Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for the ‘కథ’ Category

తెలుగు కధల గురించి నిడదవోలు మాలతి గారితో నా చాట్ ‘పుస్తకం ‘ లో ఇప్పటికే ప్రచురితమైంది. అది మళ్ళీ ఇక్కడ రెండు భాగాల్లో…

కథావిమర్శ (చర్చ)-మొదటిభాగం: రచయితలూ, పాఠకులూ
(ఈ చర్చ ప్రముఖ రచయిత్రులు, బ్లాగర్లు అయిన నిడదవోలు మాలతి గారికీ, కల్పన రెంటాల గారికీ మధ్య జరిగింది. పుస్తకం.నెట్ కోసం అడగ్గానే ఒప్పుకుని ఈ చర్చ జరిపినందుకు వారిద్దరికీ మా తరపున ధన్యవాదాలు. ఈ చర్చ రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగం – “రచయితలూ,పాఠకులూ” ఇప్పుడు వేస్తున్నాము. రెండో భాగం త్వరలో. – పుస్తకం.నెట్)
మాలతిః కల్పనా, అసలు రచయిత, నువ్వే అనుకో, కథ కానీ కవిత కానీ నీకోసం రాసుకుంటావా, పాఠకులని దృష్టిలో పెట్టుకుని రాస్తావా?
కల్పన: మాలతిగారు, నేనైతే మొదట నాకోసమే రాసుకుంటాను. అయితే అది ప్రచురణకు పంపితే మాత్రం తప్పకుండా పాఠకులగురించి కూడా ఆలోచిస్తాను. వాళ్ళు దీన్ని ఎలా స్వీకరిస్తారు అని.
మాలతిః నేను నాకు ఏదో రాయాలన్న తపన కలగడంచేత రాస్తాను. మరి “పాఠకులకోసం” అన్నది కనీసం నావిషయంలో, పూర్వం లేదు. ఇప్పుడు బ్లాగు మొదలుపెట్టినతరవాత, కొందరు పాఠకులు తప్పనిసరిగా మనసులో మెదులుతున్నారు. ప్రచురణకి పనికివస్తుందా రాదా అన్నఆలోచన లేదనే అంటాను నాకైతే. బహుశా వాళ్లు ప్రచురించకపోతే నేనే ప్రచురించుకుంటాను అన్న ధీమా కావచ్చు. ప్రతి కథకీ కొందరు పాఠకులు వుండకపోరు అని కూడా నానమ్మకం. మరి కవితలు కూడా అంతేనా నీవిషయంలో?
కల్పన: కొంతలో కొంత, కథ వేరు, కవిత వేరు అనుకుంటాను. కవిత మాత్రం ఎప్పుడూ మొదట మనకోసమే రాసుకుంటాము. కధ మాత్రం ప్రధానంగా సమాజం నుంచి పుడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇది చదివినవాళ్లకు ఈకధ ఏమనిపిస్తుంది? ఎలా అర్ధం చేసుకుంటారు? లాంటివి తెలిసి కాని, తెలియకుండానే కాని ఆలోచిస్తామని నేను అనుకుంటాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే కధ రాసేటప్పుడు నేను రచయతని. నా కధను నేనే విమర్శించుకునేటప్పుడు నేనే విమర్శకురాలిని. ఆ తర్వాత నేనే పాఠకురాలినైతే ఈ కధ ఎలా అనిపిస్తుంది అని కూడా ఆలోచిస్తాను. మూడు చోట్లా సంతృప్తి కలగటం అనేది వుండకపోవచ్చు. అలాంటప్పుడు నేను రచయత పాత్రకే కట్టుబడి అవసరమైనమార్పులు చేసుకుంటాను. కధ రాసేటప్పుడు నాపాత్ర అదే. అసలు రాజాస్థానాలు, పత్రికలూ, ప్రచురణలు, బ్లాగులు లేనప్పుడు రచయితలు ఎలా ఆలోచించి వుండేవారనుకుంటున్నారు?
మాలతి: మంచి ప్రశ్నే. నువ్వన్నట్టు కథ వేరూ, కవిత్వం వేరూ అంటే వాటిని వేరేరకంగా ఆలోచించాలి. ఉదా. వేమన … అలాకాక, కథలు పెద్దవాళ్లు పిల్లలకి లోకరీతి నేర్పడానికి మొదలుపెట్టేరేమో. అంటే అవే ఆనాటి వ్యక్తివికాసంపాఠాలు అన్నమాట. మరి పాఠకులకోసమే అనుకుంటే, నువ్వు నీకథలని వాళ్ల అభిప్రాయాలకి అనుగుణంగా మారుస్తావా?
కల్పనః వేమన అయినా సుమతీశతకకారుడైనా తమకోసం మాత్రమే రాసుకుని వుంటారని నేననుకోను. లోకానికి చెప్పటంకోసం కూడా రాసి వుంటారు.. అది కూడా ఎవరోఒకరికి చదివి వినిపించటం, అలా మౌఖికంగా సాహిత్య ప్రచారం ఆ రోజుల్లో జరిగేది కాబట్టి పాపం వాళ్లకు పాఠకుల కామెంట్లగొడవ లేదేమో. అలాగే కధ ప్రయోజనం మొదటినుంచి కూడా సమాజం పోకడల్ని చెప్పటమో, నీతిని బోధించటమో అయివుండవచ్చు. ఆరోజుల్లో అది పర్సనల్ డెవలప్మెంట్ అయినా ఇప్పుడు కధ స్వరూపం, ప్రయోజనం కూడా మారాయి కదా. మరి కథగురించి మన ఆలోచనలు మారాల్సిన పని లేదా?
మాలతి: కథప్రయోజనం ఎలా మారిందంటావు? స్వరూపం మారినట్టు కనిపించినా అది పైపైమార్పే అంటాన్నేను. ఆరోజుల్లోనూ ఈరీోజుల్లోనూ కూడా కథకుడు తనభాషలో తనధోరణిలో చెప్పడమే కదా. ఎటోచ్చీ, సంపాదకులూ, ప్రచురణకర్తలూ లేనిరోజుల్లో నిబంధనలు కూడా లేవు. అంచేత రచయితకి ఎక్కువ స్వేచ్ఛ వుండేది అప్పట్లో.
కల్పన: ఇదివరకు కధకి సామాజికప్రయోజనమే మొదటిలక్ష్యం, బహుశా అదొక్కటే లక్ష్యం కూడా అయివుండవచ్చు. అప్పుడు కూడా అది రచయతని బట్టే వుంటుందనుకుంటాను.. అయితే కాలానుగుణంగా అది ఎంతో కొంత మారింది. ముఖ్యంగా అస్తిత్వచైతన్యం వచ్చాకా.
మాలతి : అస్తిత్వం, చైతన్యం ఒక భావన. దానిఆంతర్యం కూడా వ్యక్తివికాసమే కదా.
కల్పన: అస్తిత్వం, చైతన్యం ఇవి వ్యక్తిత్వవికాసంలో భాగమే.. అయితే వ్యక్తీకరణలో తేడా వుంటుంది కదా! స్త్రీలు, దళుతులు, ముస్లిమ్‌లు తమబాధల్ని, తమగాధల్ని చెప్పుకుంటున్నప్పుడు అందరికీ నచ్చినా, నచ్చకపోయినా వాళ్ళవేదనని చెప్పితీరతారు. చెప్పితీరాలి. మొదటినుంచి సాహిత్య ప్రయోజనమ్ సామాజికప్రయోజనమే అయినా రచయితలు సామాజికప్రయోజనం కోసమ్ రాసినా, వాళ్ళ ఇష్టాఇష్టాలు, వాళ్ళ స్వేచ్ఛ అంతర్లీనంగానైనా వాడుకునేవారు.
మాలతి : మరొకమాట అడుగుతాను. నువ్వు కథ రాసినప్పుడు కొందరయినా అఫెండ్ అవుతారేమో అనుకుని మార్పులు ఏమైనా చేస్తావా, నీకు ఏం రాయాలని వుందో అదే యథాతథంగా రాస్తావా?
కల్పన: ఎవరో బాధపడతారని నేను కధ మార్చిన సందర్భాలు లేవు కాని మధ్యతరగతినుండి రావడంవల్లనేమో మొదట నాకు నా కుటుంబసభ్యులు మాత్రం గుర్తు వస్తారు. మా అన్నయ్యలు, తమ్ముడు, అక్కచెల్లెళ్ళు, బంధువులు ఈ కధ చదివి ఎలా మాట్లాడతారో మాత్రం నాకు ఠక్కున తెలిసిపోతుంది. అదొకరకమైన అప్రకటిత censorship. ఈ సెన్సార్ షిప్ కుటుంబం ఒక్క దాని నుంచే కాకుండా సామాజికంగా కూడా వుంటుంది. స్త్రీలుగా ఎలాంటి విషయాలగురించి రాయవచ్చు, రాయకూడదు, ఏవిధంగా వ్యక్తీకరించవచ్చు లాంటివి. మొదట్లో అది నామీద చాలా ప్రభావం చూపించేది. చాలా విషయాలు రాయడానికి సంకోచించేదాన్ని. క్రమేపి దాన్ని అధిగమించాననే అనుకుంటున్నాను. ఆరకంగా కొన్ని మార్పులు రాసేటప్పుడో, ఆ తర్వాతో మనం తెలిసి కాని, తెలియకుండానో కాని చేసేస్తుంటాము. అది ఇతివృత్తాన్ని, రచయితనిబట్టి కూడా వుంటుంది.
మాలతి: నా అభిప్రాయం కూడా అదే. చెప్పేతీరులో మార్పు వుంటుందేమో కానీ ప్రాథమికంగా చెప్పదలుచుకున్నవిషయంలో మార్పు వుండదనే అనుకుంటాను. పైగా నువ్వన్నట్టు కుటుంబసభ్యులూ, స్నేహితులూ ఈకథని ఎలా స్వీకరిస్తారన్న ఆలోచన నాక్కూడా కొంతవరకూ ఉండొచ్చు. గట్టిగా చెప్పలేను. ఒకవిధంగా చెప్పాలంటే నిజజీవితంలోమాటాడినప్పుడు తూచి మాటాడినట్టే రాసినప్పుడు కూడానేమో. నాకు మరో సందేహం. రచయిత తనకథని మరొకరికథ విమర్శిస్తున్నంత నిష్పాక్షికంగా విమర్శించుకోగలడా అని.
కల్పన: నేను అయితే నో అనే సమాధానమిస్తాను. ఎవరికధగురించి వాళ్ళకు తెలిసినట్టుగా వేరేవాళ్లకధగురించి తెలియదు. మీకధ నాకు నాస్థాయినిబట్టి అర్ధమవుతుంది. నాకు మీకధ అర్ధమ్ చేసుకునే స్థాయి లేకపోతే నాకు ఆకధ అర్ధంకాదు. అందుకని కూడా పాఠకులు వివిధస్థాయిల్లో వుంటారు కాబట్టి వాళ్ళందరికి అర్ధమయ్యేలా, లేదా వాళ్ళందరిమెప్పుకోసం కధ రాయాలని యే రచయితా ప్రయత్నించరు.
మాలతి: నామటుకు నేను నాకథ పదే పదే చదువుకుంటాను. అది ఇప్పుడు వచ్చిన అలవాటేలే. పూర్వం రాసింది రాసినట్టు పంపేయడమే. ఇప్పుడు చదువుకోడం వచ్చేక, అలా చదువుకుంటున్నప్పుడు ఎక్కడ బాగులేదు. ఎక్కడ మరింత స్పష్టం చెయ్యాలి అన్నఆలోచనలు వస్తున్నాయి. నేనంటున్నది అది కూడా ఒకరకంగా స్వవిమర్శే కదా. అస్సలు బాగులేదు అనుకుని పక్కన పెట్టేసేవి కూడా వుంటాయి. నువ్వు స్థాయి అంటున్నావు. నేను అనుభవాలూ, పరిస్థితులూ, వారి ఆలోచనాధోరణిలో గల పరిమితులు అనుకుంటాను. అంతేనా?
కల్పన: మీరన్న అనుభవాలు, పరిస్థితులు, అవగాహన, వీటినే నేను స్థాయి అన్నాను. తక్కువ, ఎక్కువ అన్న వుద్దేశంతో మాత్రం కాదు. మీరు మీకోసమే కధ రాస్తాను అన్నారు. కాని బ్లాగులో రాయడం మొదలుపెట్టాక మీరు కధ రాసేటప్పుడు అంతకుముందు కధకి పాఠకులవ్యాఖ్యలు ఏదో ఒకరకంగా మీమీద ప్రభావాన్ని చూపిస్తాయి అని నేననుకుంటాను. అలా మీకు తెలిసి మీకధలో మీకు మీరుగా ఏం మార్పులు చేసారు? అలా మార్పులు చెయడంవల్ల మీకధ మంచి మార్పుకి గురైందా? లేక వాళ్ళవల్ల మీకధ మీరు అనుకున్న విధంగా కాకుండా మరో రకంగా రాయాల్సి వచ్చిందా? అసలు ఈకధల్లో వస్తున్న మార్పులకు పాఠకులు ఎంతవరకు కారణం? అని మీరనుకుంటున్నారు?
మాలతి: అమ్మో, పెద్ద ప్రశ్న వేసేవు. నేను బ్లాగు మొదలు పెట్టింతరవాత జరిగిందేమిటంటే – ఏదో పాతతరం రచయిత్రి అని కాకుండా, ఈనాటియువత నాకథలని ఆదరించడం. వాళ్లు రాసే వ్యాఖ్యలనిబట్టి కొంతవరకూ నేను చెప్పేతీరులో మార్పు వచ్చింది. వైదేహీ, రాధిక ఈమాటే అన్నారు. నేను కావాలని పనికట్టుకు చేసింది సంస్కృతసమాసాలూ, అవీ కాస్త తగ్గించడం :). అందువల్ల నాకథ మెరుగుపడిందా అంటే చెప్పడం కష్టం. ఈపాఠకులు వేరు. నిజానికి మంచి ఉదాహరణ నా ఉసుపోక కతలు చూడు. బ్లాగుపాఠకులు విశేషంగా ఆదరించారు ఆశీర్షికని. అదే ఆంధ్రాలో ఒక ప్రచురణకర్తకి మాఅన్నయ్య చూపిస్తే, అందులో హాస్యం లేదండీ అన్నారుట. అంటే వారిదృష్టిలో ప్రింటుపుస్తకాలు చదివే పాఠకులని ఆకర్షించగల హాస్యం కాదనే కదా. ఈనాడు కథల్లో వస్తున్నమార్పులకి ఎక్కువగా బాధ్యులు ఇంగ్లీషుపుస్తకాలు చదివి ఆ ఒరవడిలో ఆలోచించే పాఠకులు. వీరిలో కొందరికి అసహనంపాలు కూడా ఎక్కువే అనిపిస్తుంది ఒకొకప్పుడు. వెనక ఒకసారి ఒక పాఠకుడు “మాకు అర్థంఅయేలా రాయండి చదువుతాం”, అన్నారు నాకథగురించి. ఇలాటి వ్యాఖ్యలు చేసి పాఠకులు నారచనావిధానంలో మార్పు తేలేరు. నిజానికి నారచనావిధానంలో, నాశైలిలో మార్పులు ఏమైనా వుంటే, దానికి కారణం నా వ్యక్తిగతపరిస్థితులూ, నాచుట్టూ వున్న పరిస్థితులే అని చెప్పాలి.
కల్పన: అంటే మీభాషలో మార్పు వచ్చింది అంటారు. మీరు చెప్పేది పాఠకులకు అర్థం కావాలంటే వాళ్ళకు ఎలా చెపితే అర్థం అవుతుందో అలాగే చెప్పాలి అంటారు. మీదగ్గర పాతతరానికి సంబంధించిన మంచి భాష,నుడికారం వున్నాయి. కాని, అవి వీళ్ళకు పెద్దగా అర్థం కాదు కాబట్టి వాళ్ళకోసం మీరు అందరికి అర్ధమయ్యే భాష రాయాల్సివచ్చింది. మీ కొత్త కధ ’నీ కోసం’ లో కూడా చాలా మంచి పదాలున్నాయి ఈనాటితరంవాళ్లకు తెలిసే అవకాశం లేనివి. ఔద్ధత్యంలాంటివి.
పాఠకులు మీరచనావిధానంలో మార్పు తేలేరు అని మీరు స్పష్టం చేయటం నాకు నచ్చింది. అయితే మీరు ఇక్కడ ప్రధానంగా బ్లాగ్ పాఠకుల గురించి మాట్లాడుతున్నరనుకోండి. అయినా ఇంతకుముందు భారతి టైం నుంచి మొన్న మొన్నటి అంధ్రజ్యోతి లాంటి వారపత్రికల్లో కధల ప్రచురణవరకు తీసుకొని చూస్తే, చాలా తేడా తెలుస్తుంది. భారతి లాంటి పత్రికల్లో కధ ప్రచురించటమంటేనే అది మంచి కధ అని గుర్తింపు. అలాగే అందులో రాసే రచయితలకు ఒక గుర్తింపు, ఒక స్థాయి వుండేది. క్లుప్తం గా చెప్పాలంటే ఇదివరకు పత్రికల్లో ఎంపిక స్థాయి ఆరకంగా వుండేది. పాఠకులఆలోచనలు కూడా భిన్నంగా వుండేవి. అలాగే వారు చదివిన కధలమీద నచ్చినా, నచ్చకపోయినా పత్రికలకు ఉత్తరాలు రాసేవారు. అంటే కధగురించి ఆలోచించి ఏది బాగుందో, ఏది బాగులేదో ఉత్తరాలు రాసేవారు. ఇలాంటి లేఖలద్వారా కాని, లేదా రచయితలు ఒకరికొకరు రాసుకోవడంద్వారా తమ రచనలమీద అభిప్రాయాలు తెలుసుకోగలిగేవారు. కాని ఇప్పుడు ఈ బ్లాగులవల్ల పాఠకులు ఏమనుకుంటున్నారో, మనకు తెల్లారేసరికి తెలిసిపోతోంది. పత్రికల్లోకంటే బ్లాగులద్వారా ఎక్కువమంది పాఠకులకు మనం చేరుకోగలగటం మాత్రం శుభపరిణామమే.
మాలతిః “పెద్దగా అర్థం కాదు” అనడంలేదు నేను. వారిదృష్టిని అట్టే ఆకట్టుకోదు అనుకుంటాను. ఈనాటిపాఠకులు instant lifeకి అలవాటు పడ్డవారు. ఆలోచించుకునే ఓపిక లేక, ప్రతిదీ స్పష్టంగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు అందించమంటారు. అంచేత పూర్వం మనకథల్లో వున్న ధ్వనీ, వక్రోక్తీ ఇప్పటికథలలో కనిపించదు. ఒకవేళ నాలాటివాళ్లం రాసినా, పాఠకులు వెంటనే ఇది నాకు అర్థం కాలేదు, అంటూ వ్యాఖ్యలు కురిపించేస్తారు. పైగా ఇంగ్లీషుమాటలవాడకం మరోబాధ. చాలామందికి అదే “కంఫర్టబుల్‌గా” వుంటుంది ☺. నేను మాత్రం తెలుగుకథ అంటే తెలుగు నుడికారం వెదజల్లేదే అనుకుంటాను. రచయితలు పాఠకులవ్యాఖ్యలని సీరియస్‌గా తీసుకోవాలంటే, మరి వారు కథని జాగ్రత్తగా చదివి తమఅభిప్రాయాలు రాయాలని రచయితలు ఆశించడంలో తప్పు లేదు కదా. ఏమంటావు?
కల్పన: ధ్వని, వక్రోక్తి ఇవి ఈనాటి కధల్లో వినిపించవు, కనిపించవు. ఆమాటకొస్తే అసలు అవి ఎలా వాడాలో కూడా నాలాంటి వర్ధమానరచయితలకి తెలియదు. మీకాలపు రచయితలు అలాంటివాటితో ఈనాటి కధలు రాయడం మా అదృష్టం అనుకుంటాను. మీకధా రచన, నైపుణ్యం, భాష మాకు కూడా కాస్త ఇలా ఒక చేత్తో ధారపోయవచ్చు కదా. కాస్త జాగ్రత్తగా కధ చదివి, ఆ పైన ఆలోచించి కామెంట్ పెట్టండి అని అంటే అర్ధం చేసుకునే సహృదయత ఈనాటి బ్లాగ్ పాఠకులకు వుందంటారా?
మాలతి: చేత్తో ధారపోయవచ్చు కదా – హాహా. మంచి జోకే. తాతకి దగ్గులు నేర్పడం అంటే ఇదే.
పాఠకులవ్యాఖ్యలవిషయం – అదే నేను కూడా అంటున్నది. పూర్తిగా కథ చదివి, ఆలోచించి రాసే వ్యాఖ్యలని రచయితలు తప్పకుండా గణనలోకి తీసుకుంటారు. “రచయితలు మెప్పు అయితేనే గ్రహిస్తారు కానీ తప్పులు చూపితే ఒప్పుకోరు” అన్నమాట నేను అంగీకరించను. వ్యాఖ్యలు కథలో వస్తువుకో, శైలికో సంబంధించినవి అయితే రచయితకి తనకథని మరోసారి తరిచి చూసుకోడానికి ఆవకాశం వుంటుంది. అంతే కానీ “ఇలాటిపాత్రలు వుండరు”, “ఇలాటి సంఘటనలు జరగవు,” “ఎవరూ ఇలా మాట్లాడరు” అంటే దానికి ఏముంది జవాబు చెప్పడానికి. రచయిత అలాటి పాత్రో, సంఘటనో చూసినందువల్లనే కదా రాసింది.

కల్పన: ఒక కధ చదివాక, పట్టుమని ఎవరైనా పది నిమషాలైనా ఏమిటి ఇందులో చెప్పింది? చెప్పాలనుకుంది? అని ఎవరైనా ఆలోచిస్తారంటారా? వూరికే నాసందేహం అది. ఎందుకంటే నేను చదవగానే కామెంట్ పెట్టలేను. ఆలోచించాకా పెడదాము అనుకుంటాను. ఈలోగా మర్చిపోతాను కూడా చాలాసార్లు. అలా జరుగుతుందనే తొందర్లో అలా వెంటనే కామెంట్ పెట్టెస్తారేమో?

మాలతి: అలా అనిపించడంలో తప్పులేదు. ఆలోచించి వ్యాఖ్యలు పెట్టేవారికోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను. లేకపోతే బాగుందనో, పరవాలేదనో సరిపెట్టేసినా ఫరవాలేదు. కానీ సగం సగం చదివి, వ్యాఖ్యలు రాసేస్తే ఏం చెయ్యడం? తప్పనిసరిగా నేను కథలో ఫలానా చోట చూడండి మీకు సమాధానం కనిపిస్తుంది అని చెప్పాలి. అసలు పాఠకులకి ఎందుకింత తొందర? ఇక్కడే బ్లాగులోకంలో పాఠకులధోరణి వేరుగా కనిపిస్తున్నది. రచయిత రాసింది అర్థం చేసుకుందాం అన్నతపన కంటే తమకి తెలిసింది చెప్పాలన్న తపన ఎక్కువేమో అనుకుంటున్నాను నేను. నాచిన్నతనంలో మేం రచయిత ఏం చెప్పేడు అన్న దృష్టితో చదివేవాళ్లం. కొత్తవిషయం తెలిస్తే ఓహో అలాగా అనుకునేవాళ్లం. లేకపోతే, సరే అని మరోకథకి తరలిపోయేవాళ్లం. ఈనాటి మీడియా సౌకర్యంవల్ల క్షణాలమీద ప్రశ్నలు గుప్పించేయడం జరుగుతోంది. రెండోది వస్తున్న కథలసంఖ్య కూడాను. వారానికి కొన్నివందలకథలు విడుదల అవుతుంటే, అందులో పదోవంతయినా చదివి ఆలోచించుకునే తీరికేదీ?

కల్పన: కాబట్టి ఎక్కువ కధలు రావడం ఒకందుకు మంచిది, ఒకందుకు చెరుపు చేస్తోందన్న మాట.
మాలతిః అలాగే వుంది చూస్తుంటే. కనీసం పాఠకులకి ఆలోచించుకునే వ్యవధి లేకుండా చేస్తున్నాయి అనాలి. ఆదృష్టితో చూస్తే, నాకు మరొకసందేహం వస్తోంది. కథలకి సాంఘికప్రయోజనం వుండాలి అనుకుంటే, గబగబ క్షణాలమీద చదివి పక్కన పెట్టేస్తే మనం ఆశించిన సాంఘికప్రయోజం ఎలా సాధ్యం? పాఠకులు ఆలోచించుకోడం, విశ్లేషించుకోడం, తమ జీవితాలకి అన్వయించుకోడం – ఇవన్నీ టైము వుంటేనే కదా సాధ్యం.
అసలు ఎలాటి కథలు వస్తున్నాయి, ఏవి “మంచికథలు” అని ఎవరు నిర్ణయిస్తున్నారు అన్నవిషయం వివరంగా మరోసారి చర్చించాలి మనం..
(సశేషం)

http://pustakam.net/?p=1456

ప్రకటనలు

Read Full Post »

అయిదో గోడ

నా కధ అయిదో గోడ వంగూరి ఫౌండేషన్ పోటీల్లో ప్రధమ బహుమతి పొందిది. కౌముదిలొ ప్రచురితమైన ఆ కధ తాలుకూ లింక్ ఇది.

http://www.koumudi.net/Monthly/2009/june/june_2009_kadhakoumudi_3.pdf

http://www.koumudi.net/Monthly/2009/june/june_2009_kadhakoumudi_3.pdf

Read Full Post »

 

అసలు బిడ్డలకు వలెనే కథలకు కూడా మాతృత్వం మాది అంటుంది కనుపర్తి వరలక్షమ్మగారి కథలోని రాజేశ్వరి (కథ ఎట్లా వుండాలె?) దాదాపు ’75,’80 ఏళ్ళ క్రితమే స్త్రీవాదం అన్న పేరు కూడా వినిపించని కాలంలోకథ చెప్పటం మా జన్మహక్కు అని ఆమె సగర్వంగా ప్రకటించింది.

 

అనగనగా అంటూ అమ్మమ్మ చెప్పిన కథతో స్తీలకథ మొదలైందని చెప్పవచ్చు. రాక్షసుడ్ని చంపేసిన రాజకుమారుడి చుట్టూ అల్లుకున్న రాకుమారి అందమైన ఊహల కథ.  రాకుమారుడో వచ్చి  యౌవన రెక్కల మీద ఎగరేసుకుపోతాడన్న ఊహల నుంచి రాకుమారుడ్ని పెళ్ళి  చేసుకోకుండానే వారసుల్ని కనగలిగే స్థాయికి ఎదిగింది నేటి కథల్లోని కథానాయిక. సైద్ధాంతికపరంగా మార్పుని స్త్రీవాద కథాపరిణామక్రమంగా చెప్పుకోవచ్చు.

 

సామాజిక చరిత్రకు సాహిత్యం దర్పణం లాంటిది. మానవ జీవనానికి కథ ప్రతిబింబంలాంటిది.  సమాజ పరిణామాలను  విమర్శనాత్మకంగా చూసినప్పుడు దాని తాలూకు ప్రతిబింబం మనకు సాహిత్య రూపాల్లో కనిపిస్తుంది. సాహిత్యానికి, సమాజానికి మధ్య వున్న ప్రతిఫలనం అవగాహన చేసుకున్నప్పుడు స్త్రీవాద సాహిత్యం కూడా సరిగ్గా అర్ధమవుతుంది.

 

తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యం తీవ్ర సంచలనాన్ని రేకేత్తించి అనేక వాద వివాదాలకు కారణమైన సంగతి అందరికీ తెలిసిందే. 1980 ల్లో స్త్రీవాద రచయిత్రులు  తమదైన స్వరంతో, భావ వ్యక్తీకరణలతో, కొత్త ఇతివృత్తాలతో, సరికొత్త భాషతో, పదచిత్రాలతో తిరుగుబాటు ప్రకటించారు. పితృస్వామ్యం, స్త్రీ, పురుష లైంగిక వివక్ష, స్త్రీల  అణచివేత, ఇంటి చాకిరీ మొదలైన విషయాల్ని స్తీవాదం చర్చల్లోకి తీసుకువచ్చింది. స్త్రీగా పుట్టడం వేరు,  స్త్రీగా తయారుచేయబడటం వేరు అన్న సంగతిని స్త్రీలు గుర్తించగలిగారు. తరతరాల సమాజం కోటానుకోట్ల మంది స్త్రీలను  తయారు చేసి వారిని విధంగా అదుపుచేయటాన్ని స్త్రీవాదులు నిలదీశారు. స్త్రీ, పురుష వివక్ష గురించి స్త్రీవాద రచయిత్రులు చైతన్య్వంతులై ప్రశ్నించారు. విధమైన ఆత్మచైతన్యాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతిబింబింపచేసే కథ, కవిత, నవలాసాహిత్యాన్ని  స్త్రీవాదులు సృజించారు.

 

మొదటి దశలో  రచయిత్రులకు , అతి కొద్దిమంది రచయితలకు పరిమితమైన స్తీవాదం క్రమంగా మొత్తం సమాజవాదంగా మారింది. ఇవాళ స్త్రీవాదం కేవలం స్త్రీలవాదమే కాదు, సమాజంలోని అన్నివర్గాల వారిది. స్త్రీ చైతన్యాన్ని, వ్యక్తిత్వాన్ని గౌరవించే స్త్రీ, పురుష పాత్రల్ని జండర్ భేదం లేకుండా అందరూ తమ రచనల్లో చిత్రిస్తున్నారు. దీన్ని స్త్రీవాదం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. అయితే మార్పు సమాజంలో ఆశించిన రీతిలో లేకపోయినప్పటికీ సాహిత్యంలో మాత్రం కనిపిస్తుంది. అయితే వ్యాసంలో ప్రధానంగా స్త్రీవాద రచయిత్రుల కథల్ని మాత్రమే చర్చకు తీసుకోవడం జరిగింది.

 

స్త్రీల జీవితాల గురించి, సమాజంలో స్తీల భాగస్వామ్యాన్ని గురించి రచయిత్రులు మొదటి నుంచీ కథలు రాస్తూనే ఉన్నారు. తమలోని స్త్రీత్వాన్ని నిర్వచించుకుంటూ రచయిత్రులు రాసిన కథలూ వున్నాయి. అయితే స్త్రీవాద కథ అన్నది మాత్రం ‘ 80 తర్వాత మాత్రమే కనిపించే భావన. ఇది  ప్రధానంగా సైద్ధాంతికపరమైన వృత్యాసాన్ని తీసుకువచ్చింది.  1902లో  వెలువడ్డ భండారు అచ్చమాంబ స్త్రీవిద్య కథనుండి మొదలుపెడితేమొదట స్త్రీ విద్యతోనే రచయిత్రుల కథ మొదలైంది. భర్త కోసం చదువుకుంది అచ్చమాంబ కథానాయిక. కథ ఇతివృత్తం అప్పటి సమాజ పరిస్థితులకు తగినట్టు వుంది. చదువుకోవడంతో మొదలైన స్త్రీ చైతన్యం నెమ్మదిగా  ఆర్ధిక స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, స్వాభిమానం, కుటుంబంలో, సమాజంలో సమానస్థానం, సమానహక్కుల గురించి మాట్లాడడం వరకూ వచ్చింది. సామాజికంగా స్త్రీలలో క్రమక్రమంగా  వచ్చిన చైతన్యానికి రచయిత్రుల సాహిత్యం దర్పణం పట్టింది.

  

మొదటి దశలో రచయిత్రుల కథల్లో కుటుంబంలో, సమాజంలో స్తీ,పురుష మధ్య అంతరాల్ని, వివక్షను అతి సహజ విషయంగా భావించగా స్త్రీవాదకథ వివక్షను పురుషాధిపత్యరాజకీయంగా  గుర్తించి ఎదిరించగలిగింది. అంటే ప్రధానంగా  స్త్రీలు రాసిన కథలకు, స్త్రీత్వపు గుర్తింపుతో రాసిన కథలకు, స్త్రీవాద కథలకు వున్న అంతరం సైద్ధాంతికపరమైంది. సైద్ధాంతికత సమాజంలో అణచివేతకు  గురైన అన్నివర్గాల స్త్రీలకు ప్రాతినిధ్యం వహించింది.

 

 

స్త్రీల సమస్యలు, స్త్రీ, పురుష సంబంధాలు, వివాహ వ్యవస్థలోని లొసుగులు వీటన్నింటి గురించి విస్తృతంగా చర్చించిన స్త్రీవాదులు ఇప్పుడు సమాజంతో పాటు కొత్త రూపు తీసుకుంటున్న సమస్యల  గురించి మాట్లాడుతున్నారు. గ్లోబలైజేషన్ ప్రభావంతో స్త్రీల జీవితాల్లో వస్తున్న మార్పుల్ని సునిశిత పరిశీలనతో చర్చకు పెడుతున్నారు. మారుతున్న పల్లెలు, పట్టణ స్వరూపాలు, కరవురక్కసి కాటుకు గురై చిద్రమవుతున్న మానవ సమబంధాలు, అంతరిస్తున్న కులవృత్తులు, జూదంగామారిన వ్యవసాయం, రాజకీయరంగాల్లో స్త్రీలపై కొనసాగే అణచివేత, స్త్రీలు ఎంచుకుంటున్న అకొత్త కెరియర్స్‌లోని మానసిక, శారీరక ఒత్తిడులు, మత విద్వేషాలు,, ప్రవాసం జీవితంలోని సంఘర్షణ ఇలా సమాజం విశ్వరూపాన్ని తమ కథల ద్వారా చర్చకు పెడుతున్నారు స్త్రీవాదులు.

 

ఓల్గా, కుప్పిలిపద్మ, గీతాంజలి, నల్లూరి రుక్మిణి, పి.సత్యవతి, వి.ప్రతిమ, కొండవీటి సత్యవతి, ముదిగంటి సుజాతారెడ్డి, సుభద్ర, ఎస్.జయ, సుబహాషిణీ, చంద్రలత, కె.వరలక్ష్మి, షాజహానా, , పుట్ల హేమలత, సి.సుజాత, నిర్మలారాణి, ఇంద్రగంటి జానకీబాల లాంటివాళ్ళు ఇటీవల రాస్తున్న కథల్ని చదివినప్పుడు, వారి కథల్లోని ఇతివృత్త వైవిధ్యాన్ని, శిల్ప పరిణితినీ్, పరిశీలిస్తే మనకు విషయం స్పష్టమవుతుంది.  

 

మొదట్లో శరీర రాజకీయాల గురించి మాట్లాడిన స్త్రీవాదులు ఇవాళ రాజకీయ, రాజ్యవ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. రాచపుండు, గంగజాతర (ప్రతిమ), ముందడుగు (కొండవీటి సత్యవతి) లాంటి కథలు రాజకీయరంగంలో స్త్రీలు పావులవుతున్న వైనాన్ని ప్రశ్నిస్తుండగా, కుబుసం (కుప్పిలి పద్మ), మంత్రనగరి (సత్యవతి), సాలెగూడు (ప్రతిమ), కొత్తకోర్సులొస్తున్నాయి జాగ్రత్త (సుభాషిణి) లాంటి కథలు గ్లొబలైజేషన్ వికృతస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కొత్త కొత్త కెరియర్స్ లో స్త్రీలపై మానసిక, శారీరక ఒత్తిడి ఎక్కువవటమే కాకుండా వారి వ్యక్తిత్వాలు ప్రశ్నార్ధకమవుతున్న తీరును సునిశితంగా ఎత్తి చూపిస్తాయి.

 

అవర్జా (చంద్రలత), సాలభంజిక (కుప్పిలిపద్మ) కథలు, వైవాహికేతర సంబంధాల్లో స్త్రీలు పడే మానసిక సంఘర్షణను, పల్లె జీవితంలోని వైరుధ్యాలను నల్లూరి రుక్మిణి కథలు చిత్రిస్తే, కరవు, ఫ్యాక్షనిజం భూతాల నోట్లో చిక్కుకున్న స్త్రీల  బతుకుల్లోని వేదనను చిత్రిస్తాయి. నిర్మలారాణి, రంగనాయకిల కథలు. స్త్రీలు మతపరమైన అణచివేతల్లొ కూరుకుపోతున్న విధానాన్ని షాజహానా, గీతాంజలి కథలు ఆగ్రహంతో ప్రశ్నిస్తుండగా, ఓల్గా రాసిన సమాగమం లాంటి కథలు పురాణ స్త్రీల మనోభావాలకు సరికొత్త వ్యాఖ్యానం  చేస్తాయి. ప్రవాస జీవితంలో స్త్రీలు పడే సంఘర్షణను చిత్రించే కథల్ని స్త్రీవాద కథల్లో భాగంగా చూడవచ్చు.

 

 

ప్రవాసాంధ్ర రచయిత్రుల్లో చాలామంది తమని తాము స్త్రీవాదులుగా ప్రకటించుకోకపోయినా వారి కథల్లోని స్త్రీ పాత్రల సంఘర్షణ, ప్రవాస జీవితంలోని వైరుధ్యాలను వారు చిత్రిస్తున్న తీరు స్త్రీవాదానికి మంచి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. నిడదవోలు మాలతి (చివురుకొమ్మ, చేవ, నిజానికీ ఫెమినిజానికీ మధ్య, డాలక్ర్‌కో గుప్పెడు రూకలు) శేషుశర్మ (అన్వేషన్ణ, అగాధం),  చినుటాకమల (అమెరికా ఇల్లాలు), ఉపాధ్యాయుల  సూర్యకుమారి (అమ్మపెళ్ళి), చెరుకూరి రమాదేవి (యాధృచికం మొదలైన వాళ్ళ కథలు ప్రత్యేకంగా స్త్రీవాద ముద్రతో లేకపోయినప్పటికీ 21 శతాబ్దంలో స్త్రీల జీవన విధానాన్ని అవి ప్రతిబింబిస్తున్న  కారణంగా వాటిని స్త్రీవాద కథలుగా గుర్తించడం సముచితమే. విధంగా స్త్రీవాద రచయిత్రుల కలం ఉండి వస్తున్న అనేకానేక కథలు సమాజంలొ స్థూలంగానె కాకుండా సూక్ష్మంగా జరుగుతున్న మార్పుల్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. సామాజిక బాధ్యతతో వీరు రాస్తున్న కొత్త కథలు పాథకులకు దిశా నిర్దేశం చెస్తున్నాయి.

 

అయితే స్త్రీవాదం చల్లబడిపోయిందని, స్త్రీవాద కథలు ఇతివృత్త  లోపంతో మూస ధోరణిలోకి వెళ్తున్నాయని, స్త్రీవాద కథల చిత్రణ  అంతా నగర, పట్టణ వాసాలకు సంబంధించినది మాత్రమే వుంటోందన్న విమర్శలను మాటలతోనో, వ్యాసాలతోనో కాకుండా పదునైన తమ సాహిత్యం ద్వారా స్త్రీవాదులు తిప్పికొడుతుననరనటానికి పైన పేఋకొన్న కథలే మంచి ఉదాహరణ. అయితే ఇక్కడ మనం అంగీకరించాల్సిన  సత్యం మరొకటి ఉంది. వాదానికైనా కొన్ని పరిమితులుంటాయి..అలాంటి  పరిమితులు అస్తిత్వవాదాలన్నింటికి వున్నట్టుగానే స్త్రీవాదానికి కూడా ఉండి.  స్త్రీవాద కథలు మూసధోరణిలోకి వెళ్ళడం లేదన్నది వాస్తవమైనప్పటికీ ఒక వాదంగా స్త్రీవాద సాహిత్యం కొన్ని పరిమితులకు లోబడి మాట్లాదుతోందన్నాదిమాత్రం నిరాకరించలేని సత్యం. “స్త్రీల శరీర ధర్మాలను హీనపరిచే పితృస్వామ్య సంస్కృతిని ఎదిరించె క్రమంలో కొన్నిసార్లు స్త్రీవాద సాహిత్యం స్త్రీల చుట్టూ కొని కొత్త మిత్ లను కల్పించింది.  స్త్రీల  ప్రత్యేకతలను ఆధిక్యాలుగా ప్రకటించింది. స్త్రీల శరీర ధర్మాలను, పునరుత్పత్తి శక్తిని సంపూర్ణ స్త్రీత్వంగా నిర్వచించిన సాహిత్యం  వచ్చింది. ఆమేరకు అవి , శారీరక లోపాలున్న స్త్రీలను  గొడ్రాళ్ళుగా, మాచకమ్మలుగా వెక్కిరించిన పురుషాధిపత్యానికి జవాబు చెప్పే శక్తిని కోల్పోయాయి  అన్న కాత్యాయిని మాటల్లోని వాస్తవాన్ని గుర్తించి స్త్రీవాద రచయిత్రులు ఆత్మపరిశీలన చేసుకోవడం కూడా సంధర్భంలో అవసరమే.

 

 మూస చరిత్ర పాక్షిక విమర్శ

 

స్త్రీల సాహిత్యాన్ని , వారి సాహిత్య కృషిని మొదటి నుండి పురుష నిర్మిత విమర్శానా పనిముట్లతోనే పరామర్శిస్తూ  స్త్రీలు ఇతర స్త్రీల కోసం రాసుకుంటున్న వాటిగానే  చూస్తున్నారు తప్ప వారి సాహిత్యానికి ప్రధాన  స్రవంతి  చరిత్రలో సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదన్నది నిష్టూరసత్యం. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో మొల్ల, మరో తిమ్మక్క అంటూ వేళ్ళ మీద లెక్కించడమే తప్ప స్త్రీల సాహిత్య కృషిని సరిగ్గా అంచనా వేసే ప్రయత్నమేదీ జరగలేదు. ప్రధాన స్రవంతి సాహిత్య చరిత్రలో స్త్రీల సాహిత్యాన్ని పాయగా మాత్రమే ఇన్నేళ్ళు చూపించారు సాహిత్య చరిత్ర రచనావిధానంలొనూ, సాహిత్య విమర్శలోనూ ఇన్నాళ్ళు పురుషస్వామ్యమే రాజ్యమేలింది. మూసపోసిన పురుష స్వామ్య చరిత్ర రచానవిధానాన్ని ప్రశ్నించి దాని తిరగరాసే ప్రయత్నాన్ని స్త్రీవాదులు మొదలెట్టారు. క్రమంలో  వచ్చిన మనకు తెలియని మన చరిత్ర ‘, ‘ మహిళావరణం ‘,’ నల్ల పొద్దు లాంటి పుస్తకాలు సాహిత్య, సామాజిక రంగాల్లో స్త్రీశక్తిని సరిగ్గా  అంచనా కంటే ప్రయత్నాలు. సాహిత్య విమర్శ విషయానికి వస్తే మొదటినుంచి కూడా స్త్రీల సాహిత్యానికి తగినట్టు విమర్శ రాలేదు. 

 

ముఖ్యంగా స్త్రీవాద  సాహిత్య విమర్శ ఆశించిన స్థాయిలో రాకపోవటానికి ప్రధాన కారణం అందుకు అనువైన భాషను, విమర్శనాసూత్రాల్ని సంపూర్ణంగా నిర్మించుకోకపోవడం,  ఓల్గా, జయప్రభ, కాత్యాయని, కాత్యాయని విద్మహే, మృణాళిని, అబ్బూరి చాయాదేవి, ఎస్.జయ లాంటివాళ్ళు కొంతమేరకు దీనిపై కృషి చేద్సిన ఇంకా చేయాల్సింది చాలానే ఉందని చెప్పుకోవాలి. ‘ స్త్రీ విద్య మొదలుకొని స్త్రీల సమగ్ర సహిత్య చరిత్ర, విమర్శ వచ్చినప్పుడే సమాజాన్ని వారి సాహిత్యం ప్రభావితం చేసిన తీరు స్పష్టమవుతుంది.

 

స్త్రీల సాహిత్యంపై మొదటి నుండీ మనకు పాక్షిక విమర్శలు మాత్రమే  వున్నాయన్నది ఇప్పటి స్త్రీవాదుల ఆరోపణ మాత్రమే  కాదు. కనుపర్తి వరలక్ష్మమ్మ కాలం నాటికే ఇది వుంది. రచయితల సాహిత్యంపై విమర్శ ఎలా సాగుతుందో ఆమె తన కథ కథ ఎట్లా వుండాలే?” లో చెప్పే సాహసం చేశారు. రచయితల కథల్ని వాళ్ళలో వాళ్ళే ప్రశన్సించుకొని దాన్నే సద్విమర్శగా చెలామణి చేసుకునే విధానాన్ని  వ్యంగంగా ఆమె ఎత్తి పొడుస్తారు. ఇప్పటికీ కథ నిత్యనూతనమే.

 

గురజాడ దిద్దుబాటుతొలి తెలుగు కథగా మొదలైన కథాచరిత్రలో తొలితరం రచయిత్రులకున్న ప్రాధాన్యత అతి స్వల్పం. కథాసాహిత్య చరిత్రలో రచయితలకు ఇచ్చిన స్థానం రచయిత్రులకు ఇవ్వలేదు. స్త్రీవాద  సాహిత్యం ’80 ల్లో మొదలైనా, భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ మొదలుకొని అనేక మంది రచయిత్రులు స్త్రీ చైతన్యం, స్త్రీ వ్యక్తిత్వం లాంటి అంశాల్ని 1900 నాటికే అప్పటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టు తమ రచనల్లో ప్రస్తావించారు. చర్చించారు. అచ్చామాంబ, వరలక్ష్మమ్మ, ఇలిందల సరస్వతిదేవి, పి.శ్రీదేవి, శివరాజు సుబ్బలక్ష్మి మొదలైన రచయిత్రుల  కథల గురించి ఎవరూ ఎక్కడా చర్చించిన దాఖలాలు మనకు కథాసాహిత్య చరిత్రలో కనిపించవు. కథకు సంబంధించిన చర్చలన్నింటిలోనూ ’50 నాటి  రచయిత్రుల  ప్రస్తావనలు నామమాత్రంగానే కనిపించడం విషాదకరం. తెలుగు కథ మీద ఇప్పటివరకూ వచ్చిన పుస్తకాలు , వ్యాసాలు అనేకం పరిశీలించినపుడు ముగ్గురు,నలుగురు రచయిత్రుల పేర్లతో.. ఫలానావారు రాసేవారు అంటూ ఏకవాక్యానికే పరిమితం కావడం కంపిస్తుంటుంది. రచయిత్రుల కథల గురించి, వారి శైలి, కథనం గురించి సీరియస్‌గా ఎవరూ చర్చించినట్టు కనిపించదు. గురజాడా దిద్దుబాటు ని, అచ్చహమాబ స్త్రీ విద్య ‘, ‘ ఖనా లాంటి కథల్ని పక్కనపెట్టి చూసినప్పుడు  దిద్దుబాటు కంటే స్త్రీ విద్య, ఖనా కథలు విధంగానూ తీసిపోవన్న సత్యం బోధపడుతుంది. 

 

 

విక్రమాదిత్యుని  ఆస్థానంలోని జ్యోతిశ్శాస్త్రవేత్త  మిహిరుని భార్య ఖనా కు ఎలాంటి దుర్గతి పట్టిందో చెపుతూ అచ్చమాంబ రాసిన కథ స్త్రీలు అప్పటికే సమాజంలో తమ స్థితిగతుల్ని గుర్తించడం మొదలుపెట్టారనటానికి నిదర్సనం.అలాగే ఐరోపా మహాసంగ్రామానంతర దుస్థితిని, మాంచెస్టర్ నూలు మిల్లులు వచ్చి దేశీయ పరిశ్రమలను దెబ్బతీసిన వైనాన్ని కనుపర్తి వరలక్ష్మమ్మ కుటీరలక్ష్మి” (1924) కథలో చిత్రించారు. ప్రపంచీకరణ తొలిరూపాలు సృష్టించబోయే విధ్వంసానికి మూలాల్ని మనం కథలో చూడవచ్చు.ఇలాంటి మంచి కథల్ని, రచయిత్రుల్ని పట్టించుకున్నవారు తక్కువే.

 

స్త్రీల సాహిత్యాన్ని చర్చించకుండా అసలు గుర్తించనట్టు మౌనంగా పక్కన పెట్టడం ఒకరకమైన వివక్ష అయితే, దాన్ని కేవలం సిద్ధాంతపరిధిలోమాత్రమే విమర్శించడం మరో రకమైన వివక్షగా పేర్కొనవచ్చు. ఇప్పటికీ మనకు పత్రికల్లో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం స్త్రీల రచనల్ని, వారి పుస్తకాల్ని సాధారణంగా స్త్రీలే సమీక్షించుకోవడం.

 

 స్త్రీవాద రచయిత్రులు రాసిన కథల్ని విమర్శించే విధానానికి,  స్త్రీవాద రచయితలు రాసే కథల్ని విమర్శించే విధానానికి వున్న తేడా విమర్శకులకున్న పక్షపాత ధోరణిని తేటతెల్లం చేస్తుంది. రచయిత్రుల కథల్ని స్త్రీవాద సిద్ధాంతపరిధిలో వున్నాయని విమర్శించే విమర్సకులు రచయితల కథల్ని స్త్రీవాద దృక్పథంతో వున్నాయని గొప్ప చేసి చూపించడం అలాంటిదే.

 

ఉదాహరణకు  అత్యాచారం ఇతివృత్తంగా రచయిత్రి రాసిన కథ, రచయిత రాసిన కథ తీసుకుంటే వాటిని విమర్సకులు ఎలా విమర్శించారో చూస్తే

 

వివినమూర్తి కథ నేరం ‘, నిర్మలారాణి కథ మలుపు తీసుకుంటె నిర్మలారాణి కథలో మోతుబరి చేతిలో  అత్యాచారానికి గురైన సునీత అతనితో పెళ్ళికి ఒప్పుకోదు. కానీ అత్యాచారం వల్ల కలగబోయే బిడ్డకు మాత్రం అతని అసథిలో వారసత్వం అడుగుతుంది. ఇందులో గందరగోళమేమీ లేదు. బలవంతంగా అత్యాచారం చేశాడు కాబట్టి దాని పెళ్ళి అనే సాంఘిక లైసెన్స్ తో సమాజ అంగీకారానికి తీసుకురావల్సిన పనిలేదు.  ఇక అత్యాచారం వల్ల కలగబోయే బిడ్డ చర్యకు ఫలితం కాబట్టి బిడ్డను పెంచడానికి అందుకు బాధ్యుడైన వాడి వద్ద నుండి అతని ఆస్థిలో వాటా అడగడం సమంజసం. కథను విమర్శించిన కోడూరి శ్రీరామమూర్తి సునీత నిర్ణయం గందరగోళంగా వుందని వ్యాఖ్యానించారు.

 

వివినమూర్తి రాసిన నేరం కథ చూస్తే, విప్లవజీవితం నుండి తండ్రి రమ్మంటే బైటకు వచ్చి పెళ్ళి చేసుకుని  అమెరికా వెల్తుంది వైప్లవ్య.  అకక్డ కొన్నాళ్ళున్నాక మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి కార్పోరేట్ ఆస్పత్రి కట్టీస్తారు భార్యాభర్తలు వైప్లవ్య, రాఘవలు. ఇంట్లో పనులు చూసుకోవడానికి పెట్టుకున్న పనివాడు భిక్షంను  పనివాడిలాగా కాకుండా విప్లవ భావజాల ప్రభావంతో తమతో సమానంగా చూస్తారు భార్యాభర్తలు. భిక్షం వైప్లవ మంచితనం (?) అర్ధం చేసుకోకుండా ఆమెపై అత్యాచారం చేసి చివరికి పశ్చాత్తపపడతాడు. అపప్టివరకూ భార్య మాటకు ఎదురు చెప్పని రాఘవ అత్యాచారం సంఘటనతొ వైప్లవ్యకు విడాకులిస్తాడు. అత్యాచారం సంఘటనతో షాక్‌కు గురై ఆస్పత్రిలో వున్న వైప్లవ్య షాక్ నుండి కోలుకొని  భిక్షం తప్పును క్షమించి తన కొడుకుగా దత్తత తీసుకుంటుంది. కథంతా విన్న శిష్యుడు ఎక్కడుండాల్సిన వాళ్ళను అక్కడ ఉంఛకపోతే ఇలాగే జరుగుతుందన్న మాటలకు  గురువు చెంపదెబ్బ కొట్టడంతో కథ ముగుస్తుంది. ఇలాంటి అతి సాధారన వ్యాఖ్యలు చేసే మేధావులకు  చెంపదెబ్బ కొట్టడం లాంటిది ఇది అంటారు కోడూరి. కథలో కేవలం చివర్లో చూపిన పరిష్కారమే కాదు. మొదటి చివర వరకూ కథలో , కథనంలో అనేక లోపాలున్నాయి. అయితె కోడూరి దీని గొప్ప కథగా చెప్పటమే కాకుండా ఇందులో స్త్రీవాద దృక్పథానికి మించిన పరిధి వుందనటం విశేషం.

అత్యాచారం అనే అంశాన్ని రచయితలిద్దరూ  రెండు రకాలుగా చిత్రించారు. ఇందులో నిజానికి  నిర్మలారాణి కథ స్త్రీవాదానికి దగ్గరగా అనడం కంటే జీవన వాస్తవికతకు దగ్గరగా వుందని చెప్పాలి. కానీ  వివినమూర్తి కథలోని ప్రధాన లోపం బలహీనమైన  వ్యక్తిత్వమున్న వైప్లవ్య పాత్ర. విప్లవ జీవితంలోంచి తండ్రి పిలిపించేస్తే వచ్చేస్తుంది. చాలా మంది లాగానే డబ్బున్నవాడిని పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళిపోయి డబ్బు సంపాదించి తిరిగివస్తుంది. తిరిగొచ్చాక మంచి కార్పోరేట్ ఆస్పత్రి కట్టిస్తారు  భార్యాభర్తలు. ఇలా అన్న్నీ తమకనుకూలంగా  చేసుకుంటున్నా వైప్లవ్య అంతరంగంలో చాలామధనపడుతోందని, అపరాధ బహవనకు గురవుతోందని రచయిత వాచ్యంగా చెప్తారు. అపరాధ భావనతోనే పనివాడిని పనివాడిలా  చూడాలనుకోవడం కాకుండా తమతో పాటు ఇంట్లో సమాన హోదా కల్పిస్తారు. అంటే అపరాధ భావనకు ఇది పరిష్కారమా? ఆమెలో అపరాధ భావన కథలో బలంగా చిత్రితం కాకపోవడమన్న లోపాన్ని పక్కన పెడితే అత్యాచారం జరిగిన తర్వాత భర్త వైప్లవ్యను వదిలేస్తాడు. ఆమె షాక్‌కు గురై ఆస్పత్రిలో చేరుతుంది. అత్యాచారం అనేదాన్ని  శీలం, పాతివ్రత్యం అనే భావనల నుండి కాకుండా దాన్ని శరీరంపై జరిగిన ఒక యాక్సిడెంట్‌గా పరిగణించి ఆమె చేదు అనుభవం నుండి బైటపడితే అది సహజత్వానికి దగ్గరగా వుండి స్త్రీవాద  కథ అయివుండేదేమో. అందుకోసం ఆమె తనను రేప్ చేసినవాడిని కొడుకుగా స్వీకరించి మాతృత్వభావనను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం మనకు కథ రిత్యా కాని, సమాజ రిత్యా కాని కనిపించదు. అత్యాచారంపై వచ్చిన కథల్లో వైపవ్య చేసినది విభిన్న పరిష్కారం. వివినమూర్తి కథకు వినూత్న ముగింపు ఇచ్చారు.  అంత మాత్రాన  అది స్త్రీ వాద కథ అయిపోదు.

 

అత్యాచారం లాంటి స్త్రీల సమస్యకు భిన్నమైన ముగింపు ఇచ్చిన వివినమూర్తి నేరం కథ ఏడాది వచ్చిన మంచి కథగా పొందితే ఇదే సమస్యకు మరో భిన్నమైన ముగింపు ఇచ్చిన నిర్మలారాణి కథ గందరగోళం వున్న కథగా విమర్శకుల  వ్యాఖ్యానం పొందింది.

 

ఇలాంటి ఉదాహరణలు వెతుక్కుంటూపోతే కోకొల్లలుగా మనకు ఇటీవలి తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి.

 

సద్విమర్శ అనేది సాహిత్యానికి ప్రాణవాయువు లాంటిది. అలాంటి సద్విమర్స రచనల మీద రావాలి. అంతే కాని రచయిత్రుల వ్యక్తిగత జీవితాలపైనో, వారు నమ్ముకున్న సిద్ధాంత భావజాల మీదనో కువిమర్సలు చేస్తూ హస్య, వ్యంగ్యాత్మకంగా కథలు రాయడం నీచ సంస్కృతి. అలాంటి నీచ సంస్కృతి తెలుగునాట మొదలైంది. నిజమైన సాహిత్యాభిలాషులెవరైనా దాన్ని ఖండించాల్సిందే 

 

 

 

 

 

 

 

 

Read Full Post »

ఏమిటి ఈ  స్లీపింగ్ పిల్ కథ? ఇందులో ఏమి చెప్పాను? ఎలా చెప్పాను? ఎందుకు చెప్పాను? అన్న వివరణల్లోకి వెళ్ళే ముందు …..
నిజానికి ఓ రచయిత తన అభిప్రాయాలేమిటో పూర్తిగా కథలోనే చెప్పగలగాలి. అప్పుడే కథా రచన టెక్నిక్కు  అలవడినట్టు. వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే రచయిత తన అభిప్రాయాన్ని కథలో సరిగ్గ చెప్పి వుండకపోవడం లేదా చెప్పలేకపోవడం ఒక కారణం.రచయిత చెప్పినది పాఠకులకు అర్ధం కాకపోవడం వెనుక పాఠకుడి అవగాహనా లోపం కూడా కొంత వుంటుంది అని నేను అనుకుంటాను. కాబట్టే ఇందులో నా వంతు పాత్రగా నేను రాసిన కథ మీదవున్న వ్యాఖ్యలకు నా వివరణ రాయాలనిపించింది.

కథ బావుంది అన్న వాళ్ళకు , అర్ధం చేసుకున్నవాళ్ళకు ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేమి రాయక్కరలేదు. మిగతా వ్యాఖ్యల గురించే ఈ సమాధానం.

ఈ కథలో ప్రధానంగా నేను చర్చించాలనుకున్న విషయం ‘వైవాహిక అత్యాచారం’ గురించి. వివాహ వ్యవస్థ చాటున జరిగే ఈ అత్యాచారం గురించి దాదాపుగ ప్రతి ఒక్క స్త్రీకి తెలిసే వుంటుంది.నేను కావలని పనిగట్టుకొని ఎవరిని విలన్ గా చూపించే ప్రయత్నం చేయలేదు. అలా ఎవరికైనా అనిపిస్తే ఆ రకంగా ప్రవర్తించే మగవాళ్ళు, అలాంటి భావజాలంలోని విలనీతనం అది.దాంపత్యంలోని ప్రేమ, అనురాగం, దగ్గరితనం లాంటివి ఎలా వుందలో, లేదా ఎలా వుంటే బావుంటుందో చెప్పాలనుకున్న కథ కాదు కాబట్టి అవేమి ఇందులో చర్చించలేదు.

మారిటల్ రేప్ నేరమని, అందుకు పాల్పడిన జీవితభాగస్వామి ని చట్టబద్దంగా శిక్షించవచ్చన్న చట్టాలు కూడా వచ్చాయి.కాని ఆచరణలో అదెంత చట్టుబండలైందో అందరికీ తెలిసిన విషయమే. సంసారం గుట్టు, వ్యాధి రట్టు అన్నట్టు ఇలాంటి విషయాల గురించి బయటకు  చెప్పుకోలేని వ్యవస్థ మనది. దాన్ని గురించి మాట్లడటమే టాబూ మనకు.ఇలా జరగడం సహజమేలే అని సర్దుకునే వళ్ళే తరతరాలుగా. అలంటిదే నా తులసమ్మ పాత్ర. ఆమె తన బాధను అన్నేళ్ళు మౌనంగా అనుభవించింది.ఎవరితో చెప్పుకోకుండానే. తన కూతురికి ఇలాంటి బాధలేమైనా వున్నయేమో అడగాలని, మాట్లాడలని అనుకోవడమే మార్పులోని తొలి అడుగు.

స్త్రీ శరీరం ఆస్తిలాగ వాడుకోవడం లోని బాధని చెప్పే ప్రయత్నం చేశాను. తులసమ్మ ఈ విషయాల గురించి కూతురితో మాట్లాడగలిగితే ఆ కూతురు తన కూతురితొ మాట్లాదుతుంది.ఈ మాట్లాడుకోవడం వెనుక కొన్నేళ్ళ వేదన వుంది. అది చెప్పడం మాత్రమే ఈ కథ వుద్దేశం.
ప్రపంచంలోని స్త్రీలందరు తులసమ్మలని, మగవారంతా పరంధమయ్యలని ఎవరైనా అనుకుంటే అది వాల్ల తప్పు. నేను అల జనరలైజ్ చేసి చెప్పలేదు.
ఈనాడులో ఈ కథ ప్రచురితమైన ఒకటి, రెందు రోజులకు వసుంధరలో ఒక సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అది మీరే ఇక్కడ చదవండి.

చిట్టి తల్లులూ..చిక్కులొద్దు!

”పదహారేళ్లలోపు అమ్మాయితో ఆమె ఇష్టప్రకారమే శారీరకంగా కలిసినా.. అది అత్యాచారం కిందే లెక్క… చివరకు భర్తయినా సరే ఇలాంటి చర్యను శిక్షార్హంగా పరిగణించాలి”అని న్యాయకమిషన్ ఇటీవల విస్పష్ట ప్రతిపాదనలు చేసింది. భర్త బలవంతపు సంభోగానికి పాల్పడటంతో తీవ్రరక్తస్రావం జరిగి మరణించిన ఫూల్మునీ అనే అమ్మాయి కేసును ఉదాహరణగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిషన్ సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించింది. పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయాన్నీ సేకరించింది. సంబంధిత చట్టాల్లోని బలహీనమైన అంశాలను తొలగించే దిశగా చర్యలు తప్పనిసరి అభిప్రాయపడింది. ఎన్ని చట్టాలుచేసినా..సిఫారసులు గుప్పించినా..చివరకు బాధితులు అమ్మాయిలే. ఒక్క ఫూల్మునీయే కాదు..కనిపించకుండా చీకట్లోనే మగ్గిపోతున్న అమ్మాయిలెందరో…ఈ వయసు అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుంటున్న అబ్బాయిలకూ కమిషన్ సిఫారసు గట్టిహెచ్చరికే. ప్రేమలు.. డేటింగ్‌ల మోజులో అమాయకంగా చిక్కుకుంటే ఎదురయ్యే పరిణామాలను వివరిస్తూ…. పరిణితితో యోచించమంటున్నారు నిపుణులు. సాటి యువతరం ప్రతినిధులదీ అదే సలహా…. ‘

Read Full Post »

స్లీపింగ్ పిల్

ఒంటిమీద ఏదో పాకినట్టనిపించి గబుక్కున మెలకువ వచ్చింది తులశమ్మకు. పరిచితమైన స్పర్శే కానీ… గొంగళిపురుగును తలపిస్తోంది. చటుక్కున ఆ చేతిని విసురుగా తోసేసి, ”ఏమిటిది, ఎన్నిసార్లు చెప్పాను… ఇవన్నీ వద్దని. నాకు నిద్రొస్తోంది” అంది ఒకింత విసుగ్గా.
”ఏం నేనేమైనా కానిపని చేశానా? రాకూడని వాళ్ల పక్కలోకి వచ్చానా? రోజూ జరిగేదానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తావు? పక్కలోకి వెుగుడు కాకపోతే ఎవడొస్తాడు?” అన్నాడు కోపం, అసహనం కలగలిసిన గొంతుతో పరంధామయ్య.
(మరింత…)

Read Full Post »