఇంకేమి చేసినా ఆ సహజ సౌందర్యం ముందు నిలబడవు.

అందుకనే వైదేహి ఏం చేసిందంటే తిలక్ ని, అతని కవిత్వాన్ని, ఆ కవిత్వం లోని వెన్నెల సొబగులని, సౌందర్య జలపాతపు వొంపు సొంపుల్ని తన మనసు లోతుల్లోకి వొంపేసుకుంది. తనూ, తిలక్ ఇక ఒకటై పోయారు. తానే ఒక తిలకై పోయారు. ఇక మనమేం మాట్లడతాము? ఒక్క తన కవిత్వపు నిషాలో మత్తెక్కి పోవటం తప్ప. ఎంత అందంగా అనుభూతించగలిగింది, ఎంత బాగా అక్షరీకరించగలిగింది అని తన్మయత్వంతో మురిసిపోవటం తప్ప. తన కవిత్వం చదివిన తర్వాత ఇప్పటి దాకా ఏమీ రాయకుండా నేను చేసింది అదే.

(మనందరికీ ఇష్టమైన ఇస్మాయిల్ గారి అవార్డ్ ని అందుకుటున్న మన వైదేహి కి ప్రేమతో, స్నేహంతో ఈ నాలుగు వాన చినుకుల్లాంటి మాటలు)

ప్రకటనలు

Read Full Post »

తెలుగు కధల గురించి నిడదవోలు మాలతి గారితో నా చాట్ ‘పుస్తకం ‘ లో ఇప్పటికే ప్రచురితమైంది. అది మళ్ళీ ఇక్కడ రెండు భాగాల్లో…

కథావిమర్శ (చర్చ)-మొదటిభాగం: రచయితలూ, పాఠకులూ
(ఈ చర్చ ప్రముఖ రచయిత్రులు, బ్లాగర్లు అయిన నిడదవోలు మాలతి గారికీ, కల్పన రెంటాల గారికీ మధ్య జరిగింది. పుస్తకం.నెట్ కోసం అడగ్గానే ఒప్పుకుని ఈ చర్చ జరిపినందుకు వారిద్దరికీ మా తరపున ధన్యవాదాలు. ఈ చర్చ రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగం – “రచయితలూ,పాఠకులూ” ఇప్పుడు వేస్తున్నాము. రెండో భాగం త్వరలో. – పుస్తకం.నెట్)
మాలతిః కల్పనా, అసలు రచయిత, నువ్వే అనుకో, కథ కానీ కవిత కానీ నీకోసం రాసుకుంటావా, పాఠకులని దృష్టిలో పెట్టుకుని రాస్తావా?
కల్పన: మాలతిగారు, నేనైతే మొదట నాకోసమే రాసుకుంటాను. అయితే అది ప్రచురణకు పంపితే మాత్రం తప్పకుండా పాఠకులగురించి కూడా ఆలోచిస్తాను. వాళ్ళు దీన్ని ఎలా స్వీకరిస్తారు అని.
మాలతిః నేను నాకు ఏదో రాయాలన్న తపన కలగడంచేత రాస్తాను. మరి “పాఠకులకోసం” అన్నది కనీసం నావిషయంలో, పూర్వం లేదు. ఇప్పుడు బ్లాగు మొదలుపెట్టినతరవాత, కొందరు పాఠకులు తప్పనిసరిగా మనసులో మెదులుతున్నారు. ప్రచురణకి పనికివస్తుందా రాదా అన్నఆలోచన లేదనే అంటాను నాకైతే. బహుశా వాళ్లు ప్రచురించకపోతే నేనే ప్రచురించుకుంటాను అన్న ధీమా కావచ్చు. ప్రతి కథకీ కొందరు పాఠకులు వుండకపోరు అని కూడా నానమ్మకం. మరి కవితలు కూడా అంతేనా నీవిషయంలో?
కల్పన: కొంతలో కొంత, కథ వేరు, కవిత వేరు అనుకుంటాను. కవిత మాత్రం ఎప్పుడూ మొదట మనకోసమే రాసుకుంటాము. కధ మాత్రం ప్రధానంగా సమాజం నుంచి పుడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇది చదివినవాళ్లకు ఈకధ ఏమనిపిస్తుంది? ఎలా అర్ధం చేసుకుంటారు? లాంటివి తెలిసి కాని, తెలియకుండానే కాని ఆలోచిస్తామని నేను అనుకుంటాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే కధ రాసేటప్పుడు నేను రచయతని. నా కధను నేనే విమర్శించుకునేటప్పుడు నేనే విమర్శకురాలిని. ఆ తర్వాత నేనే పాఠకురాలినైతే ఈ కధ ఎలా అనిపిస్తుంది అని కూడా ఆలోచిస్తాను. మూడు చోట్లా సంతృప్తి కలగటం అనేది వుండకపోవచ్చు. అలాంటప్పుడు నేను రచయత పాత్రకే కట్టుబడి అవసరమైనమార్పులు చేసుకుంటాను. కధ రాసేటప్పుడు నాపాత్ర అదే. అసలు రాజాస్థానాలు, పత్రికలూ, ప్రచురణలు, బ్లాగులు లేనప్పుడు రచయితలు ఎలా ఆలోచించి వుండేవారనుకుంటున్నారు?
మాలతి: మంచి ప్రశ్నే. నువ్వన్నట్టు కథ వేరూ, కవిత్వం వేరూ అంటే వాటిని వేరేరకంగా ఆలోచించాలి. ఉదా. వేమన … అలాకాక, కథలు పెద్దవాళ్లు పిల్లలకి లోకరీతి నేర్పడానికి మొదలుపెట్టేరేమో. అంటే అవే ఆనాటి వ్యక్తివికాసంపాఠాలు అన్నమాట. మరి పాఠకులకోసమే అనుకుంటే, నువ్వు నీకథలని వాళ్ల అభిప్రాయాలకి అనుగుణంగా మారుస్తావా?
కల్పనః వేమన అయినా సుమతీశతకకారుడైనా తమకోసం మాత్రమే రాసుకుని వుంటారని నేననుకోను. లోకానికి చెప్పటంకోసం కూడా రాసి వుంటారు.. అది కూడా ఎవరోఒకరికి చదివి వినిపించటం, అలా మౌఖికంగా సాహిత్య ప్రచారం ఆ రోజుల్లో జరిగేది కాబట్టి పాపం వాళ్లకు పాఠకుల కామెంట్లగొడవ లేదేమో. అలాగే కధ ప్రయోజనం మొదటినుంచి కూడా సమాజం పోకడల్ని చెప్పటమో, నీతిని బోధించటమో అయివుండవచ్చు. ఆరోజుల్లో అది పర్సనల్ డెవలప్మెంట్ అయినా ఇప్పుడు కధ స్వరూపం, ప్రయోజనం కూడా మారాయి కదా. మరి కథగురించి మన ఆలోచనలు మారాల్సిన పని లేదా?
మాలతి: కథప్రయోజనం ఎలా మారిందంటావు? స్వరూపం మారినట్టు కనిపించినా అది పైపైమార్పే అంటాన్నేను. ఆరోజుల్లోనూ ఈరీోజుల్లోనూ కూడా కథకుడు తనభాషలో తనధోరణిలో చెప్పడమే కదా. ఎటోచ్చీ, సంపాదకులూ, ప్రచురణకర్తలూ లేనిరోజుల్లో నిబంధనలు కూడా లేవు. అంచేత రచయితకి ఎక్కువ స్వేచ్ఛ వుండేది అప్పట్లో.
కల్పన: ఇదివరకు కధకి సామాజికప్రయోజనమే మొదటిలక్ష్యం, బహుశా అదొక్కటే లక్ష్యం కూడా అయివుండవచ్చు. అప్పుడు కూడా అది రచయతని బట్టే వుంటుందనుకుంటాను.. అయితే కాలానుగుణంగా అది ఎంతో కొంత మారింది. ముఖ్యంగా అస్తిత్వచైతన్యం వచ్చాకా.
మాలతి : అస్తిత్వం, చైతన్యం ఒక భావన. దానిఆంతర్యం కూడా వ్యక్తివికాసమే కదా.
కల్పన: అస్తిత్వం, చైతన్యం ఇవి వ్యక్తిత్వవికాసంలో భాగమే.. అయితే వ్యక్తీకరణలో తేడా వుంటుంది కదా! స్త్రీలు, దళుతులు, ముస్లిమ్‌లు తమబాధల్ని, తమగాధల్ని చెప్పుకుంటున్నప్పుడు అందరికీ నచ్చినా, నచ్చకపోయినా వాళ్ళవేదనని చెప్పితీరతారు. చెప్పితీరాలి. మొదటినుంచి సాహిత్య ప్రయోజనమ్ సామాజికప్రయోజనమే అయినా రచయితలు సామాజికప్రయోజనం కోసమ్ రాసినా, వాళ్ళ ఇష్టాఇష్టాలు, వాళ్ళ స్వేచ్ఛ అంతర్లీనంగానైనా వాడుకునేవారు.
మాలతి : మరొకమాట అడుగుతాను. నువ్వు కథ రాసినప్పుడు కొందరయినా అఫెండ్ అవుతారేమో అనుకుని మార్పులు ఏమైనా చేస్తావా, నీకు ఏం రాయాలని వుందో అదే యథాతథంగా రాస్తావా?
కల్పన: ఎవరో బాధపడతారని నేను కధ మార్చిన సందర్భాలు లేవు కాని మధ్యతరగతినుండి రావడంవల్లనేమో మొదట నాకు నా కుటుంబసభ్యులు మాత్రం గుర్తు వస్తారు. మా అన్నయ్యలు, తమ్ముడు, అక్కచెల్లెళ్ళు, బంధువులు ఈ కధ చదివి ఎలా మాట్లాడతారో మాత్రం నాకు ఠక్కున తెలిసిపోతుంది. అదొకరకమైన అప్రకటిత censorship. ఈ సెన్సార్ షిప్ కుటుంబం ఒక్క దాని నుంచే కాకుండా సామాజికంగా కూడా వుంటుంది. స్త్రీలుగా ఎలాంటి విషయాలగురించి రాయవచ్చు, రాయకూడదు, ఏవిధంగా వ్యక్తీకరించవచ్చు లాంటివి. మొదట్లో అది నామీద చాలా ప్రభావం చూపించేది. చాలా విషయాలు రాయడానికి సంకోచించేదాన్ని. క్రమేపి దాన్ని అధిగమించాననే అనుకుంటున్నాను. ఆరకంగా కొన్ని మార్పులు రాసేటప్పుడో, ఆ తర్వాతో మనం తెలిసి కాని, తెలియకుండానో కాని చేసేస్తుంటాము. అది ఇతివృత్తాన్ని, రచయితనిబట్టి కూడా వుంటుంది.
మాలతి: నా అభిప్రాయం కూడా అదే. చెప్పేతీరులో మార్పు వుంటుందేమో కానీ ప్రాథమికంగా చెప్పదలుచుకున్నవిషయంలో మార్పు వుండదనే అనుకుంటాను. పైగా నువ్వన్నట్టు కుటుంబసభ్యులూ, స్నేహితులూ ఈకథని ఎలా స్వీకరిస్తారన్న ఆలోచన నాక్కూడా కొంతవరకూ ఉండొచ్చు. గట్టిగా చెప్పలేను. ఒకవిధంగా చెప్పాలంటే నిజజీవితంలోమాటాడినప్పుడు తూచి మాటాడినట్టే రాసినప్పుడు కూడానేమో. నాకు మరో సందేహం. రచయిత తనకథని మరొకరికథ విమర్శిస్తున్నంత నిష్పాక్షికంగా విమర్శించుకోగలడా అని.
కల్పన: నేను అయితే నో అనే సమాధానమిస్తాను. ఎవరికధగురించి వాళ్ళకు తెలిసినట్టుగా వేరేవాళ్లకధగురించి తెలియదు. మీకధ నాకు నాస్థాయినిబట్టి అర్ధమవుతుంది. నాకు మీకధ అర్ధమ్ చేసుకునే స్థాయి లేకపోతే నాకు ఆకధ అర్ధంకాదు. అందుకని కూడా పాఠకులు వివిధస్థాయిల్లో వుంటారు కాబట్టి వాళ్ళందరికి అర్ధమయ్యేలా, లేదా వాళ్ళందరిమెప్పుకోసం కధ రాయాలని యే రచయితా ప్రయత్నించరు.
మాలతి: నామటుకు నేను నాకథ పదే పదే చదువుకుంటాను. అది ఇప్పుడు వచ్చిన అలవాటేలే. పూర్వం రాసింది రాసినట్టు పంపేయడమే. ఇప్పుడు చదువుకోడం వచ్చేక, అలా చదువుకుంటున్నప్పుడు ఎక్కడ బాగులేదు. ఎక్కడ మరింత స్పష్టం చెయ్యాలి అన్నఆలోచనలు వస్తున్నాయి. నేనంటున్నది అది కూడా ఒకరకంగా స్వవిమర్శే కదా. అస్సలు బాగులేదు అనుకుని పక్కన పెట్టేసేవి కూడా వుంటాయి. నువ్వు స్థాయి అంటున్నావు. నేను అనుభవాలూ, పరిస్థితులూ, వారి ఆలోచనాధోరణిలో గల పరిమితులు అనుకుంటాను. అంతేనా?
కల్పన: మీరన్న అనుభవాలు, పరిస్థితులు, అవగాహన, వీటినే నేను స్థాయి అన్నాను. తక్కువ, ఎక్కువ అన్న వుద్దేశంతో మాత్రం కాదు. మీరు మీకోసమే కధ రాస్తాను అన్నారు. కాని బ్లాగులో రాయడం మొదలుపెట్టాక మీరు కధ రాసేటప్పుడు అంతకుముందు కధకి పాఠకులవ్యాఖ్యలు ఏదో ఒకరకంగా మీమీద ప్రభావాన్ని చూపిస్తాయి అని నేననుకుంటాను. అలా మీకు తెలిసి మీకధలో మీకు మీరుగా ఏం మార్పులు చేసారు? అలా మార్పులు చెయడంవల్ల మీకధ మంచి మార్పుకి గురైందా? లేక వాళ్ళవల్ల మీకధ మీరు అనుకున్న విధంగా కాకుండా మరో రకంగా రాయాల్సి వచ్చిందా? అసలు ఈకధల్లో వస్తున్న మార్పులకు పాఠకులు ఎంతవరకు కారణం? అని మీరనుకుంటున్నారు?
మాలతి: అమ్మో, పెద్ద ప్రశ్న వేసేవు. నేను బ్లాగు మొదలు పెట్టింతరవాత జరిగిందేమిటంటే – ఏదో పాతతరం రచయిత్రి అని కాకుండా, ఈనాటియువత నాకథలని ఆదరించడం. వాళ్లు రాసే వ్యాఖ్యలనిబట్టి కొంతవరకూ నేను చెప్పేతీరులో మార్పు వచ్చింది. వైదేహీ, రాధిక ఈమాటే అన్నారు. నేను కావాలని పనికట్టుకు చేసింది సంస్కృతసమాసాలూ, అవీ కాస్త తగ్గించడం :). అందువల్ల నాకథ మెరుగుపడిందా అంటే చెప్పడం కష్టం. ఈపాఠకులు వేరు. నిజానికి మంచి ఉదాహరణ నా ఉసుపోక కతలు చూడు. బ్లాగుపాఠకులు విశేషంగా ఆదరించారు ఆశీర్షికని. అదే ఆంధ్రాలో ఒక ప్రచురణకర్తకి మాఅన్నయ్య చూపిస్తే, అందులో హాస్యం లేదండీ అన్నారుట. అంటే వారిదృష్టిలో ప్రింటుపుస్తకాలు చదివే పాఠకులని ఆకర్షించగల హాస్యం కాదనే కదా. ఈనాడు కథల్లో వస్తున్నమార్పులకి ఎక్కువగా బాధ్యులు ఇంగ్లీషుపుస్తకాలు చదివి ఆ ఒరవడిలో ఆలోచించే పాఠకులు. వీరిలో కొందరికి అసహనంపాలు కూడా ఎక్కువే అనిపిస్తుంది ఒకొకప్పుడు. వెనక ఒకసారి ఒక పాఠకుడు “మాకు అర్థంఅయేలా రాయండి చదువుతాం”, అన్నారు నాకథగురించి. ఇలాటి వ్యాఖ్యలు చేసి పాఠకులు నారచనావిధానంలో మార్పు తేలేరు. నిజానికి నారచనావిధానంలో, నాశైలిలో మార్పులు ఏమైనా వుంటే, దానికి కారణం నా వ్యక్తిగతపరిస్థితులూ, నాచుట్టూ వున్న పరిస్థితులే అని చెప్పాలి.
కల్పన: అంటే మీభాషలో మార్పు వచ్చింది అంటారు. మీరు చెప్పేది పాఠకులకు అర్థం కావాలంటే వాళ్ళకు ఎలా చెపితే అర్థం అవుతుందో అలాగే చెప్పాలి అంటారు. మీదగ్గర పాతతరానికి సంబంధించిన మంచి భాష,నుడికారం వున్నాయి. కాని, అవి వీళ్ళకు పెద్దగా అర్థం కాదు కాబట్టి వాళ్ళకోసం మీరు అందరికి అర్ధమయ్యే భాష రాయాల్సివచ్చింది. మీ కొత్త కధ ’నీ కోసం’ లో కూడా చాలా మంచి పదాలున్నాయి ఈనాటితరంవాళ్లకు తెలిసే అవకాశం లేనివి. ఔద్ధత్యంలాంటివి.
పాఠకులు మీరచనావిధానంలో మార్పు తేలేరు అని మీరు స్పష్టం చేయటం నాకు నచ్చింది. అయితే మీరు ఇక్కడ ప్రధానంగా బ్లాగ్ పాఠకుల గురించి మాట్లాడుతున్నరనుకోండి. అయినా ఇంతకుముందు భారతి టైం నుంచి మొన్న మొన్నటి అంధ్రజ్యోతి లాంటి వారపత్రికల్లో కధల ప్రచురణవరకు తీసుకొని చూస్తే, చాలా తేడా తెలుస్తుంది. భారతి లాంటి పత్రికల్లో కధ ప్రచురించటమంటేనే అది మంచి కధ అని గుర్తింపు. అలాగే అందులో రాసే రచయితలకు ఒక గుర్తింపు, ఒక స్థాయి వుండేది. క్లుప్తం గా చెప్పాలంటే ఇదివరకు పత్రికల్లో ఎంపిక స్థాయి ఆరకంగా వుండేది. పాఠకులఆలోచనలు కూడా భిన్నంగా వుండేవి. అలాగే వారు చదివిన కధలమీద నచ్చినా, నచ్చకపోయినా పత్రికలకు ఉత్తరాలు రాసేవారు. అంటే కధగురించి ఆలోచించి ఏది బాగుందో, ఏది బాగులేదో ఉత్తరాలు రాసేవారు. ఇలాంటి లేఖలద్వారా కాని, లేదా రచయితలు ఒకరికొకరు రాసుకోవడంద్వారా తమ రచనలమీద అభిప్రాయాలు తెలుసుకోగలిగేవారు. కాని ఇప్పుడు ఈ బ్లాగులవల్ల పాఠకులు ఏమనుకుంటున్నారో, మనకు తెల్లారేసరికి తెలిసిపోతోంది. పత్రికల్లోకంటే బ్లాగులద్వారా ఎక్కువమంది పాఠకులకు మనం చేరుకోగలగటం మాత్రం శుభపరిణామమే.
మాలతిః “పెద్దగా అర్థం కాదు” అనడంలేదు నేను. వారిదృష్టిని అట్టే ఆకట్టుకోదు అనుకుంటాను. ఈనాటిపాఠకులు instant lifeకి అలవాటు పడ్డవారు. ఆలోచించుకునే ఓపిక లేక, ప్రతిదీ స్పష్టంగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు అందించమంటారు. అంచేత పూర్వం మనకథల్లో వున్న ధ్వనీ, వక్రోక్తీ ఇప్పటికథలలో కనిపించదు. ఒకవేళ నాలాటివాళ్లం రాసినా, పాఠకులు వెంటనే ఇది నాకు అర్థం కాలేదు, అంటూ వ్యాఖ్యలు కురిపించేస్తారు. పైగా ఇంగ్లీషుమాటలవాడకం మరోబాధ. చాలామందికి అదే “కంఫర్టబుల్‌గా” వుంటుంది ☺. నేను మాత్రం తెలుగుకథ అంటే తెలుగు నుడికారం వెదజల్లేదే అనుకుంటాను. రచయితలు పాఠకులవ్యాఖ్యలని సీరియస్‌గా తీసుకోవాలంటే, మరి వారు కథని జాగ్రత్తగా చదివి తమఅభిప్రాయాలు రాయాలని రచయితలు ఆశించడంలో తప్పు లేదు కదా. ఏమంటావు?
కల్పన: ధ్వని, వక్రోక్తి ఇవి ఈనాటి కధల్లో వినిపించవు, కనిపించవు. ఆమాటకొస్తే అసలు అవి ఎలా వాడాలో కూడా నాలాంటి వర్ధమానరచయితలకి తెలియదు. మీకాలపు రచయితలు అలాంటివాటితో ఈనాటి కధలు రాయడం మా అదృష్టం అనుకుంటాను. మీకధా రచన, నైపుణ్యం, భాష మాకు కూడా కాస్త ఇలా ఒక చేత్తో ధారపోయవచ్చు కదా. కాస్త జాగ్రత్తగా కధ చదివి, ఆ పైన ఆలోచించి కామెంట్ పెట్టండి అని అంటే అర్ధం చేసుకునే సహృదయత ఈనాటి బ్లాగ్ పాఠకులకు వుందంటారా?
మాలతి: చేత్తో ధారపోయవచ్చు కదా – హాహా. మంచి జోకే. తాతకి దగ్గులు నేర్పడం అంటే ఇదే.
పాఠకులవ్యాఖ్యలవిషయం – అదే నేను కూడా అంటున్నది. పూర్తిగా కథ చదివి, ఆలోచించి రాసే వ్యాఖ్యలని రచయితలు తప్పకుండా గణనలోకి తీసుకుంటారు. “రచయితలు మెప్పు అయితేనే గ్రహిస్తారు కానీ తప్పులు చూపితే ఒప్పుకోరు” అన్నమాట నేను అంగీకరించను. వ్యాఖ్యలు కథలో వస్తువుకో, శైలికో సంబంధించినవి అయితే రచయితకి తనకథని మరోసారి తరిచి చూసుకోడానికి ఆవకాశం వుంటుంది. అంతే కానీ “ఇలాటిపాత్రలు వుండరు”, “ఇలాటి సంఘటనలు జరగవు,” “ఎవరూ ఇలా మాట్లాడరు” అంటే దానికి ఏముంది జవాబు చెప్పడానికి. రచయిత అలాటి పాత్రో, సంఘటనో చూసినందువల్లనే కదా రాసింది.

కల్పన: ఒక కధ చదివాక, పట్టుమని ఎవరైనా పది నిమషాలైనా ఏమిటి ఇందులో చెప్పింది? చెప్పాలనుకుంది? అని ఎవరైనా ఆలోచిస్తారంటారా? వూరికే నాసందేహం అది. ఎందుకంటే నేను చదవగానే కామెంట్ పెట్టలేను. ఆలోచించాకా పెడదాము అనుకుంటాను. ఈలోగా మర్చిపోతాను కూడా చాలాసార్లు. అలా జరుగుతుందనే తొందర్లో అలా వెంటనే కామెంట్ పెట్టెస్తారేమో?

మాలతి: అలా అనిపించడంలో తప్పులేదు. ఆలోచించి వ్యాఖ్యలు పెట్టేవారికోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను. లేకపోతే బాగుందనో, పరవాలేదనో సరిపెట్టేసినా ఫరవాలేదు. కానీ సగం సగం చదివి, వ్యాఖ్యలు రాసేస్తే ఏం చెయ్యడం? తప్పనిసరిగా నేను కథలో ఫలానా చోట చూడండి మీకు సమాధానం కనిపిస్తుంది అని చెప్పాలి. అసలు పాఠకులకి ఎందుకింత తొందర? ఇక్కడే బ్లాగులోకంలో పాఠకులధోరణి వేరుగా కనిపిస్తున్నది. రచయిత రాసింది అర్థం చేసుకుందాం అన్నతపన కంటే తమకి తెలిసింది చెప్పాలన్న తపన ఎక్కువేమో అనుకుంటున్నాను నేను. నాచిన్నతనంలో మేం రచయిత ఏం చెప్పేడు అన్న దృష్టితో చదివేవాళ్లం. కొత్తవిషయం తెలిస్తే ఓహో అలాగా అనుకునేవాళ్లం. లేకపోతే, సరే అని మరోకథకి తరలిపోయేవాళ్లం. ఈనాటి మీడియా సౌకర్యంవల్ల క్షణాలమీద ప్రశ్నలు గుప్పించేయడం జరుగుతోంది. రెండోది వస్తున్న కథలసంఖ్య కూడాను. వారానికి కొన్నివందలకథలు విడుదల అవుతుంటే, అందులో పదోవంతయినా చదివి ఆలోచించుకునే తీరికేదీ?

కల్పన: కాబట్టి ఎక్కువ కధలు రావడం ఒకందుకు మంచిది, ఒకందుకు చెరుపు చేస్తోందన్న మాట.
మాలతిః అలాగే వుంది చూస్తుంటే. కనీసం పాఠకులకి ఆలోచించుకునే వ్యవధి లేకుండా చేస్తున్నాయి అనాలి. ఆదృష్టితో చూస్తే, నాకు మరొకసందేహం వస్తోంది. కథలకి సాంఘికప్రయోజనం వుండాలి అనుకుంటే, గబగబ క్షణాలమీద చదివి పక్కన పెట్టేస్తే మనం ఆశించిన సాంఘికప్రయోజం ఎలా సాధ్యం? పాఠకులు ఆలోచించుకోడం, విశ్లేషించుకోడం, తమ జీవితాలకి అన్వయించుకోడం – ఇవన్నీ టైము వుంటేనే కదా సాధ్యం.
అసలు ఎలాటి కథలు వస్తున్నాయి, ఏవి “మంచికథలు” అని ఎవరు నిర్ణయిస్తున్నారు అన్నవిషయం వివరంగా మరోసారి చర్చించాలి మనం..
(సశేషం)

http://pustakam.net/?p=1456

Read Full Post »

 
నా కవిత రహస్య వాన కు pavada blogger crazyfinger అనువాదం చేసారు. నా రహస్య వన కవిత నా బ్లాగ్ లొనే వుంది. ఇంగ్లిష్ అనువాదం ఇక్కడ చూడండి.

http://www.pavada.in/2009/10/rahasya-vaana-by-kalpana-rentala-english-version.html

Read Full Post »

సారీ వసంతా!

 9-10balagopal

బాలగోపాల్ కన్నుమూత–ఒక నమ్మలేని నిజం. మానవ హక్కుల కోసం నిరంతరం శ్రమించి ఇక సెలవంటూ చెరగని సంతకం పెట్టి వెళ్ళిపోయిన ఆత్మీయ మిత్రుడు బాలగోపాల్ మరణం సామాజికం గా ఒక పెద్ద లోటే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాకు, అఫ్సర్ కి  ఒక పెద్ద షాక్.

బాలగోపాల్ సహచరి వసంత నాకున్న మంచి స్నేహితుల్లో ఒకరు. విజయవాడ నుంచో, అనంతపురం నుంచో హైదరాబాద్  వెళితే మా మకాం వసంత ఇంట్లోనే. అప్పుడు బాలగోపాల్ తో ఎన్నో వ్యక్తిగత జ్ఞాపకాలు. బాలగోపాల్ ఉద్యమ జీవితం గురించి, పీడిత ప్రజల పట్ల ఆయన నిబధ్ధత గురించి పత్రికల్లో వివరంగా వ్యాసాలు వచ్చాయి. కాబట్టి ప్రత్యేకంగా నేనిక్కడ మళ్ళీ రాయనక్కరలేదు. నాకు బాలగోపాల్  కుటుంబంతో వున్న వ్యక్తిగత జ్ఞాపకాలు కొన్ని పంచుకోవటం నాకు దుఖ్ఖోపశాంతి.

నాకు, వసంత ల మధ్య స్నేహం ఎన్నో ఏళ్ళది. ఇన్నేళ్ళ స్నేహంలో ఎన్నొ మరణ వార్తల్ని ఇద్దరం కలిసి పంచుకున్నాము. మా సహచర జర్నలిస్టు మిత్రులు అర్ధాంతరం గా కన్ను మూసినప్పుడు ఎన్నో సార్లు కలిసి బాధపడ్డాము. అలాంటిది ఇప్పుడు తనకే ఒక దుఖ్ఖం వచ్చినప్పుడు నేను తన దగ్గర లేకపోవటం, ఇంత దూరం నుంచి కేవలం ఫొను లో నాలుగు పొడిపొడి మాటలు మాట్లాడటం కూడా సాధ్యపడలేదు. సహచరుడ్ని  పోగొట్టుకున్న స్నేహితురాలిని పొదివి పట్టుకోవాలని ఎవరికి వుండదు? వాళ్ళ అబ్బాయి అజుబా  ఇంటర్ చదువుతున్నా, వాడిలోని ఆ పసితనపు ఛాయలు  ఈ దుఖ్ఖాన్ని ఎలా తట్టుకుంటాయా అని మా ఆవేదన.

మంచి సంప్రదాయ పండిత వంశంలో పుట్టి కూడా, ఆ వారసత్వాన్ని, ఆ ఛాందస భావాల్ని వదిలించుకొని ఆశయాల్ని, ఆదర్శాల్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన మనీషి మన బాలగోపాల్.బాలగోపాల్ కి తన వ్యక్తిగత జీవితమంటే లెక్క లేదు, తనకేమైనా పర్వాలేదు, తాను నమ్మిన సిధ్ధాంతం, తననే నమ్ముకున్న బాధితులే ఆయనకు ముఖ్యం. అప్పటి స్పీకర్ బాలయోగి విమాన ప్రమాదం లో మరణించినప్పుడు మేమంతా వసంత ఇంట్లో మాట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో పొరపాటున నా మాటల్లో బాలయోగి అనబోయి బాలగోపాల్ అని వచ్చేసింది. వెంటనే సారి చెప్పి సరిదిద్దుకున్నాను.అయితే అప్పుడు బాలగోపాల్ అన్న మాట ఏమిటో తెలుసా…సారి ఎందుకు? నన్ను కూడా ఎప్పుడో ఒకప్పుడు చంపేస్తారని నాకు తెలుసు అని తాపీగా, నిశ్చింతగా అనేసారు. ఆ మాట విని నేను దిగ్భ్రాంతి చెందాను. ఆయనకు మరణం అంటే లెక్కలేనిది అని చాలా మాములుగా ఎందరి గురించో అనేస్తుంటాము. కాని నిజానికి ఆ సందర్భం వస్తే ప్రతి ఒక్కరు ఎంతో కొంత జంకుతారు. కాని ఆ రోజు ఆయన నాతో అన్నట్లు గానే నిర్భయం గా , కష్టసుఖాల్లో తనతో కలిసి నడిచిన తన సహచరి వసంతకి , తను అమితంగా ప్రేమించే కొడుకు అజుబా కి ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయారు.

మిమ్మల్నే   నమ్ముకున్న  మీ కుటుంబ సభ్యులు, బాధిత  ప్రజానీకం  ఏమైపోతారిప్పుడు బాలగోపాల్? మా జ్ఞాపకాల్లో మీరిప్పుడు  ఇంకా అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఆవేశం గా మానవ హక్కుల గురించి ప్రసంగిస్తున్నట్లే వుంది. మీ ప్రసంగాల్లో మీరు వాడే బాష ( వైమనస్కం) లాంటి పదాల మీద నేనింకా మీ ఇంట్లో జోకులేసి మాట్లాడుతున్నట్లే వుంది. మేమేమంటున్నా మీరు  పట్టించుకోనట్లు చిరునవ్వుతో అజుబా గాడి చేత హొం వర్క్ చేయిస్తున్న దృశ్యమే కళ్ళల్లో మెదులుతోంది. హోం వర్క్ అంటే ఒకటి చెప్పాలనిపిస్తోంది. సాధారణం గా బాలాగోపాల్ ఏ వీకెండ్ హైదరాబాద్ లో వుండరు.ఆ మాటకొస్తే అసలు ఆయన్ ఇంట్లో వుండేదే తక్కువ. కుటుంబం కోసం, వ్యక్తిగత సుఖసంతోషాల కోసం ఆయన వెచ్చించే సమయం చాల తక్కువ అన్నది ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు.  వీకెండ్, సెలవు రోజుల్లోనే కాదు, విడిరోజుల్లో కూడా ఆయన కోసం వచ్చే మనుషులతో , ఫోన్లతో బిజీ బిజీ గా వుంటారు. అంత బిజిలో కూడా ఆయన తప్పకుండా చేసే పనులు నాకు తెలిసినవి రెండు. ఒకటి పొద్దుట నిద్ర లేవగానే వసంత కి కాఫి పెట్టి ఇవ్వటం, రెండొది అజుబాకి తనే లెక్కలు మొదలైన హొం వర్క్ చేయించటం. ఎంత మేధావి ఇంట్లొ, బయటా ఎంత సామాన్యం గా వుంటారు అని నాలాంటి వారెందరో ఆశ్చర్యపోతారు ఆయనను చూసి.

మొన్నామధ్య నేను, వసంత ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు ఈ సారి మేము ఇండియా వస్తే ఏమేమి  చేయాలో ప్లాన్లు వేసుకున్నాము. కొత్త కొత్త ప్లేసెస్ వెళ్ళి చూద్దామని, అలాగే ఈ సారి వాళ్ళ ఇంట్లో నాకొచ్చిన శాఖాహరపు వంటలు చేసి పెట్టాలని వంతులు వేసుకున్నాము. ఈ సారి మేము మీ ఇంటికి వచ్చినప్పుడు నిరంతర చైతన్య స్రవంతి లా అటు ఇటు క్షణం కూర్చోకుండా తిరిగే బాలగోపాల్ ఇక వుండడని మనసు కి సర్ది చెప్పుకోవాలి. నిలువెత్తు పుస్తకాల మధ్య , నిరంతరం ఎవరి ఒకరితో సంభాషించే ఆ మనిషి లేకుండా ఆ కుర్చీ ఆయన కోసం ఎదురుచూస్తూ వుంటుంది కాబోలు….

వసంతా! ఇప్పుడు ఈ క్షణంలో మేము హైదరాబాద్ లో మీ ఇంట్లో నీ పక్కన వుండాల్సిన వాళ్ళం ఇక్కడ ఆస్టిన్ లోనో, డల్లాస్ లోనో బాలగోపాల్ సంతాపసభ పెట్టగలమా అన్న ఆలోచనల్లో వున్నాము. ఎవరి మరణ వార్త విన్నా నీకు ఫోన్ చేసి మాట్లాడే నేను ఇప్పుడు మాత్రం ఈ సమయంలో నీకు ఫోన్ చేయలేక, ఫోన్ చేయకుండా వుండలేక అస్థిమితంగా వున్నాను.సారీ వసంతా!.

Read Full Post »