Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for the ‘Uncategorized’ Category

నేను ఇల్లు మారుతున్నాను. కొత్త ఇంటి అడ్రెస్ ఇక్కడ.

ప్రకటనలు

Read Full Post »

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=40556&Categoryid=1&subcatid=3

AzarNafisi(Sakshi)అజర్ నఫిసీ – ఇరాన్ కు చెందిన అంతర్జాతీయ రచయిత్రి. ఆమె రాసిన Reading Lolita in Tehran అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు పొందింది. ఆమె కలం నుంచి తాజాగా వెలువడ్డ Things I Have Been Silent About ఇరాన్ లో పుట్టి పెరిగిన ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాల దొంతర. ఇది కేవలం నఫిసీ వ్యక్తిగత జీవితం మాత్రమో, ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర మాత్రమో కాదు. ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర, నఫిసీ కుటుంబ చరిత్ర, ఆమె తల్లితండ్రుల వ్యక్తిగత సంఘర్షణల నేపథ్యాలు అన్నీ కలగలసిపోయిన మెమొరీస్. మనం సమాజంలోని వ్యక్తులుగా, కుటుంబంలోనూ, రాజకీయ జీవనంలోనూ, సాహిత్యంలోనూ ఎలాంటి విషయాల్ని బైటకు వెల్లడి చేయకుండా నిశ్శబ్దంగా లోపల్లోపలే దాచుకుంటామో బహిరంగంగా ప్రకటించింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా.కుటుంబంలోని రహస్యాల పట్ల ఓ కూతురి మౌన వేదన, ఓ నవయవ్వనవతిగా సాహిత్యం లోని సెన్సువాలిటి పవర్ ని కనుగొన్న వైనం, ఓ దేశపు స్వాతంత్ర్యం కోసం ఓ కుటుంబం చెల్లించిన మూల్యం ఇవన్నీ మనకు ఈ పుస్తకం చదవటం ద్వారా అర్ధమవుతాయి.
” చాలా మంది మగవాళ్ళు పరాయి స్త్రీల ప్రాపకం కోసం తమ భార్యల్ని మోసం చేస్తారు. కానీ మా నాన్న సంతోషకరమైన కుటుంబ జీవనం కోసం మా అమ్మ ని మోసం చేశాడు” అంటూ ఈ పుస్తకాన్ని మొదలు పెడుతుంది నఫిసీ. “ఆయన కోసం నేను బాధ పడ్డాను. ఒక రకం గా ఆయన జీవితంలోని ఖాళీల్ని నింపటం అనే బాధ్యతను నాకు నేనే తీసుకున్నాను. నేను ఆయన కవితలు సేకరించాను. ఆయన వాగ్దానాల్ని విన్నాను. మొదట మా అమ్మ కోసం, తర్వాత ఆయన ప్రేమలో పడ్డ స్త్రీల కోసం సరైన బహుమతుల ఎంపికలో ఆయనకు సహకరించాను.” అంటూ చెప్పుకొస్తుంది నఫిసీ ఈ పుస్తక ప్రారంభంలో.

అద్భుతమైన కధకురాలు చెప్పిన అందమైన జ్ఞాపకాలు ఈ పుస్తకం. అవి మనసుని మెలిపెట్టి బాధపెట్టే జ్ఞాపకాలు. నఫిసీ ఈ పుస్తకంలో ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో చెప్పటమే కాకుండా మనం ఎందుకు వివిధ దేశాల చరిత్ర చదవటం అవసరమో వివరిస్తుంది. ఏ దేశ చరిత్ర తెలియాలన్నా ముందు ఆ దేశ సాహిత్యం చదవటం ముఖ్యమంటుంది అజర్ నఫిసీ. నఫిసీ తల్లి మేధావే కాదు, చాలా కాంప్లికేటెడ్ కూడా. ఆమె తన కలల్లో తనకంటూ ఓ సృజనాత్మక సాహిత్య లోకాన్ని సృష్టించుకొని అందులో బతికింది. ఆమె చెప్పిన కథలు, ఆమె కథనం ఇవన్నీ నఫిసీ కి క్రమంగా అర్ధమవటం వల్ల ఆ కథనాల్లో దాగి వున్న తన తల్లికి సంబంధించిన అసలు విషయాన్ని అవగతం చేసుకోగలిగింది.
నఫిసీ తండ్రి మరో రకమైన ‘ నేరేటివ్స్ ‘ వైపు మళ్ళాడు. ఇరాన్ దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన సంప్రదాయ కథలు ‘ షానామే’,( Shahnameh- పర్షియన్ రాజుల గురించిన పుస్తకం) వైపు మొగ్గు చూపి తన పిల్లలను పసితనం నుండి ఆ కథల ద్వారా మంత్రముగ్ధుల్ని చేసేవాడు. నఫిసీ తండ్రి ఇతర స్త్రీలతో పరిచయాలు పెంచుకొని, వారితో సంబంధాలు పెట్టుకోవడం గమనించినా, పసితనం నుంచి నఫిసీ ఈ రహస్యాలన్నింటినీ తల్లి దగ్గర నుంచి దాచిపెట్టింది. ఈ ప్రభావం వల్ల నఫిసీ తర్వాతర్వాత రాజకీయ, సాంస్కృతిక , సామాజిక, వ్యక్తిగత విషయాల్లో కూడా అన్యాయాల్ని ఎలా మౌనంగా ఎదిరించకుండా వుండిపోయిందో పాఠకులకు అర్ధమవుతుంది.
ఈ పుస్తకం బలమైన చారిత్రక అక్షర చిత్రం– ఒక కుటుంబంలోని మార్పు, ఒక దేశంలోని రాజకీయ వ్యవస్థ మార్పు –రెండూ ఎలా కలగలిసి వుంటాయో ఈ ‘ మెమోయర్ ‘ ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. నఫిసీకి ఇష్టమైన ఇరాన్, మనందరం కూడా ప్రేమించే ఇరాన్ క్రమేపీ ఒక మతపరమైన నిరంకుశ, నియంతృత్వ పాలనలోకి ఎలా మళ్ళిందో మనకు తేటతెల్లంగా అర్ధమవుతుంది. ఇరాన్ లో స్త్రీలకున్న ఛాయిస్ లపై చాలా లోతైన, వ్యక్తిగత విశ్లేషణ చేసింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా. వీటి ద్వారా నఫిసీ భిన్నమైన జీవితాన్ని ఎన్నుకోవటానికి ఎలా వుత్తేజపరిచిందో చెపుతుంది. ఓ స్త్రీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవి. వ్యక్తిగత, కుటుంబ, కల్లోలిత మాతృభూమి జ్ఞాపకాలివి.
కథలు చెప్పటం ఆ కుటుంబంలో అందరికీ వెన్నతో పెట్టిన విద్య. నఫిసీ తల్లి తన అసంతృప్తులను తప్పించుకోవటానికి తన వూహా ప్రపంచాన్ని వాస్తవిక ప్రపంచంగా పిల్లలకు కథలుగా చెప్పేది. నఫిసీ తండ్రి ఇరాన్ దేశ రాజుల చరిత్రను, పర్షియను సాహిత్యాన్ని పిల్లలకు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు కథలుగా చెప్పెవాడు.నఫిసీ తల్లి కథలు రాయదు కానీ, తన గత జీవితాన్ని కథలుగా మలిచి పిల్లలకు చెప్పేది. ప్రతి కథ చివర్లో ఆమె ఇలా ముగించేది ” అయితే నేనొక్క మాట కూడా అనలేదు. నిశ్శబ్దంగా వుండిపోయాను” అని. నఫిసీ తల్లి నిజంగానే బలంగా నమ్మేది ” తనెప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పలేదని”. అయితే తనదైన శైలిలో ఆమె ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంలోని గత స్మృతుల గురించే పిల్లలతో మాట్లాడేది. వ్యక్తిగత విషయాలు బైటకు వెల్లడి చేయకపోవటమనేది ఇరానీ సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశం. నఫిసీ తల్లి ఎప్పుడూ అంటుండేదట ..” మన మురికి దుస్తుల్ని మనం బైట ఆరెయ్యం” అని. పైగా వ్యక్తిగత జీవితాలనేవి అల్పమైన విషయాలతో కూడుకొని వుంటాయి. వాటి గురించి రాసుకునేంత ఏముంటాయి? అందరికీ ఉపయోగపడే జీవిత చరిత్రలు ముఖ్యమైనవని నఫిసీ తల్లి అభిప్రాయం. అయితే నఫిసీ కి తెలుసు ఇక ఎప్పటికీ తాను నిశ్శబ్దంగా వుండకూడదని…అందుకే తన గురించి, తన తల్లితండ్రుల గురించి, తన కుటుంబాన్ని గురించి, తన దేశాన్ని గురించి, ఇరాన్ రాజకీయ వ్యవస్థ గురించి అన్నింటి గురించి బాహాటంగా ఈ పుస్తకం లో మాట్లాడేసింది.
అందుకే నఫిసీ అంటుంది ” మనం నిశ్శబ్దంగా వుంటున్నామనుకుంటాం కానీ నిజంగా వుండం. ఎలాగంటే ఏదొ ఒక రకంగా మనకేం జరిగిందో అన్న దాని బట్టి మనమెలా మారామో, మనమెలా రూపుదిద్దుకున్నామో అన్నది మనం ఏదో ఒక రకంగా వ్యక్తీకరిస్తూనే వుంటాము” అని.
నఫిసీ తండ్రి పర్షియన్ సాహిత్యంలోని సంప్రదాయ కావ్యాల ద్వారా ఆ దేశ చరిత్రను తన పిల్లలకు కథల రూపంలో అందించాడు. ఆ సాహిత్యం ద్వారానే వాళ్ళకు ఇరాన్ దేశ చరిత్ర గురించి అర్ధమైంది. అందుకే నఫిసీ అంటుంది పిరదౌసినీ మర్చిపోవడమంటే ఇరాన్ ని నిర్లక్ష్యం చేయడం అని. ఇటీవల ఆస్టిన్ లో యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్ వారు అజర్ నఫిసీ తో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఇదే మాట చెప్పింది. మన దేశ సాహిత్యకారుల్ని గుర్తుంచుకోవడం, వారి రచనల్ని మననం చేసుకోవడమంటే మాతృ దేశం పట్ల మనకున్న భక్తిప్రపత్తులను పరిపుష్టం చేసుకోవడమే అంటుంది నఫిసీ తన ప్రసంగంలో, తన పుస్తకంలో, తన మాటల్లో…
ఈ పుస్తకాన్ని ఒక రాజకీయ లేదా సాంఘిక కామెంటరీ లాగానో, లేదా ఉపయోగపడే జీవిత చరిత్ర లాగానో వుండాలని నఫిసీ కోరుకోలేదు. ఆమె ఒక కుటుంబ కథ చెప్పాలనుకున్నది. ఆ కథ ద్వారా ఇరాన్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర తెలియ చెప్పాలన్నది ఆమె వుద్దేశ్యం. అది ఖచ్చితం గా నూటికి నూరుపాళ్ళు నెరవేరింది. ఇరాన్ వున్నంత కాలం చరిత్ర, సాహిత్యం రెండూ అజర్ నఫిసీ ని మర్చిపోవు. మర్చిపోలేవు.

కల్పనారెంటాల

Read Full Post »

తెలుగు కథాచర్చ -రెండవ భాగం
కథావిమర్శ (చర్చ) – రెండోభాగం : వ్యాఖ్యలూ, విమర్శలూ, సంపాదకులధోరణిలో మార్పులు
ఈ చర్చ మొదటి భాగం ఇక్కడ.

కల్పనః మాలతిగారు, క్రితంసారి మనం కధలగురించి మాట్లాడుకున్నప్పుడు మంచి కధలగురించి తర్వాత మాట్లాడాలనుకున్నాము కదా! అసలు మంచికథ అంటే ఏమిటి? ఎలా నిర్ణయిస్తాం ఏది మంచికథో?

మాలతిః ఏమో మరి. కొన్నాళ్లపాటు నేను కూడా చాలామంది విమర్శకులలాగే, ప్రారంభం, ముగింపూ, సన్నివేశాలూ, సంఘర్షణలూ, పాత్రపోషణ అంటూ కొన్ని కొలమానాలు అవసరం అనుకున్నాను కానీ, ఆలోచించినకొద్దీ అలాటి కొలతల్లో ఇమడకపోయినా, పాఠకుల ఆదరణ పొందినరచనలు కనిపిస్తున్నాయి. అలా చూసినప్పుడు, మనం కథని ఇలా ఒక చట్రంలో బిగించడం రచయితలభావుకతకి ప్రతిబంధకం అనిపిస్తోంది. అంచేత మంచికథ ఏదీ అనడం కంటే నేను ఎందుకు రాస్తున్నాను అంటే చెప్పగలనేమో. మరి నీ అభిప్రాయంలో మంచి కథ అంటే ఎలా వుండాలి?

కల్పనః ఏది మంచికధగా గుర్తించబడుతోంది? లేదా పాఠకులదృష్టిలో ఏది మంచికధ? అనేది ఒక ప్రశ్న అయితే, రచయితదృష్టిలో, సంపాదకులదృష్టిలో మంచికధ అనుకున్నది పాఠకులకు మంచి కధ అవుతోందా, లేదా? అనేది ఇంకో ప్రశ్న. మీరు చెప్పిన కొలమానాలు అవసరమే. అయితే అవి మాత్రమే కధ కాదు. ఇంతకుముందు మనం చాట్‌లో చెప్పుకున్నట్టు ఈనాటి కధాస్వరూపం మారింది అని నేననుకుంటున్నాను. అందుకే narratives కూడా కధలవుతున్నాయి. వీటినన్నింటిని గుర్తించి, అర్ధం చేసుకున్న అవగాహనతో మాత్రమే మనం మంచికధ అంటే ఏమిటి అని మాట్లాడుకోవాలంటాను నేను. మీరేమంటారు? అసలు మీరెందుకు కధలు రాస్తారో చెప్పండి పోనీ.

మాలతిః ఎందుకు రాస్తున్నానంటే, మనకి తోచిన ఆలోచనలు అభివ్యక్తం చెయ్యడం, పక్కవారితో చెప్పుకోవడం మానవనైజం కనక. మనం గమనించినవిషయం – అందరికీ తెలిసినదే అయినా ఎవరూ పట్టించుకోనివిషయం అయినప్పుడూ, ఎవరూ గమనించలేదు – అదేలే నాకు తెలిసినంతలో – అనిపించినప్పుడు రాయాలనిపిస్తుంది నాకు.
ఉదాహరణకి, ఈమధ్య పొద్దు.నెట్‌లో ప్రచురించిన “నాకోసం” కధ చూడు. ఈరోజుల్లో ఉద్యోగాలు దొరకడం కష్టంగా వుంది. దానికోసం పడేపాట్లు చాలా కథల్లో వస్తున్నాయి. అయితే మేథస్సు వుండి కూడా ఒకరకమైన స్వోత్కర్షతో, సీరియస్‌గా ఉద్యోగాన్యేషణ చెయ్యనివాళ్లు కూడా వుంటారన్నది అందులో ఒక అంశం. ఇది అమెరికాలోనేనా కావచ్చు. ఇండియాలోనేనా కావచ్చు. రెండోది, ఈనాటి స్త్రీలు విద్యమూలంగా ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం సంతరించుకున్నవారు. స్త్రీలకి గల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం సంసారంలో కలతలకీ, ఈతి బాధలకీ కారణమవుతున్నాయి అన్నది రెండో అంశం. ఎవరు ఎవరికోసం ఏమిటి త్యాగం చేస్తున్నారన్నది ఇదమిత్థమని మనం చెప్పలేకపోవచ్చు. కానీ ప్రాథమికంగా పాఠకులు గమనించవలసినవి ఈరెండు అంశాలూ నాకథలో. ఈ యువతీ, యువకుల మనస్తత్త్వాలు పాఠకులముందు పెట్టడమే ఈకథలో నేను చెయ్యదలుచుకున్నది. మొదటి డ్రాఫ్టులో ఇందులో సగమే రాసేను. కొందరు స్నేహితులకి చూపించి, వాళ్ల సలహాలు విని, మరికొన్ని సన్నివేశాలు చేర్చి మరింత వివరించడానికి ప్రయత్నించేను. దీనిమీద వచ్చినవ్యాఖ్యలగురించి తరవాత మాటాడుకుందాం.
నువ్వు నీకథ, అయిదోగోడ తీసుకుంటే, అందులో నువ్వు కూడా ఇలాగే చేస్తున్నట్టు అనిపించింది నాకు. నువ్వే ఆతరవాతిటపాలో రాసినట్టు, వయసుమళ్లినమగవాడు మళ్లీ పెళ్లి చేసుకోడంమీద చాలా కథలే వచ్చాయి కానీ వయసు మళ్లినస్త్రీ పునర్వివాహం చేసుకోడంమీద కథలు రాలేదు. అంచేత అది తప్పకుండా రాయవలసినకథ అని నేను అనుకుంటున్నాను. ఏమంటావు?
నువ్వు కథలు రాయడం మొదలుపెట్టినప్పటికీ, ఇప్పటికీ ఏమయినా తేడా వుందా? ఈనాటి విమర్శనాపద్ధతులగురించి నీ అభిప్రాయం ఏమిటి? ఇజాలు ప్రాతిపదికగా మంచికథ రాయడం సాధ్యం కాదా? మరోలా అడగాలంటే, చిన్నకథల్లో సిద్ధాంతపరంగా చర్చ చొప్పించి ఒప్పించడం సాధ్యమే అంటావా?
కల్పనః నా కధలు ప్రధాన అలోచనా స్రవంతిని ప్రశ్నించటం వల్ల కొంత భిన్నంగా కనిపించవచ్చు. చాలామందికి నా కధలు నచ్చకపోవచ్చు, నేను తీసుకునే ఇతివృత్తాల వల్ల. అయితే ఇలా ప్రశ్నించే కధల్ని ఏదో ఒక ” ఇజం” ముద్ర వేసి వాటికి సాహిత్య విలువ లేదని చెప్పేయటం తెలుగు నాట కొందరు విమర్శకులకు, ఇప్పుడు కొత్తగా కొందరు బ్లాగ్ పాఠకులకు అలవాటైపోయింది. అసలు “ఇజాలు” మనుషులకోసం పుట్టాయా? లేక మనుషులు “ఇజాల”కోసం పుట్టారా? ఒక కధలో “ఇజం” వుంది అని ముద్ర వేసి వెలి వేసేవారు, మౌనంగా కూడా తిరస్కరించేవారు, ఫలానాచోట మీరు “ఇజం” మాట్లాడారు, లేదా కధలో బలవంతంగా చొప్పించారు అని చూపిస్తే, నిజంగా ఏ రచయత అయినా అది ప్రయత్నపూర్వకంగా చేస్తే ఆ తప్పును దిద్దుకునే అవకాశం వుంటుంది.
Marital rape గురించి మాట్లాడటం ఇజమా? ఒక స్త్రీ రెండో పెళ్ళి చేసుకోవడం అంత సులభం కాదు. దానిచుట్టూ బోలెడన్ని మనకే తెలియని myths వున్నయని చెప్పటం ఇజమా?
కాలం ముందుకెళ్ళింది అని జబ్బలు చరుచుకునే కుహనా మేధావులకు కూడా తెలుసు ఒక స్త్రీ పెళ్ళి చేసుకోవాలంటే, ఆ పెళ్ళి చుట్టూ అల్లుకొని వున్న అనేకానేకా గృహ, శారీరక, సామాజిక హింసలు. జీవితం వాదన కాదు. కాని కొన్ని సమస్యలు చెప్పేటప్పుడు కధలో పాత్రలమధ్య వాదనద్వారా ఎన్నో విషయాలు చెప్పాల్సి వస్తుంది. అది కధనశైలికి నష్టము అయితే కావచ్చు గాక, కాని ఒక అంశం గురించి, అందులో వుండే బాధ గురించి ఎక్కువ అర్ధం అవటానికి అవకాశం వుంటుంది. మీరు చెప్పిన ద్వని, వక్రోక్తి లాంటి వాటితో నేటి తరం స్త్రీలు పడే ఇబ్బందులమీద కధ రాసి మెప్పించటం ఆసాధ్యమేమి కాదు కాని నాకు ఇష్టం లేదు. స్వేచ్చగా open గా మాట్లాడతాయి నా పాత్రలు.
ఇవే కధలు ఒక పురుషుడు రాస్తే, దానికి వచ్చే response ఖచ్చితంగా భిన్నంగా వుంటుందని నేను చెప్పగలను.
ఒక ఏడాదిక్రితం అనుకుంటాను. ఇక్కడే బ్లాగ్ లో ఒక కధ చదివాను. నాకు ఆ బ్లాగుపేరు కాని, రచయితపేరు కాని గుర్తు లేవు. వుంటే తప్పక చెప్పేదాన్ని. ఆ ఇతివృత్తం అందరికీ తెలుసు, ఎందుకంటే దాన్ని ఒక చిన్న జోకు గా ఒక సినిమాలో వాడటం వల్ల.
ఇండియాలో వున్న ఒక అమ్మాయి గ్రీన్ కార్డ్ కోసం అది వున్న అబ్బాయిని పెళ్ళి చేసుకొని అమెరికా రాగానే విమానాశ్రయంలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ కధ అందరికీ నచ్చింది. దానిగురించి రచయిత చెప్పిన వివరణ ఏమిటంటే అలాంటి సంఘటనలు జరిగినట్టు ఆయనకు తెలుసట. నిజానికి అలాంటివి ఎన్నివేలల్లో ఒకటో, రెండో జరగవచ్చు. కాని కధద్వారా చాలామందికి తెలిసేలా ఆ రచయిత ప్రయత్నించారు. ఆ కధకి అర్ధం అమెరికాకు వచ్చే ఆడవాళ్ళంతా అలా చేస్తున్నరనా? లేక ఆయన ఇలాంటి కధలద్వారా స్త్రీలను కించపరుస్తున్నారనా? దీనికి ఎవరికి వారు ఎలా కావాలంటే అలా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. నాకు గుర్తు వున్నంతవరకు నేను తప్ప ఆ కధ ఇతివృత్తం గురించి వేరెవ్వరు మాట్లాడలేదు అక్కడ.
అలాగే, ఎవరో ఒకావిడను భర్త ప్రతి రోజు పెట్టే శారీరక హింస గురించి మనం ఒక కధ రాస్తే, ఇలా జరగదు, ఇవి feminism కధలు, అంటూ అడ్డదిడ్డంగా వ్యాఖ్యానిస్తుంటే అలాంటివాళ్ళకు ఏమి సమాధానం చెప్తాము? మాకు తెలిసిన ఒకావిడకు ఇలా జరిగింది, అది నేను కధ గా రాశాను అని సాక్ష్యం చూపించాలా?
కాబట్టి కధలంటే జీవితాలే. అయితే కొన్ని సంఘటనలు కధలరూపం గా వచ్చినప్పుడు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. ఒక రచయతగా నాకర్తవ్యం నేను రాయాలనుకున్నది రాసుకుంటూ పోవడమే. ఎక్కడో ఒకచోట నాకధలతో relate చేసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ personal letters రాసే పాఠకులు వుంటూనే వున్నారు. వాళ్ళ కోసమే ఆ కధలు.
ఇవి బ్లాగుల్లో నా కధల అనుభవాలు. మరి మీ కధల్ని పాఠకులు ఎలా ఆదరిస్తున్నారు?
మాలతిః పైన చెప్పేను కదా ఏ కథకయినా పాఠకులు వుంటూనే వున్నారు. అయితే కొన్ని వ్యాఖ్యలు మాత్రం ప్రధానాంశానికి సంబంధం లేకుండా వుంటున్నాయి. ఉదాహరణకి ఒక వ్యాఖ్యాత నా కథ “నీకోసం”లో నేను stay-at-home dadsని తక్కువగా మాట్లాడేనన్నారు. నిజానికి వాళ్లు పిల్లలని చూసుకోడమో, మరేదో పని ఇంట్లో వుండి చేయగలిగినది చేస్తారు అని స్పష్టంగానే రాసేను. ఆవ్యాఖ్యాత కాస్త శ్రమపడి కథ సరిగ్గా చదివి వుంటే ఆవ్యాఖ్యానం చేసి వుండేవాడు కాదు. ఇలాటి వ్యాఖ్యానాలకి ఏం సమాధానం చెప్తాం? అలాగే మరో వ్యాఖ్య కూడాను. నేను స్త్రీలు నిర్వహించే గృహకృత్యాలని తక్కువ చేసి మాటాడేనన్నారు. కథలో ఆవాక్యం సందర్భం చూడు. అది ధరణి ఆలోచన. ఒకసందర్భంలో ఒకసామెత మనసులోకి రావడం వేరు. రచయిత లేక కథకుడు కేటగారికల్‌గా తనఅభిప్రాయాలు కథలో చొప్పించడం వేరు. ఈధోరణి – పాత్రచేత అనిపించిన మాటని రచయితఅభిప్రాయంగా గుర్తించడం నాకు మొదట అసందర్భంగా కనిపించింది. ఇలాటివి చాలా వ్యాఖ్యలు చూసేక, నాకు తోచింది ఏమిటంటే, నాకథ ఆధారంగా పాఠకులు వాళ్లకి తోచిన ఆలోచనలు వాళ్లు చెప్తున్నారని. నేను చెప్పనివిషయాలు పాఠకులకి స్ఫురిస్తే, వాళ్లు మరోకథ రాస్తున్నారనుకుంటాను. బహుశా, నాకథకి అది మరో ప్రయోజనమేమో.
మరోలా చెప్పాలంటే నాకు వ్యాఖ్యలు మూడురకాలుగా కనిపిస్తున్నాయి.
1. “అలా ఎవరూ మాటాడరు” అలా ఎవరూ చెయ్యరు” అనేవి ఒక రకం. ఇలాటివ్యాఖ్యానాలు చేసేవారు తమకి తెలిసినలోకమే తప్ప అంతకుమించి ఇంకా ప్రపంచం వుందనీ, కొన్ని కోట్లప్రజలు వున్నారనీ, వాళ్లు వేరేవిధంగా ప్రవర్తించవచ్చనీ అంగీకరించలేరు. అలా అంగీకరించడానికి openmindedness కావాలి. దీన్నే “willing suspension of disbelief” అన్నాడు Wordsworth. ఆయన కవిత్వం విషయంలో అన్నా కథకి కూడా కొంతవరకూ అది అవసరమనే నేను అనుకుంటాను. అంటే మన నమ్మకాల్ని, మనకి పరిచయమయిన ప్రపంచాన్నీ కాస్సేపు పక్కన పెట్టేసి, కథలో లీనమయిపోవాలి. కథ చదువుతున్నంతసేపూ ఆకథే మొత్తం ప్రపంచం. అప్పుడే, పాత్రలూ, సంఘటనలూ అర్థం అవుతాయి.
అంతేగానీ, ఎవరో “అలా జరగదు” “మనుషులు అలా వుండరు” అన్నారని నేను వాళ్లకి ఋజువులూ, సాక్ష్యాలూ చూపించి వాళ్లని నమ్మించాలనుకోను. పాఠకులు తమఇళ్లలో ప్రశాంతంగా కడుపులో చల్ల కదలకుండా కూర్చుని తమనమ్మకాలతో రోజులు గడుపుకుంటాం అంటే నేనెవర్ని కాదనడానికి. నేను మాత్రం, నాదృష్టిలోకి వచ్చినవి, నేను రాయాలనుకున్నవి రాసుకుంటాను.
కల్పనః ఇలాటిపాఠకులు కథలలో ఏమిటి ఆశిస్తారంటారు? నేననుకుంటాను, పాఠకులు తమ అభిప్రాయాలకు దగ్గరగా వున్న కధల్ని రచయతలనుండి ఆశిస్తారు. అలా కాకుండా మనం భిన్నంగా చెప్తే వాళ్ళకు నచ్చకపోవచ్చు.
మాలతిః నిజమే. నేనూ అలాగే అనుకుంటున్నాను. బహుశా తమకి తెలిసినవీ, తమ నమ్మకాలని ధృవపరిచేవి అయితేనే చదివి ఆనందించగలరేమో వారు.
2. ఇక రెండోరకం వ్యాఖ్యాతలు మనకథలోనుండి మరోకోణం లాగుతారు. కథలో ఏదో ఒక అంశమో, వాక్యమో తీసుకుని ఆలోచిస్తూ ఆ ఆలోచనవెంట మరోవైపుకి పోతారు tangentially. ఇలా చెయ్యడంవల్ల నేను కథలో అనుకోని కోణాలు ప్రదర్శితమవుతాయి. ఆ అంశాలు కథలో కలపడానికి అవకాశం లేకపోవచ్చు కానీ, కొత్తవిషయాలు తెలియడం జరుగుతుంది. ఇది కూడా బ్లాగుల్లో మాత్రమే జరుగుతోంది కానీ సాంప్రదాయకంగా విమర్శలు చేస్తున్నప్పుడు కనిపించదు.
3. మూడో రకం వ్యాఖ్యానాలు కథని విశ్లేషిస్తూ చేసినవి. కథలో ప్రధానాంశం, శైలీ, శిల్పంమీద చేసిన వ్యాఖ్యానాలు. ఉదాహరణకి నాకథమీద “ఆకథలో సింప్లిసిటీ లేదు. లోతు లేదు” అన్నవ్యాఖ్య తీసుకో.
ఈమధ్య “లోతు లేదు” అన్నమాట తరుచూ వింటున్నాను. కథలో లోతు ఎలా వస్తుంది అని చాలా ఆలోచించేను. సీదాగా “ధరణి దినకర్‌ని ఉద్యోగం చూసుకోమంది. అతను చూసుకోలేదు.” అంటూ ఏకోన్ముఖంగా కథ చెప్పుకుపోవడం ఒక పద్ధతి. రెండోపద్ధతిలో ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించేడు అని మాత్రమే కాక, అలా ఎందుకు ప్రవర్తించేడు, తన ప్రవర్తనని ఎలా సమర్థించుకుంటాడు, ఆ ప్రవర్తన ఎదటివారికి ఎలా కనిపిస్తుంది, వారికి కలిగిన అభిప్రాయానికి వెనక వారి సమర్థన ఏమిటి – ఇలా విస్తరించుకుపోవడమే కథలో “లోతు” అని నేను అనుకుంటున్నాను. అయితే ఇలా విస్తరించినప్పుడు కొంత అయోమయానికి ఆస్కారం వుంది కానీ సింప్లిసిటీ సాధ్యం కాదు. నామటుకు నాకు ఆరెండూ పరస్పర విరుద్ధం అనిపిస్తోంది.
కల్పనః మీరు మొదటినుంచి కధారచయిత్రి అయినప్పటికి, బ్లాగ్‌ కోసం నిరంతరం కొత్తగా కూడా కధలు, చిన్న చిన్న స్కెచెస్ లాంటివి, సాహిత్య విమర్శలాంటివి రాస్తున్నారు కాబట్టి మీకు ఈ పాఠకులకామెంట్లు, వారిధోరణి బాగా అర్ధమైనట్టు వుంది. పాఠకులగురించి మీ విశ్లేషణ బావుంది.
అయితే నాకు మాత్రం బ్లాగ్ పాఠకులధోరణి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. ఎందుకంటే, నేను నాబ్లాగుకోసమంటూ, బ్లాగ్ పాఠకుల కోసమంటూ ఏమీ రాయలేదు. నేను వేరే పత్రికలకోసం ఇంతకుముందు రాసినవి, ప్రచురితమైనవి ఇక్కడ నాబ్లాగ్‌లో పెట్టుకుంటున్నాను.
మాలతిః ఈనాటిసంపాదకులధోరణిలో మార్పు వచ్చింది కదా. నీ అనుభవంలో ఆమార్పువల్ల లాభనష్టాలు ఏమిటంటావు?
కల్పనః సంపాదకుల ధోరణి అంటే పండితారాధ్యుల, పురాణం, నార్ల, పొత్తూరి, ఏబికే, దీక్షితులు, రామచంద్రమూర్తి, ఎంవీఆర్ శాస్త్రి, వేమూరి బలరాం, కనకాంబరరాజు ఇంతమందిగురించి నాకు అంతో, ఇంతో బాగానే తెలుసు. అంటే వ్యక్తిగతంగా తెలియటం కాదు, సంపాదకులుగా వారి వారి పధ్ధతులగురించి. కధల ఎంపిక గురించి నాకన్న మీరే ఎక్కువ వివరాలు చెప్పగలరు.

మాలతిః లేదులే. ఏవో ఒకటి రెండు పేర్లు విన్నవే అయినా వారిగురించి నేను చెప్పగలిగినది అట్టే లేదు. నాఅనుభవం చెప్తాను. నాచిన్నతనంలో సంపాదకులు వ్యక్తిగతంగా పరిచయం వున్నరచయితలకి సూచనలు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆరోజుల్లో గోరాశాస్త్రి, నార్ల వెంకటేశ్వరరావు, పురాణం వంటి పత్రికాసంపాదకులు ఏవో చిన్న చిన్న సూచనలు చేసేరనుకుంటాను. కానీ, నాకు అలాటి పరిచయాలు లేవు కనక నాకథలు అంగీకరించడమో, అంగీకరింపబడకపోవడమో మాత్రమే జరిగేది. అంతే.
నాకు తెలిసి, సంపాదకులు, అదీ నెట్ పత్రికలే విస్తృతంగా సూచనలు ఇవ్వడం ఇప్పుడే మొదలయింది. ఒకొక్కప్పుడు మంచి తప్పులే ఎత్తి చూపుతున్నారు. నా “పెంపకం”కథలో ఒకే పాత్రకి రెండు పేర్లు పెట్టేను పొరపాటున. అలాగే, “నాకోసం” కథలో దినకర్ ఉద్యోగంవిషయంలో టైమ్‌లైను సరిగ్గా చూసుకోలేదు. ఇలాటివి ఎత్తి చూపితే సంతోషంగా అంగీకరిస్తాను. ఇవి factual errors కనక. కానీ, కథలో సన్నివేశాలూ, శైలీ మార్చమనడం, ఎంత మర్యాదగా చెప్పినా ఉచితం కాదనే నానమ్మకం. రచయితలే అలాటి కోణాలగురించి అడిగితే అది వేరే దారి.
నాకు మరొక సందేహం కూడా వస్తోంది. సంపాదకులు ఒక కథమీద సూచనలు ఇస్తున్నప్పుడు వారు తమ పాఠకులని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నారా, లేక, తమ స్వంత అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారా? అని. ఇలా తాము సంస్కరణలు సూచించి, అలా సరిదిద్దబడినకథని పాఠకులు ఇతోధికంగా ఆదరిస్తున్నట్టు దాఖలాలు ఏమైనా వున్నాయా?
ఈమధ్య “మంచికథలు రావడంలేదు” అన్న అభియోగం తరుచూ వింటున్నాం. మరి సంపాదకులు ఇలా పూనుకుని కథలు సరిదిద్దడంమూలంగా కథల్లో వాసి ఏమైనా పెరిగిందా?
నేను కూడా సంపాదకురాలినే కనక, నేను ఏం చేస్తున్నానో చెప్తాను. తూలికకి వచ్చిన అనువాదాలు చూసినప్పుడు రెండు అంశాలు చూస్తాను.
(1) కథాంశం నా సైటుపాలసీకి అనుగుణంగా వుందా, లేదా?
(2) అందులో భాష మనసంస్కృతి తెలియనివారికి అర్థం అయేలా వుందా, లేదా? అని. లేకపోతే ఒకటో రెండో పేరాల్లో నేను కొంత మార్చి చూపిస్తాను ఎలా వుంటే బాగుంటుందనుకుంటున్నానో. అయినా అది వేరే ప్లాట్‌ఫారం కనక నా పాలసీ ఇక్కడ పనికిరాదేమో.
సరే, కల్పనా, ఇలా మాటాడుతూంటే, మనకి అర్థమవుతున్నది మంచి కథ అన్న పదానికి నిర్దుష్టమయిన ఒక నిర్వచనం లేదనే. పాఠకులు ఎంతమంది వున్నారో అన్ని నిర్వచనాలు. ఇక్కడ పాఠకులంటే చదివేవారందరూ, రచయితలూ, సంపాదకులతో సహా. ఇప్పటికే చాలా పెద్ద చాటు అయిపోయింది. ఈనాటికి సరిపెడదాం. ఇంక ఇది చదివిన పాఠకులు ఏమంటారో చూద్దాం..

http://pustakam.net/?p=1460

Read Full Post »

సారీ వసంతా!

 9-10balagopal

బాలగోపాల్ కన్నుమూత–ఒక నమ్మలేని నిజం. మానవ హక్కుల కోసం నిరంతరం శ్రమించి ఇక సెలవంటూ చెరగని సంతకం పెట్టి వెళ్ళిపోయిన ఆత్మీయ మిత్రుడు బాలగోపాల్ మరణం సామాజికం గా ఒక పెద్ద లోటే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాకు, అఫ్సర్ కి  ఒక పెద్ద షాక్.

బాలగోపాల్ సహచరి వసంత నాకున్న మంచి స్నేహితుల్లో ఒకరు. విజయవాడ నుంచో, అనంతపురం నుంచో హైదరాబాద్  వెళితే మా మకాం వసంత ఇంట్లోనే. అప్పుడు బాలగోపాల్ తో ఎన్నో వ్యక్తిగత జ్ఞాపకాలు. బాలగోపాల్ ఉద్యమ జీవితం గురించి, పీడిత ప్రజల పట్ల ఆయన నిబధ్ధత గురించి పత్రికల్లో వివరంగా వ్యాసాలు వచ్చాయి. కాబట్టి ప్రత్యేకంగా నేనిక్కడ మళ్ళీ రాయనక్కరలేదు. నాకు బాలగోపాల్  కుటుంబంతో వున్న వ్యక్తిగత జ్ఞాపకాలు కొన్ని పంచుకోవటం నాకు దుఖ్ఖోపశాంతి.

నాకు, వసంత ల మధ్య స్నేహం ఎన్నో ఏళ్ళది. ఇన్నేళ్ళ స్నేహంలో ఎన్నొ మరణ వార్తల్ని ఇద్దరం కలిసి పంచుకున్నాము. మా సహచర జర్నలిస్టు మిత్రులు అర్ధాంతరం గా కన్ను మూసినప్పుడు ఎన్నో సార్లు కలిసి బాధపడ్డాము. అలాంటిది ఇప్పుడు తనకే ఒక దుఖ్ఖం వచ్చినప్పుడు నేను తన దగ్గర లేకపోవటం, ఇంత దూరం నుంచి కేవలం ఫొను లో నాలుగు పొడిపొడి మాటలు మాట్లాడటం కూడా సాధ్యపడలేదు. సహచరుడ్ని  పోగొట్టుకున్న స్నేహితురాలిని పొదివి పట్టుకోవాలని ఎవరికి వుండదు? వాళ్ళ అబ్బాయి అజుబా  ఇంటర్ చదువుతున్నా, వాడిలోని ఆ పసితనపు ఛాయలు  ఈ దుఖ్ఖాన్ని ఎలా తట్టుకుంటాయా అని మా ఆవేదన.

మంచి సంప్రదాయ పండిత వంశంలో పుట్టి కూడా, ఆ వారసత్వాన్ని, ఆ ఛాందస భావాల్ని వదిలించుకొని ఆశయాల్ని, ఆదర్శాల్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన మనీషి మన బాలగోపాల్.బాలగోపాల్ కి తన వ్యక్తిగత జీవితమంటే లెక్క లేదు, తనకేమైనా పర్వాలేదు, తాను నమ్మిన సిధ్ధాంతం, తననే నమ్ముకున్న బాధితులే ఆయనకు ముఖ్యం. అప్పటి స్పీకర్ బాలయోగి విమాన ప్రమాదం లో మరణించినప్పుడు మేమంతా వసంత ఇంట్లో మాట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో పొరపాటున నా మాటల్లో బాలయోగి అనబోయి బాలగోపాల్ అని వచ్చేసింది. వెంటనే సారి చెప్పి సరిదిద్దుకున్నాను.అయితే అప్పుడు బాలగోపాల్ అన్న మాట ఏమిటో తెలుసా…సారి ఎందుకు? నన్ను కూడా ఎప్పుడో ఒకప్పుడు చంపేస్తారని నాకు తెలుసు అని తాపీగా, నిశ్చింతగా అనేసారు. ఆ మాట విని నేను దిగ్భ్రాంతి చెందాను. ఆయనకు మరణం అంటే లెక్కలేనిది అని చాలా మాములుగా ఎందరి గురించో అనేస్తుంటాము. కాని నిజానికి ఆ సందర్భం వస్తే ప్రతి ఒక్కరు ఎంతో కొంత జంకుతారు. కాని ఆ రోజు ఆయన నాతో అన్నట్లు గానే నిర్భయం గా , కష్టసుఖాల్లో తనతో కలిసి నడిచిన తన సహచరి వసంతకి , తను అమితంగా ప్రేమించే కొడుకు అజుబా కి ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయారు.

మిమ్మల్నే   నమ్ముకున్న  మీ కుటుంబ సభ్యులు, బాధిత  ప్రజానీకం  ఏమైపోతారిప్పుడు బాలగోపాల్? మా జ్ఞాపకాల్లో మీరిప్పుడు  ఇంకా అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఆవేశం గా మానవ హక్కుల గురించి ప్రసంగిస్తున్నట్లే వుంది. మీ ప్రసంగాల్లో మీరు వాడే బాష ( వైమనస్కం) లాంటి పదాల మీద నేనింకా మీ ఇంట్లో జోకులేసి మాట్లాడుతున్నట్లే వుంది. మేమేమంటున్నా మీరు  పట్టించుకోనట్లు చిరునవ్వుతో అజుబా గాడి చేత హొం వర్క్ చేయిస్తున్న దృశ్యమే కళ్ళల్లో మెదులుతోంది. హోం వర్క్ అంటే ఒకటి చెప్పాలనిపిస్తోంది. సాధారణం గా బాలాగోపాల్ ఏ వీకెండ్ హైదరాబాద్ లో వుండరు.ఆ మాటకొస్తే అసలు ఆయన్ ఇంట్లో వుండేదే తక్కువ. కుటుంబం కోసం, వ్యక్తిగత సుఖసంతోషాల కోసం ఆయన వెచ్చించే సమయం చాల తక్కువ అన్నది ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు.  వీకెండ్, సెలవు రోజుల్లోనే కాదు, విడిరోజుల్లో కూడా ఆయన కోసం వచ్చే మనుషులతో , ఫోన్లతో బిజీ బిజీ గా వుంటారు. అంత బిజిలో కూడా ఆయన తప్పకుండా చేసే పనులు నాకు తెలిసినవి రెండు. ఒకటి పొద్దుట నిద్ర లేవగానే వసంత కి కాఫి పెట్టి ఇవ్వటం, రెండొది అజుబాకి తనే లెక్కలు మొదలైన హొం వర్క్ చేయించటం. ఎంత మేధావి ఇంట్లొ, బయటా ఎంత సామాన్యం గా వుంటారు అని నాలాంటి వారెందరో ఆశ్చర్యపోతారు ఆయనను చూసి.

మొన్నామధ్య నేను, వసంత ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు ఈ సారి మేము ఇండియా వస్తే ఏమేమి  చేయాలో ప్లాన్లు వేసుకున్నాము. కొత్త కొత్త ప్లేసెస్ వెళ్ళి చూద్దామని, అలాగే ఈ సారి వాళ్ళ ఇంట్లో నాకొచ్చిన శాఖాహరపు వంటలు చేసి పెట్టాలని వంతులు వేసుకున్నాము. ఈ సారి మేము మీ ఇంటికి వచ్చినప్పుడు నిరంతర చైతన్య స్రవంతి లా అటు ఇటు క్షణం కూర్చోకుండా తిరిగే బాలగోపాల్ ఇక వుండడని మనసు కి సర్ది చెప్పుకోవాలి. నిలువెత్తు పుస్తకాల మధ్య , నిరంతరం ఎవరి ఒకరితో సంభాషించే ఆ మనిషి లేకుండా ఆ కుర్చీ ఆయన కోసం ఎదురుచూస్తూ వుంటుంది కాబోలు….

వసంతా! ఇప్పుడు ఈ క్షణంలో మేము హైదరాబాద్ లో మీ ఇంట్లో నీ పక్కన వుండాల్సిన వాళ్ళం ఇక్కడ ఆస్టిన్ లోనో, డల్లాస్ లోనో బాలగోపాల్ సంతాపసభ పెట్టగలమా అన్న ఆలోచనల్లో వున్నాము. ఎవరి మరణ వార్త విన్నా నీకు ఫోన్ చేసి మాట్లాడే నేను ఇప్పుడు మాత్రం ఈ సమయంలో నీకు ఫోన్ చేయలేక, ఫోన్ చేయకుండా వుండలేక అస్థిమితంగా వున్నాను.సారీ వసంతా!.

Read Full Post »

సాక్షి పత్రికలో ఆగస్ట్ 17 న ప్రచురితమైన ఈ వ్యాసం తాలూకు లింక్

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=34209Categoryid=1subcatid=3

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=34209&Categoryid=1&subcatid=3

mayaangelouపుస్తకాలంటే కొన్ని అక్షరాలు, పదాలు, వాక్యాల సంపుటి కాదు. జీవితాన్ని అల్లికబట్టి చూపించే అద్దాలు. రచయతలంటే, మనం ఎక్కడో దారి తప్పి ఎటు వెళ్ళాలో తెలియక దిక్కుతోచక నిలబడిపోతే, మనకు దిశానిర్దేశం చేసే దీపస్థంభాలు. ఇది అక్షర సత్యమని నిరూపించే రచయతల్లో  ఒకరు మాయా ఏంజలో! ఆమె ఫలానా అంటూ ఎలాంటి  ప్రత్యేక పరిచయం చేయనక్కరలేని విశ్వవిఖ్యాత కవయిత్రి, రచయత్రి,నాటకకర్త,  puliTzer Prize finalist. ఆమెను పాతికడుగుల  దూరం నుంచి చూస్తే, సూది పడితే వినపడేంత నిశ్శబ్దంలో ఆమె మాటలు వింటే , ఆమె వాక్ప్రవాహం ముందు మంత్రముగ్ధులైతే ఎలా వుంటుందో అది స్వానుభవంలోకి రావటం నా అదృష్టం.

అది ఒక అక్టోబర్ ఆకురాలు సాయంకాలం. ఆస్టిన్ లోని యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్ లోని  టెక్సాస్ యూనియన్ బాల్ రూం లో ఆమె విశేష ఉపన్యాసం ఏర్పాటైంది.గత నలభై ఏళ్లలో మాయ UT కి వచ్చి ప్రసంగించడం ఇది నాలుగో సారి. open to all అయినా రద్దీ వల్ల అతి కొద్ది మందికి లభించే ఫ్రీ పాస్ లు సంపాదించి అఫ్సర్, నేనూ  మాయా ఏంజలో ప్రసంగానికి వెళ్ళాము. ఫ్రీ పాస్ లతో వెళ్ళినా గంట ముందు వెళ్ళి క్యూ లో నిల్చోవాల్సి వచ్చింది. అక్కడ క్యూ లో నిలబడ్డ అందరి మొహాల్లో ఒక ఉద్విగ్నత కనిపిస్తొంది. నా ముందు నిలబడ్డ  ఒక ఆఫ్రో -అమెరికన్ స్టూడెంట్  ” మీరు ఆమె పుస్తకాలన్నీ చదివారా?” అంటూ పలకరించింది. ఒక్కోసారి ఒక్కో పుస్తకం మనం చదివినప్పటి కన్నా ఆ తర్వాతెప్పుడో జీవితంలో ఏదొ ఒక సందర్భంలో కానీ  అర్ధమైనట్టు అనిపించదని చెపితే పెద్దగా నవ్వేసింది.

యు.టి. టెక్సాస్ యూనియన్ 75 వ వార్షికోత్సవాల సందర్భంగా విశిష్ట వ్యక్తుల ప్రసంగాల్లో భాగంగా మాయా ఏంజలో ప్రసంగం ఏర్పాటైంది. ఆమె వేదిక మీదకు వచ్చినప్పుడు, ప్రసంగించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కూడా  ప్రేక్షకులంతా గౌరవపురస్కారంగా లేచి నిలబడి standing Ovation ఇచ్చారు.దాదాపుగా 70 ఏళ్ళు నిండవస్తున్నా  ఆమె కంఠ స్వరంలో కాని, ఆమె మాటల్లో కాని, ఆమె భావాల్లో కాని ఎక్కడా అణుమాత్రమైనా వృధ్ధాప్యపు ఛాయలు కాని, ఒక్క నిరాశాపూరిత ఆలోచన కాని కనిపించలేదు. ఆమె తన ప్రసంగం ” మీరెప్పుడైనా ఇంద్రధనస్సుని చూసారా?” అంటూ మొదలుపెట్టింది. ఒకొక్కరి జీవితంలో ఎన్నెన్ని ఇంద్రధనస్సులుంటాయో, వాటిని ఎలా కాపాడుకొవాలో, వాటి వెంట ఎలా ప్రయాణించాలో ఆమె తన జీవితం నుంచి కొన్ని కొన్ని సంఘటనలు ఉదహరిస్తూ చెప్పుకొచ్చింది.తన జీవితంలో తల్లి, తమ్ముడు, మామయ్య, తన కొడుకు వీళ్ళంతా రకరకాల జీవితపు దశల్లో ఎలా ఇంద్ర ధనస్సులై కొత్త ఆశల్ని, కొత్త కలల్ని మోసుకొచ్చారో చెపుతుంటే ప్రేక్షకులంతా  పసిపాపలై  ఆ ఏడురంగుల  అనుభూతుల వెంట ప్రయాణించారు.

బాలికగా వున్నపుడే, తల్లి బాయ్ ఫ్రెండ్ వల్ల రేప్ కు గురి కావటం, ఆ తర్వాత పోలిసులు వచ్చి ఆ రేపిస్ట్ హత్యకు గురైన సంఘటన చెప్పినప్పుడు తానెంత భయంకరమైన సంఘర్షణకు గురై, ఆ క్షణం  నుంచి ఆరేళ్ళపాటు ఒక్క మాట కూడా మాట్లడలేక గొంతు మూగబొయిందో ఆమె మాటల్లో వింటున్నప్పుడు కళ్ళు చెమర్చని ప్రేక్షకులు లేరేమో. ఆ మౌనం తోనే మాయా ఏంజలో  స్కూల్ కెళ్ళింది. ఎవ్వరితో మాట్లాడలేని మాయా లైబ్రరిలో వున్న ప్రతి ఒక్క పుస్తకం చదివేసింది. అలాంటి దశలో ఆమెకు దొరికిన ఆలంబన ‘ కవిత్వం ‘. అంతే ఆమె ఆ కవిత్వపు ప్రేమలో పడిపోయింది. కవిత్వం నా sanity ని కాపాడింది అని మాయా ఏంజలో చెప్పినప్పుడు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. తనకు పదకొండేళ్ళప్పుడు తాను షేక్ స్పియర్  రచనల్ని చదివి  అది రాసింది సౌత్ లో రేప్ కు గురైన ఒక నల్ల అమ్మాయి అని ఎంత గట్టిగా నమ్మిందో చెప్పినప్పుడు సభలో నవ్వులు విరిసాయి.

జీవితంలో ఎన్ని రకాల వొడిదుడుకులొచ్చినా సరె, కవిత్వాన్ని, రచనని మాత్రం తానెలా వొదిలిపెట్టలేదొ,అదే తనకొక ‘ ఔట్ లెట్ ‘ ఎలా అయిందన్న విషయాన్ని ఆమె చెప్పినప్పుడు చిన్నచిన్న వాటికే మనం ‘ రైటర్స్ బ్లాక్  ‘ అనుకోవడం ఎంత అసంబద్ధమో తెలిసివచ్చి తలదించుకోవాల్సి వచ్చింది. మాయా ఏంజలో తన కొత్త పుస్తకం Letters To My Daughter నుంచి ఒక చిన్న చాప్టర్, అలాగే తన కవిత ఒకటి  చదివి వినిపించటం వల్ల ఆమె చేసింది ఒక ప్రసంగం లా కాక ఓ అద్భుత performance అనుభూతిని మిగిల్చింది. అయితే నా చేతిలో వున్న ఎంపి3 ప్లేయర్ సరిగ్గ చార్జ్ కాకపోవటం వల్ల, ఆమె మాటల్ని మళ్ళీ మళ్ళీ వినటానికి వీలుగా ఆమె ప్రసంగాన్ని రికార్డ్ చేసుకోలేకపోవడం ఒక దురదృష్టం గా ఇప్పటికీ భావిస్తాను. ఆమెను చూసి, ఆమె ప్రసంగం విన్న స్పూర్తి నాలో నిద్రాణమై వున్న కవితాశక్తిని మళ్ళీ మేల్కొలిపింది.

మాయా ఏంజలో అంటే  వర్తమాన సాహిత్యంలో ఒక తిరుగులేని స్వరం. గత ఏప్రిల్ లో మాయా  70 వ పుట్టినరోజు సందర్భంగా ఓప్రా  షో లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓప్రా అడిగింది ” వయస్సు మీదపడటం గురించి ఏమనుకుంటున్నారని?”. అప్పుడు మాయా ఇచ్చిన సమధానం— ” ఏమి జరిగినా సరే, అదెంతో  చెడుగా ఇవాళ కనిపిస్తున్నా సరె, జీవితం ముందుకే సాగిపోతుంది. రేపు ఎప్పుడూ బాగుంటుందన్నది  నేను నేర్చుకున్న పాఠం”

మాయా ఏంజలో మిగతా రచనల్లాగే ఆమె కొత్త పుస్తకం ” లెటర్స్ టు మై డాటర్” కూడా మనమెవ్వరం కూడా మర్చిపోలేని పుస్తకం. ఈ పుస్తకంలో జీవితం, నమ్మకం, మాత్రుత్వం, కరుణ, మానవత్వానికి సంబంధించిన విషయాల మీద 28 చిన్న వ్యాసాలు, కొన్ని కవితలు వున్నాయి. మనం ఆ పుస్తకం నుండి  ఎంతో ప్రేమను పొందుతాము. జీవన సూత్రాల్ని, పాఠాల్ని నేర్చుకో గలుగుతాము. అందుకే అది ఒక్కసారి మాత్రమే చదివి పక్కనపెట్టేసే పుస్తకం కాదు. మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ, ఇతరులతో పంచుకోవాల్సిన   పుస్తకం. అందులో ఆమె ఇలా అంటారు ” నేను ఒక పిల్లవాడికి జన్మనిచ్చాను. కాని నాకు వేలవేలమంది కూతుర్లున్నారు. నువ్వు నలుపో, తెలుపో, యూదువో, ముస్లిమో, ఏషియనో, స్పానిష్ మాట్లాడుతావో,లేదా నేటివ్ అమెరికన్ వో. నువ్వు లావుగా వుంటావో, సన్నగా వుంటావో, అందంగానో, లేక మాములుగా వుంటావో, నువ్వు గే లేదా స్ట్రైట్, చదువుకున్నావో లేదా నిరక్షరాస్యురాలివో, కాని నేను మీ అందరితో మాట్లాడుతున్నాను. ఇదిగో మీ అందరికి నేనిది సమర్పిస్తున్నాను ” అంటారు. ఆమె ప్రేమను, ఆమె అందించిన కానుకల్ని అందుకున్న మనం ఎంతో అదృష్టవంతులం. ఆ పుస్తకం చదువుతున్నంత సేపు ఎవరికి వారం మనం ఆమె కూతురైనట్టు, మనం మన తల్లితో మాట్లాడుతున్నట్టు అనుభూతి చెందుతాము. జీవితంలో ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి అనుబంధాల్లోనైనా మనం నిజాయితీతో ఎందుకుండాలో, ఎలా వుండాలో ఒక తల్లిగా ఆమె తన అనుభవాల నుండి చెప్పే మాటలు మనందరికీ ఇవాళ పనికొచ్చే పాఠాలు.

మనలాంటి వాళ్ళందరికి మాయా ఏంజలో ఎప్పటికీ ఆరిపోని  ఒక దీపస్థంభం! ఆ వెలుతురు ముందు మనమంతా మిణుగురులమే!

కల్పనారెంటాల

 

ఓప్రా ఇంటర్వ్యూ లో మాయా ఏంజలో తాను నేర్చుకున్న విషయాల గురించి చెప్పిన ఆణిముత్యాలాంటి మాటలు…

మీ తల్లితండ్రులతో మీ అనుబంధం ఎలాంటిదైనా మీ జీవితం నుంచి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీరు వాళ్ళను ఎంతలా కోల్పొయినది అనుభవంలోకి వస్తుందనేది నేను నేర్చుకున్నాను”.

జీవనం కోసం సంపాదించుకోవటం, ఒక జీవితాన్ని తీర్చిదిద్దటం  ఒకటి కాదని నేను నేర్చుకున్నాను”.

జీవితం ఒక్కోసారి నీకు రెండో అవకాశం ఇస్తుందని నేను నేర్చుకున్నాను”.

ఎప్పుడైనా సరే నేను మనస్పూర్తిగా ఒక నిర్ణయం తీసుకుంటే , దాదాపుగా అది సరైన నిర్ణయమైనట్టు నేను నేర్చుకున్నాను”.

ప్రతిరోజు బయటకెళ్ళి ఎవర్నో ఒకరిని చేరుకొని , ఎవరినో ఒకరిని తాకండి. ఒక వెచ్చటి కౌగిలింత, లేద వీపు మీద ఒక స్నేహపూరిత చరుపు లాంటివాటిని అందరూ ఇష్టపడతారని నేను నేర్చుకున్నాను”.

నేను నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా వున్నాయన్న సంగతి నేను నేర్చుకున్నాను”.

ఇతరులతో నువ్వేమి చెప్పావో వాళ్ళు మర్చిపోతారు. ఇతరులకు నువ్వేమి చేసావో కూడా వాళ్ళు మర్చిపోతారు. కానీ నువ్వు వాళ్ళను  ఎలా ఫీల్ అయ్యేలా చేసావో మాత్రం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరన్న సంగతి నేను నేర్చుకున్నాను”.

 

 

 

 

 

Read Full Post »

బ్లాగ్ ల్లోనూ వున్నారు జ్వాలాముఖులు!
నా కధ ను , ఇతివృత్తాన్ని, ఒక రచయత గా నేను చెప్పదల్చుకున్న విషయాన్ని అర్ధం చేసుకున్న వారందరికి కృతజ్ఞతలు. అర్ధం కాని వారికి, కధ నచ్చని వారికి కూడా ధన్యవాదాలు. మీ అభిప్రాయాల్ని మీరు నిక్కచ్చిగా చెప్పినందుకు. ఇలాంటి కధల్ని అర్ధం చేసుకోవాటానికి తెలుగు భాష ఒక్కటే వస్తె చాలాదేమో. కధలోని పాత్రల సంఘర్షణల్ని ( నేను చెప్పినా, చెప్పకపోయినా, చెప్పలేకపోయినా) అర్ధం చేసుకునే హ్రుదయం కూడా వుండాలని నేను గట్టిగా నమ్ముతున్నాను.
దాదాపు పదిహేనేళ్ళ క్రితం ‘నీలిమేఘలు ‘ స్త్రీవాద సంకలనం వచ్చేనాటికి జరిగిన వాదోపవాదాలు, గొడవలు, బహిరంగ సవాళ్ళు అందరికి కాకపోయినా చాలా మందికి గుర్తుండే వుంటాయి.
జ్వాలముఖి లాంటి పెద్దమనిషి స్త్రీవాద కవితలు ‘ నీలీ కవితలని, బూతు రాతలని , వొళ్ళు బలిసిన రాతలని రాసేసారు.
కాలం ఇంకొంచెం ముందుకెళ్ళినా అలాంటి జ్వాలాముఖులు వుంటూనె వున్నారు.
వైవాహిక అత్యాచారం (marital rape ) గురించో, స్త్రీలు రెండో పెళ్ళీ చేసుకోవడం గురించి మాట్లాడటం కూడా అశ్లీల కధలని నాకు ఇంతవరకు తెలియలేదు. నా అయిదో గోడ లొ శారద ఒకవేళ శారీరక వాంచల కోసమే పెళ్ళి చేసుకోవాలనుకుందనుకోండి. అప్పుడు ఈ కధ porno site లో పెట్టుకోవాల్సిన కధ అన్న మాట. అంతేనా ? ఒక మగవాడు వాంచల కోసం పెళ్ళి చేసుకుంటె సహజం, పదహరేళ్ళకే కొరికలు ఆపుకోలేక ఏవెవో చేస్తే అది మగటిమి, ఒక స్త్రీ యే వయస్సు అయినా కోరికలతో వుండటం,, పోనీ కోరికలతోనే పెళ్ళి చేసుకోవాలనుకోవడం అశ్లీల కధ…. పాఠకుడు తనకు నచ్చినది, తను మెచ్చిన అభిప్రాయాల్ని రచయత నుండి expect చేస్తాడు. ‘ఇలాంటీ’ అభిరుచి, అభిప్రాయాలు, కధాసమీక్ష చేసే పాఠకులు వుండటం ఎవరికి నష్టం? సాహిత్యానికా? రచయతలకా? లేక పాఠకులకేనా?

Read Full Post »

ఆమె కధ

కమలాదాస్ కన్ను మూసింది. ఎక్కువ పరిచయాల్లేకుండా ఏక వాక్యంతో ఎలిజీ ప్రకటించవచ్చు.ఏమి రాయకుండా నాలుగు కన్నీటి చుక్కల తర్పణం విడవవచ్చు. ఈ నాలుగు మాటలైనా ఆమె కోసం కాదు, నా లోపలి వేదనకి స్వాంతన కోసమే.

మాధవి కుట్టి  అలియాస్ కమలాదాస్ అలియాస్ సురయ్యా. మూడు పేర్లు. ఒకటే వ్యక్తి. ఒకటే జీవితం. అనేకానేక మలుపులు. అత్మకధ నుండి అంతిమ ప్రయాణం వరకు అమె చుట్టూ ఎప్పుడూ ఒక వివాదం చుట్టుకొని వుంటుంది. కాని ఆమె ని, ఆమె కవిత్వాన్ని, ఆమె వచనాన్ని పైకి బాహాటం గా వొప్పుకునేవాళ్ళకి, లేని వాళ్ళకు కూడా తెలుసు ఆమె లోని నిజాయితి. వివాహ వ్యవస్థ లోపల, బయటా నిజమైన ప్రేమ కోసం ఆమె చేసిన అన్వేషణ, నిర్భయంగా రాసిన ఆత్మ కధ “My Story” చదివినప్పుడు చలం గుర్తుకు వచ్చేవాడు. మైదానం, MyStory చాలా మందికి ఇప్పటికి కొరుకుడుపడని జామపండ్లే.

కేరళ వెళ్ళినప్పుడు కమలాదాస్ ని, కధాకళి పుట్టిన ప్రదేశాన్ని చూడలేకపోవడం ఎప్పటికి మర్చిపోలేని తప్పిదమే.

Read Full Post »

Older Posts »