Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for the ‘కవిత్వం’ Category

kavichalamకవి చలం…వజీర్ రెహ్మాన్ అద్దంలో…!

మీకు బాగా నచ్చిన కవి ఎవరూ? అంటే కవిత్వ అభిమానులు, ప్రేమికులు ఎవరైనా ఠక్కున కనీసం ఓ పదిపేర్లు చెప్పగలరు . ఆ పదిపేర్లు ఫలానా వారివే అయివుండనక్కరలేదు. ఎందుకంటే అది వారి వారి అభిరుచిని బట్టి వుంటుంది కాబట్టి. నేను చెప్పే పది పేర్లలో తప్పనిసరిగా వుండే రెండు పేర్లు –ఒకటి చలం, రెండోది వజీర్ రహ్మాన్. చలం కవా? అని ఇప్పటికీ కొందరు అశ్చర్యపోతుంటారని నాకు తెలుసు. ఆ మాటకొస్తే మీరు కవి అని వజీర్ రహ్మాన్ చెప్పేటప్పటికి చలమే బోలెడంత ఆశ్చర్యపోయారు.

చలం వచనం కవితాత్మకం అని వేరే చెప్పక్కరలేదు. మొదటి సారి చదివిన కొత్త పాఠకుడు కూడా వెంటనే చలం కవితాత్మకతని గుర్తు పడతాడు. అసాధారణమయిన మ్యూజింగ్స్ మొదలుకొని సాధారణమయిన గల్పికలూ, వ్యాసాల్లో కూడా చలం కవి అనుకోడానికి తగినన్ని దాఖలాలు దొరుకుతాయి. అవి కాక, శ్రీ శ్రీ, పఠాభి లాంటి కవుల గురించి చలం రాసిన వాక్యాల్లో కవిత్వం తొణికిసలాడుతుంది. కవుల మీద గొప్ప ప్రేమా, తీవ్రమయిన కోపం – రెండూ కనిపిస్తాయి.ఎంతో మంది కవులే అనువాదం చేసినప్పటికీ, టాగూర్ గీతాంజలి చలం అనువాదంలోనే చదవాలని అనిపిస్తుంది. అదీ చలం వచనం ప్రత్యేకత.

చలం ది కవిత్వం లో కూడా భిన్నమైన దారే. సామన్యంగా ఆధునిక తెలుగు కవులు అనేకమంది కవిత్వాన్ని వచనంలో రాస్తారు. కానీ వచనంలో కవిత్వం రాయడం చలం ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను గుర్తు పట్టి ప్రత్యేకంగా కవిగా చలాన్ని పరిచయం చేసిన హృదయమున్న వ్యక్తి వజీర్ రహ్మాన్.

చలం శతజయంతి సందర్భం గా 1994 లో శతజయంతి సంఘం వారు వేసిన ఈ పుస్తకం అపురూపమైంది. ఎందుకంటే చలం కవిత్వంతో పాటు చలం వి వివిధ దశల్లో తీసిన అపురూప ఛాయాచిత్రాలున్న పుస్తకం ఇది. అంటే కవితలతో ఫోటో ఆల్బం అన్న మాట.

చలం కవిత్వ నిషాకి మచ్చుకి కొన్ని పంక్తులు…

‘వానరాత్రి ‘ లో ఏమంటారో చూడండి…

ప్రపంచాన్ని తుడిచేద్దామన్నట్లు వీస్తోంది గాలి/నల్లని రాత్రి ఇంకా నల్లని
మబ్బు వస్త్రాలు కప్పుకుని ఏడుస్తోంది/
హోరుమని అరుస్తో వాన/తలుపులు మూసి దీపం వెలిగించుకున్న/వాన లోపలికి వస్తానని పంతం పట్టి
తలుపు మీద ఈడ్చి కొడుతోంది–/తెరవమని/కొంచం మర్చిపోతుంది,
మళ్ళీ నేను గ్యాపకం వొస్తాను గావును/దబదబా బాదుతుంది;
నా విరహ బాధని ఈ రాత్రిలో కలిపెయ్యలేను?

చదువుకుని ఆ అనుభూతిని స్వానుభవిచటం తప్ప వివరణలు, వ్యుత్పత్తి అర్ధాలు అక్కర్లేని, సూటిగా మాట్లాడే కవిత్వం చలానిది.
ప్రేయసి అన్వేషణ గురించి ఏ రాసుకున్నారో చూడండి…

నీవు రావు/నన్ను పోనీవు!
మరల్చి మత్తెక్కించి/స్వప్నాలతో లాలించి/మధురగానాలతో వూగించి/ప్రపంచానికి వ్యర్ధుణ్ణి చేసావు!/
అనాదిగా విన్న నీ పిలుపు/స్వప్నంలో అనుభవించిన /నీ కుంతల కొనల స్పర్స/
ఏ యుగాల ఆవలి తీరానో/ సం యోగమనే వాగ్దానం /
ఇంతే నాకు/మిగిలిన ఆశలు!/ప్రియా!/
యోగులు హృదయంతో / వెలిగించుకునే కాంతి- నీ చిరునవ్వు;/
నాకెట్లా దొరుకుతుంది?

మల్లెపూల గురించి చలం తమకం చదవండి…

అర్ధరాత్రులు విచ్చి/ జుట్టు పరిమళంతో కలిసి/ నిద్ర లేపి/ రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు/
సన్నని వెన్నెట్లో/ ప్రియురాలి నుదుటి కన్నా తెల్లగా/ ఏమి చెయ్యలో తెలీని ఆనందంతో/గుండె పట్టి చీలికలు చేశే మల్లెపూలు/
తెల్లరకట్ట లేచి చూసినా/ఇంకా కొత్త పరిమళాలతో /రాత్రి జ్ఞాపకాలతో/ప్రశ్నించే మల్లెపూలు/
అలిసి నిద్రించే రసికత్వానికి/జీవనమిచ్చే ఉదయపు పూలు/ రాత్రి సుందర స్వప్నానికి సాక్షులుగా/అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు! మల్లెపూలు!!

చలం ‘ విరహం’ అనుభూతించండి…

ప్రియుడి రత్యాలింగనం తర్వాత/సంతుష్టి చెందిన ముఖం వలె/గాలిలోని కొత్తని చల్లదనం/
శరీరం మీద తగిలి/హృదయంలోకి దూసుకుపోతోంది/
నిద్ర కమ్మిన కన్ను వలె/వొక్క నక్షత్రం మెరుస్తోంది/
ఈ గోలలొ గాలిలో, పాపం/ఏదో పిట్ట లేచి అరుస్తోంది/చప్పున గాలి ఆగింది/
నది కూడా నిశ్శబ్దమైంది చచ్చిపోయినట్లు/చీకటి నిశ్శబ్దం/నువ్వే లేవు!

చలం కవిత్వాన్ని గురించి మనం ఆస్వాదించి ఆనందించటం సరే. ఆయనే ఏం చెప్పుకున్నారో చూడండి ‘ చలం రాయని “పీఠిక” లో…

వజీర్ రహ్మాన్ గారికి,

మీరు పంపిన గీతలు, ఆ selections అన్నీ కూడా చాలా బావున్నాయి. కొన్ని ఎక్కడివో నేను గుర్తించలేకపోయినాను.
మొదట అవేవో మీరు రాశారనుకున్నాను. ఎవరీ గొప్ప కవి? అని ఆశ్చర్యపడ్డాను. కొంచం దూరం చదివితే గాని, అవి నేను రాసినవని తెలీలేదు. చదువుతున్న కొద్దీ ఇంత గొప్ప కవిత్వం నేనేనా రాశింది అని ఆశ్చర్యపడ్డాను.

ఆ గీతాలు ఎవరివైనా కానీ, అట్లాంటివి ఏ సహృదయుడైనా ఆరాధించవలసిన విలువ గలవి. కాని ఇన్నేళ్ళూ ఎవడు చూశాడు? వాటి రచయతే గుర్తించలేదు వాటి విలువని- ఇన్నేళ్ళకు మీరు జన్మించి, గుర్తించి, సేకరించి, ఎత్తిచూపిందాకా!

తనలో కవిత్వమున్నదని తెలుగువాడు చలానికే తెలీదు.

మల్లెపూల పైన నేను రాసిన Musings కవిత్వంతోనూ, తత్త్వంతోనూ కూడినవని నాకు తెలుసు. ఎవరైన ఇంకొకరు గుర్తిస్తారెమోనని ఆశించేవాణ్ణి. Musings లో మెచ్చుకునేవాళ్ళలో ఒక్కరూ వాటిని ప్రత్యేకంగా మాట్లాడలేదు.ఒక్క రుక్మిణీనాధ శాస్త్రి గారు ఒకసారి passing గా ” చాలా కవిత్వముందండీ; ” అన్నారు, మరి నా హృదయం మీ ఒక్కరికే తెలీడం ఎట్లా జరిగింది?

-చలం

చలం కవిత్వం గురించి వజీర్ రెహ్మాన్ ఇలా అన్నారు:

‘చలాన్ని త్రావి
నిషాలో వున్నాన్నేను-
ముట్టకు
మెరుపై జ్వలిస్తాను!
తట్టకు
ఉరుమై ధ్వనిస్తాను ‘
-వజీర్ రహ్మాన్

ఔను చలం ! ఔను సుమా,
ఔను నిజం నీవన్నది;
నీవన్నది, నీవన్నది,
నీవన్నది నిజం, చలం !
(శ్రీశ్రీ కృతి, శృతి లో)

అగాధం లోంచి బైలుదేరే
నల్లని అలలు మొహాన కొట్టి,
ఉక్కిరి బిక్కిరై,
తుఫాను హోరు చెవుల్లో గింగురుమని,
నమ్మిన కాళ్ళ కింద భూమి దొలుచుకుపోతో వుంటే
ఆ చెలమే నయమని
పరిగెత్తి వస్తా ‘రన్నాడు
చెలం.

‘ అవును,
చెలం వచనాన్ని గీతాలుగా కత్తిరించి
వొడ్డించుకుంటారు కూడా ‘
అన్నాడు వజీర్ రహ్మాన్, వెనక.

విన్న మిత్రులు కాచుక్కూచున్నారు.
ప్రధ్వానం వినబడకపోగా చివరికి రహ్మానే తెగించి
తెలుగు వాంగ్మయాన్ని చెలం గీతాలతో వూగించే
బాధ్యత స్వీకరించాడు.
ఫలితం గా ఈ సమర్పణ.
కవితా ధ్వజాన్ని చేదాల్చి
పాతగోరీల కేసి మొహాలు తిప్పుకుని కూచున్న
వాంగ్మయ పీఠాధిపతుల
నడ్డి విరగ్గొట్టాల్సిన చెలం,
ఎంచాతనో విరమించుకుని;
కృష్ణశాస్త్రిని క్షమించి,
శ్రీశ్రీ ని ఆశీర్వదించి,
వెనక్కి మరలి వచనంలోకి వెళ్ళిపోయాడు.
అంచాతనే కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ బ్రతికి వున్నారు,
నేటికీ మనలో
చెలం
తెలుగులో ‘ కవిత్వం ‘ పేరుతో
ఏమీ వ్రాయ
నిరాకరించడం,
వీరిద్దరనీ రక్షించే ఆలోచనో,
లేక తన వచనానికే గోలెత్తిన తెలుగు దేశం
కవిత్వానికి తట్టుకోలేదనో–
తెలీదు.
చెలానికి సంబంధించిన చాలవిషయాలకి మల్లే
ఇదీ ఇంకా అజ్ఞాతంగానే వుండిపోయింది.
ఐనా,
కవిత్వమనే పేరుతో గాకపోయినా, రాసిన వచనమే
చాలు,
చెలాన్ని ‘ మహాకవి ‘ గా
పరిగణించేందుకు.
(కాని,
చెలం గారూ,
ఠాకూర్ అన్నట్లు–
you live alone and unrecompensed
because
they are afraid of
your great worth!)
—వజీర్ రహ్మాన్

చలం కవిత్వమంతా ఆయన అంతరంగ చిత్రాలు –వాటికి బాహ్య రూపాన్ని చిత్రించే ఛాయాచిత్రాలు –రెంటి ఆత్మల్ని అందిపట్టుకొని మనకందించిన సహృదయుడు వజీర్ రహ్మాన్. వజీర్ రహ్మాన్ కవిత్వం గురించి మారో సారి మాట్లాడుకుందాం…

ప్రకటనలు

Read Full Post »

nidritanagaram2వెన్నెల, జలపాతాలు, ప్రకృతి సౌందర్యం వీటిని ఇష్టపడి ప్రేమించని వారెవరు? ఆరాధించనివారెవ్వరు? అయితే అందరూ చేయలేని పని ఒకటుంది. అది వెన్నెలని కవిత్వం గా, కవిత్వాన్ని వెన్నెల గా మార్చగలగటం. ఆ ఆల్కెమి తెల్సిన మంచి కవుల్లో వైదేహి ఒకరు. ఇప్పటికే చాలా మంది ఇటీవల వైదేహి కవిత్వాన్ని సమీక్షించారు. అవి నేను కూడా చదివాను. అయితే అవేమి ఇప్పుడు నేను వైదేహి కవిత్వాన్ని గురించి రాస్తున్నప్పుడు నాకు గుర్తు లేవు. ఇప్పుడు నేను రాస్తున్న ఈ నాలుగు మాటలు కూడా ఎవరికీ గుర్తుండవు. ఎందుకంటే అప్పటికే అందరి మనస్సుల్లో వైదేహి కవిత్వం గుర్తుండిపోయింది కాబట్టి. ఈ కారణం చేతనే నాకు కవిత్వాన్ని సమీక్షించుకోవటం ఒక్కోసారి అనవసరమనిపిస్తుంది. కవిత్వం ప్రధానం గా అనుభూతి ప్రక్రియ. ఆ అనుభూతిని అనుభవించటమే తప్ప ఇంకేమి చేసినా ఆ సహజ సౌందర్యం ముందు నిలబడవు.

అందుకనే వైదేహి ఏం చేసిందంటే తిలక్ ని, అతని కవిత్వాన్ని, ఆ కవిత్వం లోని వెన్నెల సొబగులని, సౌందర్య జలపాతపు వొంపు సొంపుల్ని తన మనసు లోతుల్లోకి వొంపేసుకుంది. తనూ, తిలక్ ఇక ఒకటై పోయారు. తానే ఒక తిలకై పోయారు. ఇక మనమేం మాట్లడతాము? ఒక్క తన కవిత్వపు నిషాలో మత్తెక్కి పోవటం తప్ప. ఎంత అందంగా అనుభూతించగలిగింది, ఎంత బాగా అక్షరీకరించగలిగింది అని తన్మయత్వంతో మురిసిపోవటం తప్ప. తన కవిత్వం చదివిన తర్వాత ఇప్పటి దాకా ఏమీ రాయకుండా నేను చేసింది అదే.

(మనందరికీ ఇష్టమైన ఇస్మాయిల్ గారి అవార్డ్ ని అందుకుటున్న మన వైదేహి కి ప్రేమతో, స్నేహంతో ఈ నాలుగు వాన చినుకుల్లాంటి మాటలు)

Read Full Post »

 
నా కవిత రహస్య వాన కు pavada blogger crazyfinger అనువాదం చేసారు. నా రహస్య వన కవిత నా బ్లాగ్ లొనే వుంది. ఇంగ్లిష్ అనువాదం ఇక్కడ చూడండి.

http://www.pavada.in/2009/10/rahasya-vaana-by-kalpana-rentala-english-version.html

Read Full Post »

1995 జూలై 18 వ తేది మా నాన్న గారు కన్ను మూసినా, ఇప్పటికీ ఆయన లేరని తెలిసి చెమర్చే కళ్ళతొ, ఆర్ధ్రమైన హృదయంతో అప్పుడప్పుడో రాసుకున్న ఈ కవిత మా నాన్న గారి గుర్తుగా , నివాళిగా….

నాన్నా!

మనం మాట్లాడుకోని క్షణం వుందా?

కలయికల్లేవనే గానీ

మనల్ని కలపని క్షణం వుందా?

నీ చరమ సంధ్య వాకిట

నా అడుగులు చప్పుళ్ళు లేవనే గానీ

ఏదో ఒక చివరంటే

నేనొక దగ్ధమైన అడవినవుతాను

చివరి మాటా

చివరి చూపు

చివరి స్పర్శా

అసలెక్కడా వుండకూడనుకుంటాను

నాన్నా!

నీ రెప్పల కింద వొణికిపోయిన

చిట్టచివరి అశ్రువును నేనేనా?

మూయలేక కాలం చేతుల్లో మూతబడిన

నీ కళ్ళ కింద దాచిపెట్టిన

అసంపూర్తి కలను నేనేనా?

ఆ చివరి శయ్య మీద

రాలిన దేహాన్ని నేనేనా?

ఎప్పుడో చీకటి బిందువైన నువ్వు

ఇప్పుడు చెట్టంత వెలిగిన నేను

నువ్వు వెనక్కూ, నేను ముందుకు కాలంతో నడిచివస్తున్నప్పుడు

నీ చిటికినవేలు

ఎప్పుడెలా జారిపోయిందో గుర్తే లేదు

నువ్వు నిల్చున్న తీరాన్ని వదిలి

ఈ నౌక దిక్కులన్నీ చుట్టుకుంది

ఇప్పుడు ఈ కల్లోల సముద్రమే

నీ చిటికెన వేలుగా మారింది

నీ కలలన్నీ నిజమే కాని

ఎప్పటికి నిజం కావు

నువ్వు చెమట చుక్కలతో కట్టిన గూడు

ఇప్పుడేమో వొట్టి మోడు

రెక్కలెలా వుంటాయో తెలీకుండానే

కనుపాపలు ఎగిరిపోయాయి

శూన్యాన్ని రెపరెపలాడిస్తున్న దిగులు గూడులో

గాలిదీపమై మిగిలాను

నిజమే నాన్నా! నీ కలలన్నీ అబధ్ధాలే

ఎప్పటికీ శాంతించని యుధ్ధాలే

ఆయుధాల్లేవు

రణరంగమూ లేదు

కలానికి నిజానికి మధ్య సంధి పొసగదు

నడి సముద్రంలో నువ్వు

మరణానికి వీలునామా రాస్తావు

దూరంగా వెలుగుతున్న సంధ్య వొడిలో

తెల్లరే విచ్చుకునే  నీ సూర్య నేత్రం కోసం

నేను చీకటి పహారాలోకెళ్తాను

రెండు దిక్కుల మధ్య ప్రయాణం

ఎంత దూరమో, అంత దగ్గర!

Read Full Post »

Read Full Post »

ఎప్పటిదో ఒక రైలు ప్రయాణపు జ్ఞాపకం
చెట్లు, చేమలు, వూళ్ళు,నీళ్ళు వెనక్కు వెళ్ళిపోతూ
ఎప్పుడు అంతే
జ్ఞాపకం ఒక దాటలేని వంతెన!

ముందూ వెనకల పరిభ్రమణాల మధ్య
చిక్కుకున్న కాల నది
ప్రతి స్మతి ఒక మజీలీనే!

ఈ రైలు ఇప్పుడే ఇక్కడే
ఏదో ఒక మజిలీలోనే ఆగిపోవాలి
వెనక్కు పరుగెత్తుకుంటూ

మాటలు రాని పసితనం
ఓనమాలు దిద్దని చిటికినవ్రేళ్ళలా
అమ్మ వొడిలోకి పరుగెత్తాలి
నాన్నతో కలిసి క్రిష్ణ వొడ్డున నడవాలి
అన్నయ్యలతో తగాదాలాడాలి
అక్కయ్యతో రహస్యాలు చెప్పుకోవాలి
చెల్లెలిపై అజమాయిషి చేయాలి
నా ముద్దుల తమ్ముడిని చిటికిన వేలు పట్టుకుని
స్కూల్ దగ్గర దించాలి

పిచ్చి కలలే కాని
ఇంకా పచ్చి పచ్చిగా
కాలీ కాలని మొక్కజొన్న కండెల్లా
కన్రెప్పల కింద కదలాడుతూనే వున్నాయి

ఈ జ్ఞాపకాలకు అల్జీమర్లు, అమ్నీషియాలు తెలియవు
బెజవాడ సత్యనారాయణపురం రైల్వే గేటు!
అదే మొదటి, చివరి చిరునామా!

కల్పనా రెంటాల

Read Full Post »

నేనొక వరూధినిని
భీతహరిణేక్షణను, తిరస్క్రుతను
వలచిన నేరానికి
దగాపడ్డ వెలయాలిని!
హిమవత్పర్వత సాక్షిగా
దక్కింది నిర్నిద్ర వేదనే!

వలచి వచ్చిన వనితల్ని
మోసగించే మాయప్రవరుల వారసులే మనువులు!

*****

నేనొక శకుంతలను!శాపగ్రస్తను!
ఓ మగవాడి అవ్యక్త స్మ్రుతిని!

నేను మినహా అన్ని గుర్తున్న అతను
అతను వినా మరేమి గుర్తు లేని నేను

ఇద్దరి నిరవధిక సుఖవారాశికి
మనఃప్రక్రుతే మౌనసాక్షి!

అభిజ్ఞానం తప్ప మగని ఆదరణ పొందలేనిదాన్ని!

******

నేను పంచభర్త్రుక ద్రౌపదిని

అర్జునుణ్ణి వలచి అయిదు ముక్కలైనదాన్ని

మగవాడి మాయాజూదంలో ఓ పణాన్ని

నిండు కొలువులో నిలువెత్తు పరాభవం
ఇల్లాలితనమే లేదన్న ధర్మసూనుడు

వంతుల కాపురానికి మిగిలింది
జీవన నటనా విషాదం!
*****

నేను యయాతి పుత్రికను మాధవిని

దురహంకార పురుషజాతి ఆస్తిని

నియోగినిని!నిలువెత్తు సౌందర్యరాశిని!

నలుగురితో సంసారం
నాకు మాత్రం నగుబాటు కాదట

నాది క్షాత్రధర్మమట
నాలుగు పసిమొక్కల క్షేత్రధర్మమట
నిత్య యవ్వనకన్యనట

అకటా!
మగువ మనసు తెలియని వీరా
మహరాజులు!మహర్షులు!మగవారు!

*****

కనుదోయిపై కలల నీలి నీడలు
కాలం చెప్పిన కధల్లో
అందరూ దుఃఖభాగినులే
ఈ స్త్రీపర్వమంతా దుఃఖస్మ్రుతుల దొంతర!

****

ఇప్పుడు నేను మానవిని
అవ్యక్తనూ, పరిత్యక్తనూ కాను
అయోనిజనో, అహల్యనో కాబోను
వంచిత శకుంతల వారసురాలిని అసలే కాను

స్త్రీత్వపు కొలమానం గానే మిగలనింక
నేను అపరాజితను
కనిపించని సంకెళ్ళను ఛేదించే కాళిని
సస్యక్షేత్రాన్నే కాదు, యుద్ధ క్షేత్రాన్ని

సిగ్గుతో చీలిపోయిన భూమిని నేనే
నెర్రెలు విచ్చిన నేలను విశాలమైన బాహువులతో కప్పే ఆకాశాన్ని నేనే!

Read Full Post »

Older Posts »